నడిచే శిఖరం;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు9849305871
ఆకాశాన్ని దాటి 
ఇంకా పైపైకి నడుస్తూ
భ్రమలకు ఆమడ దూరంలో 
ప్రతిబింబాలకు ఆవల బతుకుతూ 
నడిచే శిఖర మైత్రీ బంధం 

తలనెత్తి ఎత్తుకున్న శిఖరం 
ప్రవాహ అస్తిత్వానికి అద్దం 
ఆకలి నేర్పిన ఆత్మవిశ్వాస పునాది అది
దర్పాలకు బహు దూరం 
దూపకు ఎంతో దగ్గరి బంధమై సాగే

'మర' లా తిరుగడం రాని
మమతానురాగాల గరిశెను
దయాపారావతారాల లోగిట
మళ్లీ మళ్ళీ పలకరించే మాటల కిటికి నేను 
ఉజ్జ్వల చైతన్య సంతకం నా నడక 

శిరశ్శిఖరంలో దాగుంది
ఆలోచనల నిధి తరగని గనిలా 
వాడినకొద్దీ తోడుకోనిచ్చే సాత్వికత తన సొంతమై
వినియోగించినకొద్దీ పదునెక్కే  ఆత్మీయ చలన సముద్రం అవిశ్రాంతత తన ఊపిరై
పంటపొలాల కదిలి ఆడే
మమతల చెట్టు పరిమళం వీచేను అక్కడ

కామెంట్‌లు