సోలాపూర్....;- ప్రమోద్ ఆవంచ 7013272452

 మహారాష్ట్ర లోని ఒక జిల్లా కేంద్రం.రాష్ట్ర రాజధాని ముంబై కి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో
ఉంటుంది.మహారాష్ట్రకు వెస్టన్ రీజియన్ లో, భీమా నది
పరివాహక ప్రాంతం.భీమా నది అక్కడి ప్రజల సాగునీటి, తాగునీటి అవసరాలను తీరుస్తుంది.
సోలా అంటే పదహారు,పూర్..అంటే ఊరు అని అర్థం.
పదహారు గ్రామాలతో నిర్మాణం అయిన ఊరు, సోలాపూర్ 
ఒకప్పుడు,మనం రోజూ వాడుకునే చద్దర్లు, టవల్స్ కి 
ప్రసిద్ది.మా ఊరి నుంచి కూడా ఎంతో మంది పద్మశాలీ
కులస్తులు సోలాపూర్,బీమండీ వంటి ప్రాంతాలకు వలస వెళ్ళినవాళ్ళే. ముప్పై ఏళ్ల క్రితం సోలాపూర్ ఒక వెలుగు వెలిగింది.అక్కడ ఉత్పత్తి అయ్యే హేండ్ లూమ్ వస్ర్తాలకు
ప్రపంచ మార్కెట్లో గొప్ప గుర్తింపు ఉండేది.అక్కడ పవర్ లూమ్స్ పరిశ్రమ ఒక్క మహారాష్ట్ర రాష్ట్ర ప్రజలకే కాదు,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల పద్మశాలీ కుటుంబాలకు జీవనోపాధి కల్పించింది.నా చిన్నప్పుడు సోలాపూర్,బీమండీలో పనిచేసే మా ఊరి పద్మశాలీ కుటుంబాలకు సంబంధించిన
వ్యక్తి, సెలవుల్లో ఊరికొస్తే, అతనికి ప్రత్యేక గుర్తింపు ఉండేది.ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి..మా ఊరు 
చర్లపల్లి.. నల్గొండకు ఆరు కిలోమీటర్ల దూరం.ప్రస్తుతం
మా ఊరు నల్గొండ మున్సిపాలిటీలో ఒక వార్డు అయ్యింది.మా ఊర్లో దాదాపు అరవై శాతం పద్మశాలీ కుటుంబాలే ఉంటాయి.వాళ్ళు కష్టాన్ని నమ్ముకునే మనుషులు.పొద్దంతా కష్టపడుతుంటారు.కొందరు మంగాలు నేస్తుంటారు... ఇంకొందరు పవర్ లూమ్స్...
ఈ పదం ఇంగ్లీషులో,మన తెలుగులో సాంచాలు అంటాం.
మా ఊర్లో పొద్దున అయిదింటికి లేస్తారు పాపం..అప్పటి నుంచి రాత్రి వరకు సాంచాలను నడిపిస్తారు ఉత్పత్తి చేసే
కార్మికులు.వాళ్ళ కష్టానికి తగిన ఫలితం కొన్నిసార్లు ఉండొచ్చు.. కొన్నిసార్లు ఉండకపోవచ్చు... అయినా ఆ వృత్తినే నమ్ముకుని ఇప్పటికీ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.ఇప్పటికీ తెలంగాణ లో అనేక కుటుంబాలు చాలీ చాలని బతుకులతో జీవిస్తున్నారు.
నా చిన్నప్పుడు చేనేత కార్మికులు ఆకలి చావుల వార్తలు
అనేకం విన్నాను.అప్పట్లో వీళ్ళు కష్టపడి నేసే వస్ర్తాలను
మధ్యవర్తి తీసుకెళ్ళి మార్కెట్ లో అధిక రేట్లకు అమ్ముకునీ,వీళ్ళకు మాత్రం రోజు కూలీ ఇచ్చేవారు.ఆ మధ్యవర్తి నేసేందుకు కావలసిన నూలు,ఆ చేనేత కార్మికుడికి వ్యక్తిగత, తాత్కాలిక అవసరాలను చూసుకునేవాడు.దానితో వాళ్ళు మాట్లాడేందుకు అవకాశం ఉండేది కాదు.అలా కాదని మధ్యవర్తి అవసరం
లేదని వాళ్ళే అప్పు చేసీ, నూలు,ఇతర అవసరమయ్యే
ముడిసరుకు కొనుక్కుని, వస్త్రాలను నేస్తే.. వాటిని మార్కెట్ చేసుకోవడం వాళ్ళ వల్ల అయ్యేది కాదు.ఈ కారణంతో సిరిసిల్లలో అనేక మంది చేనేత కార్మికులు
ఆత్మహత్యలు చేసుకునేవారు.నా చిన్నప్పుడు చేనేత కార్మికులు చనిపోయే ప్రాంతం ఏదంటే అది సిరిసిల్ల...
ప్రస్తుతం జిల్లా కేంద్రం.అప్పట్లో న్యూస్ పేపర్ తెరిస్తే మూడు వార్తలు ప్రధానంగా
కనిపించేవి అవి ఒకటి పంజాబ్ లో టెర్రరిస్టు కాల్చివేత
మరొకటి పత్తి రైతుల ఆత్మహత్యలు, ఇంకొకటి ఆర్థిక సమస్యలతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు.... 
అప్పట్లో నాకు తెలిసి అమాయకులైన చేనేత కార్మికుల కష్టాన్ని దోచుకున్న దళారులు ఇప్పుడు సమాజంలో ప్రముఖ వ్యక్తులు అయ్యారు.ఇక్కడ ఒక విషయం చెప్పిన తర్వాత మనం సోలాపూర్ కి వెళదాం.
నేను నా ప్రాధమిక విద్య..అంటే ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు మా ఊర్లో మా బడిలో చదువుకున్నాను.
నాతోటి స్నేహితులు దాదాపు పద్మశాలీలే.ఒక్కొక్కరూ 
చదువులో చాలా తెలివైన వాళ్ళు.చక్రపాణి, లక్ష్మినారాయణ,క్రిష్టమూర్తి, వెంకటేశం ..ఇంకా చాలా మంది ఉన్నారు, నాకు జ్ఞాపకం రావడం లేదు.వీళ్ళంతా బాగా చదివే వాళ్ళు.నలబై సంవత్సరాల తరువాత మా ఊరి స్కూల్ విద్యార్థుల రీ యూనియన్ కార్యక్రమం కొన్ని నెలల క్రితం జరిగింది.చాలా మంది చిన్ననాటి స్నేహితులు 
వచ్చారు.చాలా సంతోషం కలిగింది.అప్పుడే తెలిసింది
మిత్రుడు రాపోలు లక్ష్మినారాయణ తన పరిధిలో కొంత మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాడనీ, చాలా గొప్ప విషయం.స్వార్ధం లేకుండా వచ్చిన దానిలో అందరికీ పంచి తాను కూడా జీవితాన్ని సాగిస్తున్నాడనీ తెలిసింది.ఆలోచించి చూస్తే ఇలాంటి  వ్యక్తులు కూడా ఉన్నారు.వాళ్ళు వెలుగులోకి రావడం లేదు.... కట్ చేస్తే....
            సోలాపూర్ ఒకప్పుడు వందల సంఖ్యలో సాంచాలు, వాటిని నడిపే వేల మంది చేనేత కార్మికులతో
నిత్యం కళ కళలాడుతుండేది.కాలక్రమేణా వాళ్ళు ఉత్పత్తి చేసే వస్త్రాలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయి
సరైన మార్కెట్ లేక హాండ్ లూమ్,సాంచాల కర్మాగారాలు
అన్ని మూతపడ్డాయి.పాపం వాళ్ళ బతుకులు వీధి పాలయ్యాయి.పని లేక చాలా మంది ఇతర ప్రాంతాలకు
వలస వెళ్ళారు.ఇంకొంతమంది ఛాయ దుకాణాలు,ఇతర చిన్న వ్యాపారాలు పెట్టుకుని జీవితాన్ని సాగిస్తున్నారు.
ఒకప్పుడు చేనేత వ్యాపారానికి ప్రముఖమై,వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించిన సోలాపూర్ ప్రస్తుతం ఆర్ధిక పరంగా నీరసపడింది.ఇక్కడి ప్రజలు లోయర్ మిడిల్ క్లాస్ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.అఫర్డబిలిటీ చాలా తక్కువ.క్యాపిటల్
సిటీకి సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల అభివృద్ధి శూన్యం అయ్యింది.
రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం
తాపత్రయం పడడమే తప్ప ప్రజల గురించి పట్టించుకున్నదే లేదు....కట్ చేస్తే...
                   బుధవారం రాత్రి పదకొండున్నరకు మా హాస్పిటల్ లో నేను సీఈఓ అని పిల్చుకునే మిత్రుడు చంద్రశేఖర్ నాకు మహారాష్ట్ర డిపో ఏసీ బస్సుకు టికెట్ 
బుక్ చేసాడు.ఇంట్లో నుంచి పదిన్నరకు బయలుదేరి వెళ్లాను.హైదరాబాద్ టూ థానే...వయా సోలాపూర్ బస్సు అది.చెప్పిన టైం కంటే పద నిముషాల ముందే
ఇంబ్లీబన్ లోని యాభై వ ప్లాట్ ఫామ్ మీదికి వచ్చింది.
జీవితంలో మొదటిసారి సోలాపూర్ వెళ్ళడం.నాకు మొదటి నుంచి కొత్త స్థలాలకు పోవడం ఇష్టం.నా ప్రొఫెషనల్ వర్క్ తో పాటు, అక్కడి ప్రజల జీవన స్థితిగతులను, అధ్యయనం చేయడం నా అభిలాష.
అవకాశం దొరికితే దేశంలోని అన్ని ప్రదేశాలు తిరిగి నా అనుభవాలను ఒక పుస్తక రూపంలో తేవాలన్నది నా
ఆకాంక్ష.ఆ ఉత్సుకతతో, రాత్రంతా నిద్ర రాలేదు. రాత్రి రెండు గంటలకు జహీరాబాద్ దాటాకా పరివార్ డాబా బస్సు ఆపాడు డ్రైవర్.నేను బీదర్, గుల్బర్గా వెళ్ళేప్పుడు
అన్ని బస్సులు అక్కడే ఆపుతారు.అందరితో పాటు నేనూ దిగాను.ఛాయ టోకెన్ తీసుకొని, వేడి వేడి ఇరానీ చాయ్ ని ఆస్వాదిస్తూ చుట్టూ చూసాను.ఒక వ్యక్తి మా బస్సు డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు.సన్నని శరీరం, నెరిసిన జుట్టు, బాగా పెరిగిన తెల్ల గడ్డం, కాళ్ళకు స్లిప్పర్లు,కాళ్ళు
చేతులకు తెల్ల సున్నం అంటి ఉంది.నుదురు,చెవులను కవర్ చేస్తూ తలకు కట్టిన దస్తీ, కళ్ళు లోపలికి పోయి,
కళ్ళ కింద నల్లని మచ్చలు, ఉన్నాయి.కానీ కళ్ళల్లో ఏదో
తెలియని ఆనందం మెరుస్తుంది.ఛాయ్ తిగుతావా అని అడిగా, వద్దు సార్ ఇప్పుడే తిన్నాను అని అన్నాడు.
ఎక్కడిదాకా వెళుతున్నావని అడిగా, సోలాపూర్ అని చెప్పాడు.మూడు నెలలు అయ్యింది సార్ హైదరాబాద్ వచ్చి ఈ రోజు పోతున్న మా ఊరికి అన్నాడు,ఏం చేస్తుంటావ్ హైదరాబాద్ లో అంటే వినాయ విగ్రహాలు తయారు చేస్తాను సార్,ధూల్ పేట్ లో ఒక సేట్ దగ్గర అని చెప్పాడు.మూడు నెలల నుంచి రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు ఒక వారం రోజులు సెలవు దొరికింది,మా ఊరుకు వెళుతున్నాననీ చెప్పాడు.తన వాళ్ళను కలుస్తున్నానన్న సంతోషం తాలూకు మెరుపులు
కళ్ళల్లో కనిపిస్తూనే ఉన్నాయి.మళ్ళీ వచ్చే నెలలో దసరా
ఉంది సార్, అమ్మ వారి విగ్రహాలు తయారు చేయాలి.
సంవత్సరంలో ఆరు నెలలు వినాయకుడు, అమ్మ వారి విగ్రహాలు తయారు చేసే పని ఉంటుందని,మిగితా ఆరు నెలలు నేతలు ,ఇతరుల విగ్రహాలు తయారు చేస్తుంటాం సార్ అంటూ చెప్పాడు.మా అమ్మ నాన్నల విగ్రహం చేయించాలన్న ఆలోచన వచ్చి,ఎంతవుతుంది అని అడిగ
యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అవుతుందని
చెప్పాడు.వాడే మెటీరియల్ ని బట్టి ఇంకా ఎక్కువ కూడా
కావొచ్చు అని చెప్పాడు.బస్సు బయలుదేరుతుందని కండక్టర్ విజిల్ వేయడంతో అందరితో పాటు బస్సు ఎక్కేసాం.ఆ వ్యక్తి వెనక సీట్లో వెళ్లి కూర్చున్నాడు.నాకు 
కనబడలేదు. అర్థరాత్రి రెండున్నర గంటలు అయ్యింది.
నిద్ర రావడం లేదు.బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రకు ఉపక్రమించా... సరిగ్గా అయిదున్నరకు మెళకువ
వచ్చింది...ఆరు గంటల అయిదు నిమిషాలకు బస్టాండులో బస్సు దిగాను.అప్పుడే వర్షం పడి వెలిసినట్లుంది.. ఆకాశం మేఘా వృతమై వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.పోగమంచు కొంచెం కొంచెం వెళ్ళిపోతూ రోడ్డు మసక మసకగా కనబడుతోంది. చుట్టూ మూగిన ఆటో డ్రైవర్లను తప్పించుకుంటూ శివాజీ చౌక్ వైపుకు అడుగులు వేసాను.వర్షంతో తడిచి రోడ్డు తడితడిగా...చల్లని గాలి ముఖాన్ని మురిపిస్తుంటే అద్బుతమైన అనుభూతి.శివాజి విగ్రహాన్ని చుట్టు ముట్టిన ఫాగ్ మెల్ల మెల్లగా తొలగిపోయి, విగ్రహం క్లియర్ గా కనబడుతోంది.బస్టాండ్ నుంచి పది అడుగులు వేస్తే
శివాజీ చౌక్ సోలాపూర్ లో పెద్ద మార్కెట్ సెంటర్.అక్కడే
హోటల్స్, లాడ్జ్ లు,టీ సెంటర్లు...ఇవే కాకుండా వివిధ
రకాల షాపులతో నాలుగు వైపులా విస్తరించి ఉంది.టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి.ఆ ప్రదేశమంతా ఖాళీగా ఉంది.ఇంకో రెండు గంటల్లో ఆ ప్రాంతం నడవడానికి కూడా కష్టంగా మారిపోతుందని అప్పుడు నాకు తెలియదు.మెల్లగా
ముందుకు కదిలాను.....
                                     
కామెంట్‌లు