సతీష్ కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు.

 పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం నీలానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రోపాధ్యాయులుగా పనిచేస్తున్న సూరు సతీష్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ జిల్లా స్థాయిలో గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన పార్వతీపురం బైపాస్ రోడ్డు లో గల సి కన్వెన్షన్ హాల్ లో సతీష్ కు, 
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసనసభ్యులు అలజంగి జోగారావు, కమీషనర్, ఆర్జేడీ మరియు డెప్యూటీ డీఈవో తదితర ప్రముఖుల చేతులమీదుగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేసారు. 
రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశించిన మేరకు, సెంటర్ ఫర్ టీచర్ ఎక్రిడేషన్ (సెంటా) నేతృత్వంలో ఏభై ప్రశ్నలతో ఎనభై మార్కులతో నిర్వహించిన అంతర్జాల గణిత పరీక్షలో పాల్గొన్న సతీష్, జిల్లా స్థాయిలో ప్రథమంగా నిలిచి, ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 
పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి ఎల్లవేళలా కర్తవ్య దీక్షతో పనిచేసే సతీష్, విద్యార్థులను అనేక పోటీ పరీక్షలకు అదనపు తరగతులను నిర్వహించి వారిలో అంతర్గత శక్తులను వెలికితీయుటలో నిరంతరం శ్రమిస్తూ సత్ఫలితాలను సాధించేలా పయనిస్తున్నారు.
పాలకొండ వాస్తవ్యులు కమలకుమారి, జనార్ధనరావు దంపతుల కుమారుడైన సూరు సతీష్, తన మేనమామ బాలేరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె.రమేష్ సంరక్షణలో పెరిగారు. 
సతీష్ భార్య ఎన్.రత్నకుమారి కూడా గణిత శాస్త్రోపాధ్యాయనిగా పాలకొండ పెదకాపువీధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. 
బాల్యం నుండి చదువుల స్థాయిలో అనేక సార్లు ప్రథమ స్థానంలో నిలుస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చిన సతీష్ తొలుత కొత్తూరు మండలం కలిగాం, సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట, సోంపేట మండలం ఎర్రముక్కాం, వీరఘట్టం మండలం నడిమికెల్లలో పనిచేసి, ప్రస్తుతం నీలానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ మొత్తం 18సంవత్సరాల సర్వీసు కలిగియున్నారు. 
సతీష్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం స్వీకరించుట పట్ల నీలానగరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత గుంట్రెడ్డి రవిప్రసాద్, మండల విద్యా శాఖాధికారులు గౌరునాయుడు, ఆనందరావు, 
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు