బడి పిల్లలంతా ఊరంతా తిరుగుతూ దసరా పద్యాలు ఆలపించుట తరతరాల ఆచారమని జిఎంఆర్ విఎఫ్ ప్రతినిధి లావేటి రాజు అన్నారు. రాజాం మండలం పలు గ్రామాల్లో రాజాం జిఎంఆర్ విఎఫ్ కమ్యూనిటీ విభాగం జనరల్ మేనేజర్ కె.జయకుమార్, అసోసియేట్ మేనేజర్ వై.సాయికిశోర్ ల నిర్దేశాలతో ఈ దసరా బాణాల పండుగ ర్యాలీలను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ దుష్టశిక్షణ కోసం ఆ దుర్గాదేవిని వేడుకొనడానికే ఈ పూలబాణాల సంస్కృతియని అన్నారు. బాణాలు ఎక్కుపెట్టి అందులో పూలు, పత్రిలను ఆ దసరామాతకు అభిషేకమొనర్చుటతో బాలలంతా ఈ బాణాల పండుగను ఆస్వాదిస్తారని అన్నారు. రాజాం పురపాలక సంఘ పరిధిలో గల కొత్తవలసలో నేడు ఈ ర్యాలీ కార్యక్రమం జరిగింది.
పిల్లవారికిచాలు పప్పుబెల్లాలు, శీఘ్రముగా పంపుడీ శ్రీమంతులారా అంటూ దసరా పద్యాలు మారుమ్రోగాయి. మంగళకరమైన జీవితాలను గుణాత్మక విద్య చదువులతోపాటు వినయవిధేయతలను ఆ లక్ష్మి, పార్వతి, సరస్వతి, కనకదుర్గమ్మలు అందించేందుకే ఈ బాలల బాణాల పండుగ పరమార్ధమని లావేటి రాజు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డి.వాసుదేవరావు మాట్లాడుతూ ప్రజలందరూ వాహన పూజ, ఆయుధ పూజ, బాణాల పండుగలు చేస్తూ విజయాలు పొందేలా ఆ విజయదశమి కాళికాదేవిని కొలుచుకుంటారని, ఆ తల్లి శుభాశీస్సులు చేకూరేలా ఈ విద్యార్థుల బాణాలతో చేసిన పూజలు దోహదపడతాయని అన్నారు. ర్యాలీలో దసరాకి వస్తమని విసవిసలు పడకు, ఏదయా మీదయా మామీద లేదు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రారాజు మహారాజా రాజమార్తాండా వంటి దసరా పాటలు హోరెత్తించాయి. బాణాలు పట్టుకొని పిల్లలంతా తిరుగుతూ పాడే దసరా పద్యాలు పాటలను ప్రజలంతా స్వాగతిస్తూ బెల్లాలు, అటుకులు, పాయసం, ప్రసాదాలనిచ్చీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ వాలంటరీ మొయిల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి