నానుడి కథలు ౼డా.దార్ల బుజ్జిబాబు

 కబంధ హస్తాలు
---------------------
         బయట పడటానికి వీలు లేకుండా దుష్టుని వలలో చిక్కుకున్న వారిని కబంధ హస్తాలలో కూరుకుపోయారు అంటూ ఉంటాం. ఇక బయట పడటానికి వీలులేకుండా చిక్కులలో చిక్కుకుంటే ఈ కబంధ హస్తాలు నానుడి వాడటం రివాజు. కబంధ హస్తాలలో పడితే ఇక రాడని, రాలేడని అర్ధం. మరి ఈ నానుడి ఎలా వచ్చిందో చూద్దాం. ఇది రామాయణ కథల నుండి పుట్టింది.
      తండ్రి ఆజ్ఞతో రాముడు అరణ్యవాసం చేస్తున్నాడు. అతనితో పాటు భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు వున్నారు. ఒకానొక చెడు గడియలో  రామ లక్ష్మణులు ఇంట్లో లేని సమయంలో లంక రాజ్యాధినేత రావణుడు సీతాదేవిని మాయోపాయంతో తీసుకుపోయాడు. లంకలో ఉంచాడు. సీతకు ఏం జరిగిందో, ఎక్కడ ఉందో తెలియని రామలక్ష్మణులు సీతను వెదికే పనిలో పడ్డారు. ఇలా వెదుకుతూ వెదుకుతూ  అనేక కష్టాలు పడ్డారు. ఆ క్రమంలో  ఆ అరణ్యంలో ఉన్న కబంధుడు అనే రాక్షసుడి చేతికి చిక్కారు. 
       అసలు ఈ కబంధుడు ఎవరంటే మాతంగ వన ప్రాంతంలో  వుండే రాక్షసుడు. వాడు దుష్టుడు. వికృత రూపంలో ఉండేవాడు. తల ఉండదు. కాళ్ళు ఉండవు. కేవలం మొండెం మాత్రమే ఉంటుంది. పెద్ద బాన పొట్ట, పొడవైన చేతులు ఉండేవి. రొమ్ముల స్థానంలో కళ్ళు ఉండేవి. అవి చురుకుగా పని చేసేవి. ఎంత దూరం లోని వారినైనా ఇట్టే పసిగట్టేవి. కళ్ళతో చూసిన వెంటనే  తన పొడవైన చేతులతో పట్టుకుని  చంపి తినే వాడు.  వాడి హస్తాలలో పడితే ఇక అంతే. తిరిగిరాని లోకంలోకి వెళ్లినట్టే. వాడి పొడవైన హస్తాలకు చిక్కి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఆ కబంధ హస్తాలకు అంత పేరు, వాడుక  వచ్చింది. ఇది కబంధ హస్తాలు కథ.
   రామ లక్ష్మణులు  కబంధుని హస్తాలలో చిక్కుకున్నారని చెప్పుకున్నాం కదా?  వారు ఆ దుష్టుని రెండు చేతులు నరికారు.  వాడి  చురుకైన రెండు కను గుడ్లు పీకేశారు. వాడు పెద్దగా ఆర్తనాదాలు చేస్తు చనిపోయాడు. అప్పుడు ఆ ప్రాంతం వారంతా పెద్ద పండుగ చేసుకున్నారు.
కామెంట్‌లు