బావి తరాలకు సాహిత్య మాధుర్యాన్ని అందజేయాలి; --అధికార భాషాసంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి


 భవిష్యత్తు తరాలకు తెలుగు సాహిత్య‌ మాధుర్యాన్ని అందజేసేందుకు రచయితలు కృషి ‌చేయాలని తెలంగాణ రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి అన్నారు. దర్పణం సాహిత్య‌ వేదిక అధ్యక్షులు డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు అధ్యక్షతన ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన పాలడుగు సరోజినీదేవి గ్రంథాల పరిచయ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజాన్ని‌ చైతన్యవంతం‌ చేసేందుకు కళలు ఉపకరిస్తాయని ఆమె అన్నారు. ప్రముఖ జానపద కళాకారుడు పాలడుగు నాగయ్య బుర్రకథలతో సమాజంలో గొప్ప చైతన్యాన్ని తీసుకువచ్చారని మంత్రి శ్రీదేవి పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని సమాజానికి అందించిన ఘనత పాలడుగు నాగయ్యదని ఆమె అభిప్రాయపడ్డారు. పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యాన్ని వెలువరించిన ఆయన కుమార్తె పాలడుగు సరోజినీదేవి తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారని అన్నారు. కవిత్వం ద్వారా కూడా సరోజినీదేవి సమాజాన్ని‌ జాగృతం చేస్తున్నారని ఆమె ప్రశంసించారు. దర్పణం సాహిత్య వేదిక నేటి కవులకు మార్గదర్శకంగా నిలుస్తోందని మంత్రి శ్రీదేవి పేర్కొన్నారు. పాతతరం కృషి కొత్త తరానికి తెలవాల్సిన అవసరం ఉందని సమావేశానికి అధ్యక్షత వహించిన దర్పణం సాహిత్య వేదిక అధ్యక్షుడు డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు అన్నారు. జానపద కళలు వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహనకు ఎంతగానో ఉపయోగపదతాయని ఆయన పేర్కొన్నారు.
జానపద జీవితాన్ని కళారూపంలోకి తెచ్చిన గొప్ప కళాకారుడు పాలడుగు నాగయ్య అని 'పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యం' గ్రంథ పరిచయం చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు, ప్రముఖ కవి డా.నాళేశ్వరం శంకరం అన్నారు. పాలడుగు నాగయ్య రచనల్లో జాతీయతావాదం స్పష్టంగా వెల్లడవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అభివ్యక్తి రచనలకు కీలకమైందని 'సరోజినీదేవి కుసుమాలు' గ్రంథ పరిచయం‌ చేసిన తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య గౌరీశంకర్ అన్నారు. పాలడుగు సరోజినీదేవి కవిత్వం గుండెకు హత్తుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
బుర్రకథలతో పాటు వివిధ జానపద కళల్లో పాలడుగు నాగయ్య కృషి చేశారని గ్రంథకర్త పాలడుగు సరోజినీదేవి చెప్పారు. దర్శకత్వం, నటన, రచన, మొదలైన విభిన్న రంగాల్లో నాగయ్య ప్రతిభ కనిపిస్తుందని ఆమె అన్నారు. సరోజినీదేవి‌ తన రచనల ద్వారా ఆదర్శంగా నిలుస్తున్నారని‌ పాఠశాల విద్యాశాఖ పూర్వ అదనపు సంచాలకులు‌ పసుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. 
 దర్పణం సాహిత్య వేదిక అధ్యక్షులు డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. దర్పణం‌ కార్యవర్గ సభ్యులు జాలిగామ నరసింహారావు, నక్క హరికృష్ణ సమన్వయకర్తలుగా‌ వ్యవహరించారు. దర్పణం సాహిత్య వేదిక ఉపాధ్యక్షులు రామకృష్ణ చంద్రమౌళి స్వాగతంతో కార్యక్రమం ప్రారంభమైంది. సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి డా.చీదెళ్ళ సీతాలక్ష్మి వేదిక కార్యక్రమాలను‌ వివరించారు.‌
ఇటీవల మృతి చెందిన దర్పణం సాహిత్య‌వేదిక సభ్యురాలు ఆచార్య సువర్ణ అలివేలుకు సమావేశం నివాళి అర్పించింది.  ఆచార్య సువర్ణ అలివేలు పేరు మీదుగా ప్రతి ఏటా పురస్కారం అందజేస్తామని ఆమె కుమార్తె నాగస్వప్న ఈ సందర్భంగా ప్రకటించారు. ఆకాశవాణి, దూరదర్శన్ సంస్థల పూర్వ అదనపు డైరెక్టర్ జనరల్ డా.రేవూరి అనంత పద్మనాభరావు,  కవులు  సత్యమూర్తి, నాగస్వప్న, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్పణం సాహిత్య వేదిక 40 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించింది.


కామెంట్‌లు