సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -302
షష్ఠాద్య న్యాయము
*******
షష్ఠి అంటే ఆరు. ఆద్య అంటే మొదటి. షష్ఠాద్య అంటే ఆరుగురిలో మొదటి వాడు అన్నట్లు.
 ఆరుగురిలో మొదటి వాడు అంటే ఎటునుంచి చూస్తే మొదటి వాడు?. గుండ్రంగా కూర్చొని ఉన్నారనుకుందాం. ఎవరి నుండి మొదటి వాడు?  ఎవరైనా తమ మనసులో ఎవరో ఒకరిని అనుకొని వారిని మొదటి వాడుగా ప్రారంభించి లెక్క పెడితే వారి ఆలోచన లెక్క ప్రకారం నిజమే కానీ ఇతరులు అనుకున్న వ్యక్తి మొదటి వాడు కాకపోవచ్చు.
అంటే ఈ చెప్పడంలో స్పష్టత లేదన్న మాట.అలా  మొదటి వాడు ఎవరో తేలాలి అంటే ఫలానా తెల్ల చొక్కానో, జుట్టునో  మరేదో ప్రత్యేకత కలిగి వుండి,అదీను వరుస క్రమాన్ని నిర్థారణ చేసి చెప్పినట్లయితే ఆ మొదటి వ్యక్తి ఎవరో తెలుసుకోగలం.
ఇలా అనిర్థారిత విషయాన్ని  అంటే తమకు పూర్తిగా తెలియని, సరిగా తేల్చుకోలేని విషయాలను ప్రస్తావించేటప్పుడు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఒకానొక సారి  ఒక నాయకుడు మైక్ పట్టుకుని  ఆగకుండా మాట్లాడుతూ ఉన్నాడట. ఆ సభకు హాజరైన సభికుల్లో  కొందరు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ప్రసంగానికి అంతరాయం కలిగించడం మొదలుపెట్టారట. తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారనే కోపంతో "మీలో సగం మంది మర్యాద తెలియని మూర్ఖులు ఉన్నారు "ఆవేశంగా అన్నాడుట.
దాంతో వింటున్న వారిలో నిరసన స్థాయి పెరిగింది. ఆ మాటను ఉపసంహరించుకోవాలని, లేదా అలా అన్నందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనని సభికుల్లోంచి కొందరు  లేచి ఆందోళన చేపట్టారట.వెంటనే ఆ నాయకుడు "పొరపాటయ్యింది మీలో సగం మంది మేధావులు ఉన్నారని ఒప్పుకుంటున్నాను" అని వినయంగా జవాబిచ్చాడట. దాంతో అందరూ శాంతించి ఆయనగారి ప్రసంగం  విన్నారట.
ఇందులో ఆ నాయకుడు సగం మంది మూర్ఖులు అనగానే ఆవేశ పడ్డవారు, మరి సగం మంది మేధావులు అనగానే ఊరుకున్నారు. ఈ విధంగా  ఫలానా అని తేల్చి చెప్పకుండా వాళ్ళ నిరసనను సమయస్ఫూర్తితో తప్పించుకున్నాడు.
అయితే ఆ వచ్చిన సభికుల్లో ఎవరు మేధావులు? ఎవరు మూర్ఖులు?స్పష్టత లేదన్న మాట.
ఇలా ఏదైనా సమస్య నుండి ఒడుపుగా బయట పడేందుకూ, సమయస్ఫూర్తితో వ్యవహరించేందుకు ఈ న్యాయమును ఉపయోగించుకోవచ్చన్న మాట.
ఇదండీ "షష్ఠాద్య న్యాయము" అంటే...
తెలుగులో ఓ సామెత ఉంది. "రాజు గారి చిన్న భార్య మంచిది" అని.అంటే పెద్ద భార్య మంచిది కాదని అర్థమేగా. అలా అన్న తర్వాత రాజు గారు తప్పకుండా నాలుక కరుచుకుని వెంటనే 'మీలో ఒకరు చాలా మంచివారు' అనే ఉంటాడు.లేదంటే  ఏం జరుగుతుందో  ఊహించక్కర్లేదు కదండీ!
అప్పుడప్పుడూ మనకూ ఇలాంటి సంఘటనలు సందర్భాలు ఎదురవుతూనే వుంటాయి.కాసింత యుక్తి,సమయస్ఫూర్తి ఉపయోగించి అలాంటి వాటి నుండి బయట పడదాం. మరి  మీరేమంటారు?.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం