సానుకూల దృక్పధం;- సి.హెచ్.ప్రతాప్

 సానుకూల దృక్పథం ఉన్నవారు.. మిగతావారితో పోలిస్తే సంతోషంగా ఉంటా రన్నది తెలిసిన విషయమే. ఆ పాజిటివ్‌ వ్యక్తుల లోకం మరింత అందంగా ఉంటుందనీ మనకు తెలుసు. కానీ ఇలాంటి దృక్పథం ఉన్నవారు, మరింతకాలం జీవిస్తారని హార్వర్డ్ శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనాలలో కనుగొన్నారు.ఇతరులతో పోలిస్తే ఆశావాదులు… 5.4 శాతం ఎక్కువకాలం జీవించే అవకాశం ఉందనీ, 90 ఏండ్లను మించి బతికే ఆస్కారం పది శాతానికి మించి ఉందనీ తేల్చారు. మంచి వ్యాయామం, పోషకాహారం ఈ ఫలితాలను ఇంకొంత మెరుగు పరుస్తాయని కూడా నిర్ధారించారు.ఒత్తిడితో మన రోగ నిరోధక శక్తి మరింత తగ్గుతుందని మరో ప్రయోగం నిరూపిస్తున్నది. ఉద్యోగంలో చిరాకు, వివక్ష, మనసును కలచివేసే సంఘటనలు… ఇవన్నీ కూడా మనలో ఒత్తిడిని పెంచేవే. వీటివల్ల క్యాన్సర్‌, హృద్రోగం లాంటి సమస్యలతో పాటు రోగ నిరోధక శక్తి తగ్గుతుందని సౌత్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు.రోగ్యంగా వుండాలంటే దేంట్లోనూ అతి పనికిరాదు. ఎక్కువకాలం జీవించిన వ్యక్తుల జీవితాలను పరిశీలిస్తే మనకి ఒక విషయం తెలుస్తుంది. వారు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. ఎంత సరదాగా జీవితం గడపాలో అంత సరదాగానూ జీవితం గడిపారు. వృద్ధులు జీవించే ప్రదేశం కూడా వారి ఆయుష్షుపై ప్రభావాన్ని చూపిస్తుంది.ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూలంగా ఉండటమంటే అది సమస్యల్లో ఉన్నప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండటం, ఆ సమస్యల్లో ఉన్న మంచిని గ్రహించడం అని అర్థం. ఈ రకమైన స్వభావం అలవాటు చేసుకోవడం వల్ల వ్యక్తుల్లో మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది.
కామెంట్‌లు