త్రిభాషా సూత్రం;- సి.హెచ్.ప్రతాప్

 ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషల దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడక్కడ తెలుగు మాతృభాష దినోత్సవాలను కూడా జరుపుకోవడం జరుగుతున్నది. ప్రపంచ తెలుగు భాష మహాసభలు కూడా జరుపుతున్నారు. తెలుగు మాతృభాష సమ్మేళనాలను జరుపుతున్నా, ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నా తెలుగుభాష గొప్పదనాన్ని, కమ్మదనాన్ని సాహిత్యాన్ని గురించి వెలుగెత్తి చాటడం సాహితీవేత్తలను సన్మానించడం, పొగడడం, రచయితలు, కవులు, వారి వారి కవితలను వేదికమీద వల్లెవేసి గానంచేసి ఒకరినొకరు పొగుడుకోవడం వరకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణ శూన్యంగానే మిగిలిపోతున్నది. చిన్ననాటి నుండి చిన్నారుల తొలి పలుకులు మమీడాడీలనుండే ఆరంభం అవుతున్నాయి.ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలను ప్రభుత్వేతర ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివించడం, నిరక్షరాస్యులైన గ్రామ ప్రజల్లో కూడా ఇంగ్లీషు వ్యామోహం పెరగడంకూడా తెలుగు భాష కనుమరుగైపోతుండడానికి మరో కారణం. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి ఆయా భాషల ఉపాధ్యాయులను పాఠశాలలో నియుక్తి చేయపోవడం పాఠశాలల నిర్వహణను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంవల్ల ఉత్తమమైన విద్యా ప్రమాణాలను సాధించలేకపోవడంవల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలు సదభిప్రాయం కోల్పోతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీషు మాధ్యమంలో ఎన్ని పాఠశాలలు నడుపుతున్నా లక్షలమంది విద్యార్థులు చదువుతున్నా ఇరవై శాతం విద్యార్థులు మాత్రమే ఉన్నత ప్రమాణాలు సాధిస్తున్నారని సర్వేసంస్థలు చెపుతున్న మాట. మాతృభాష తెలుగు మాధ్యమంగా విద్యనభ్యసించిన వారే విదేశాల్లో మంచిగా వారి విధుల్లో రాణిస్తున్నారు.రాష్ట్రాల మధ్య భాషాపరమైన అంతరాన్ని తగ్గించడం ద్వారా జాతీయ సమైక్యతను తీసుకురావడానికి మూడు భాషా సూత్రం బాగా ఉద్దేశించబడింది. అయితే ఇది భారతదేశంలోని జాతి వైవిధ్యాన్ని ఏకీకృతం చేయడానికి అందుబాటులో ఉన్న ఏకైక ఎంపిక కాదు. తమిళనాడు వంటి రాష్ట్రాలు తమ సొంత భాషా విధానంతో విద్యా ప్రమాణ స్థాయిలను పెంచడమే కాకుండా త్రిభాషా సూత్రాన్ని అవలంబించకుండానే జాతీయ సమగ్రతను పెంపొందించాయి. అందువల్ల, భాషా విధానంలో రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించడం అనేది భారతదేశం అంతటా మూడు భాషా సూత్రాలను సజాతీయంగా విధించడం కంటే చాలా ఆచరణీయమైన ఎంపికగా కనిపిస్తోంది.
కామెంట్‌లు