సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -260
వృద్ధ కుమారీ వర న్యాయము
***************
 వృద్ధ అంటే వృద్ధుడు. కుమారి అంటే కన్యక, పెళ్ళి కాని పడుచు అని అని అర్థం. వర అంటే  దేవతాదుల వలన  పొందబడు కోరిక.
ఈ న్యాయము చాలా సరదాగా వుండటమే కాకుండా మనిషిలోని వివేక చతురతకు,యుక్తికి తార్కాణంగా నిలుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం విషయంలోకి వెళ్దాం పదండి.
ఒకానొక వూరిలో ఒక బ్రహ్మచారి వుంటాడు.అతడికి పేదరికంతో పాటు కళ్ళలో మెల్ల కూడా వుంటుంది. ఆ రోజుల్లో  పెళ్ళి చేసుకోవాలంటే అబ్బాయి దగ్గర తగినంత ధనం ఉండి, అమ్మాయిని కొనుక్కోగల స్తోమత ఉండాలి.
మరి ఈ బ్రహ్మచారి వద్ద ఏమీ లేవు. పైగా వయసు ఐపోతుంది . అందరూ వృద్ధుడు అనే పరిస్థితికి వచ్చాడు.ఇక లాభం లేదనుకుని అడవికి వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తాడు.
అతడి తపస్సుకి మెచ్చి  పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు.అది కూడా ఒకే ఒక్క కోరిక.
ఈ వృద్ధ బ్రహ్మచారి బాగా ఆలోచించాడు. కోరుకునే ఆ ఒక్క వరంతో తనకున్న కష్టాలన్నీ తీరేలా,కావాలనుకున్నవి పొందాలని నిశ్చయించుకున్నాడు.వినమ్రంగా చేతులు జోడించి " ఓ దేవా! నా మనుమడు రాజ సింహాసనం అధిష్టింపగా చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించుము" అని కోరుకున్నాడు.దానితో వృద్ధాప్యం, దారిద్ర్యం పోవడమే కాక తానొక యువకుడై వివాహం చేసుకున్నాడు. సంతానప్రాప్తి కలిగింది,మహైశ్వైర్యము, దీర్ఘాయువు లభించవలెననే అతని ఆశ  ఆ ఒకే ఒక్క వరంతో తీరిపోయింది.
ఇదండీ తెలివి, వివేకం, యుక్తికి సంబంధించిన ఓ వృద్ధ బ్రహ్మచారి కథ. బాగుంది కదండీ!
 
ఇలాంటిదే మరొక కథను చూద్దామా...
ఓ పెళ్ళి కాని అమ్మాయి కథ. దీనిని మారుతున్న కాలానికి అన్వయించి చెప్పుకోవాలి మరి.
సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఆ పడుచుకు వివాహ యోగం లేకుండా పోయింది.దానితో ఆమె కూడా వెళ్ళి తపస్సు చేస్తుంది. ఆమెకూ దైవ దర్శనం కలుగుతుంది.ఆ దైవం  కూడా ఒకే ఒక్క వరాన్ని మాత్రమే కోరుకోవాలని చెప్పడంతో చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది .అన్ని విధాలా లాభదాయకం అయ్యేలా  "నా సంతానం బంగారు పళ్ళెములో మృష్టాన్నము ఆరగిస్తూ ఉంటే చూసి ఆనందించే వరమును ఇమ్మని"  కోరుతుంది."తథాస్తు" అన్నాడా దేవుడు.
ఇంకేముంది రాజైశ్వర్యము కలిగిన వ్యక్తితో వివాహం జరిగింది. సంతానప్రాప్తి కలిగింది.వారంతా ధనవంతులై బంగారు పళ్ళెములలో భోజనం చేస్తూ ఉంటే చూసే అదృష్టం కలిగింది.
అంటే ఒకే ఒక్క కోరిక లేదా  వరం  అనేక లాభాలు పొందేలా చేసినప్పుడు  ఇలా "వృద్ధ కుమారీ వర న్యాయము"తో పోలుస్తూ ఉంటారన్న మాట.
ఇలాంటిదే పురాణాలలోని మహా పతివ్రత అయిన సావిత్రి కథ . ఆ కథను కూడా రేఖామాత్రంగా తెలుసుకుందామా....
సావిత్రి ఎంతో ఇష్టంగా పెళ్ళి చేసుకున్న సత్యవంతుడు   అల్పయుషు వలన మరణిస్తాడు.
అతడి ప్రాణాలను తీసుకొని వెళ్ళడానికి యమధర్మరాజు వస్తాడు. భర్త ప్రాణాలను తీసుకొని వెళ్తున్న యమధర్మరాజును ఎంత వద్దన్నా అనుసరిస్తున్న సావిత్రిని  ఏదైనా వరం కోరుకో "పతి ప్రాణములు తప్ప అంటాడు. సరే అని తన మామగారైన సాల్వ మహారాజుకు కంటి చూపు ప్రసాదించమని కోరుతుంది" అలాగేనని  వరం ఇస్తాడు.ఐనా ఆగిపోకుండా అనుసరించి వస్తుంటే  మరో వరం కోరుకోమంటాడు.ఈసారి శత్రువుల పాలైన తన మామగారి రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని అడుగుతుంది .ఇస్తాడు. ఆ విధంగా సావిత్రి మాట తీరుకు  మెచ్చి ఆమె కోరుకున్నట్లు  ఆమె తండ్రికి 'పుత్ర సంతాన వరం' కూడా ఇస్తాడు.
అయినా తన వెంట వస్తూ వున్న సావిత్రిని కోపగిస్తూ ఇదే ఆఖరి వరం కోరుకోమంటాడు. కానీ ఈ సారి ,'పతి ప్రాణములు తప్ప' అనడం మరిచి పోతాడు.  అది గమనించిన సావిత్రి వెంటనే తనకు "పుత్ర సంతానం కలగాలని" కోరగానే "తథాస్తు" అని వెళ్తుండగా, మళ్ళీ  యమధర్మరాజును ఆగకుండా వెంబడిస్తూ వుంటుంది.
 యమధర్మరాజు కోపంగా "మళ్ళీ యెందుకు అనుసరించి వస్తున్నావని?" అడిగితే "పతి లేకుండా పుత్ర సంతానం ఎలా కలుగుతుంది? " అని ప్రశ్నిస్తుంది.
దాంతో తన తప్పు తెలుసుకున్నా, సావిత్రి యుక్తికి మెచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఆమె భర్త ప్రాణాలను తిరిగి ఇస్తాడు. ఇలా సావిత్రి యుక్తిగా తన భర్తను పునరుజ్జీవుని చేయడమే కాకుండా పుత్ర సంతానం కూడా పొందుతుంది.
 ఇవండీ! "వృద్ధ కుమారీ వర  న్యాయము" యొక్క విశేషాలు.
అందుకే  పెద్దవాళ్ళు కాసింత యుక్తి, మెప్పించే తెలివి తేటలు ఉండాలని అంటుంటారు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు