పోతేపోనీ!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
గడచిపోయిన
వెన్నెలరాత్రిని
నిత్యమూ
కావాలనికోరకు

వాడిపోయిన
పువ్వును
తిరిగి
వికసించమనకు

విడిచిపోయిన
నవ్వును
మరలా
మోమునావరించమనకు

జరిగిపోయిన
విషయాలను
మరీమరీ
మననంచేసుకోకు

గతించిన
కాలాన్ని
మరలమరలా
తలచుకోకు

గడచిపోయిన
ప్రాయాన్ని
మళ్ళీ
పొందాలనుకోకు

చెదిరిపోయిన
కలను
మరోసారి
రమ్మనికోరకు

చిక్కినదాన్ని
చప్పరిస్తూ
పాతరోజులమిఠాయిని
గుర్తుకుతెచ్చుకోకు

మూసుకుపోతున్న
కళ్ళను
బలవంతంగా
తెరవాలనుకోకు

తీరని 
కోరికలకై
పదేపదే
తపించకు

ఇంకిపోయిన
నదిని
గతంలా
లేచిప్రవహించమనకు

నిన్నటి
విషయాలు మరచిపో
రేపటి 
సంగతులు తలచుకో

కామెంట్‌లు