సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -290
శ్యేన కపోతీయ న్యాయము
******
శ్యేన అంటే డేగ, తెలుపు అనే అర్థాలు ఉన్నాయి.కపోతము అంటే పావురము, గువ్వ అనే అర్థాలున్నాయి.
పావురం డేగ బారిన పడినట్టు అని అర్థం .
ఇక్కడ డేగ బలం, ఆధిపత్యానికి ప్రతీక. పావురం సున్నితం సాధుత్వానికి చిహ్నం. బలవంతుల బారిన పడిన వారికి ముప్పు తప్పదు అనే అర్థంతో మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి డేగ, పావురాల యొక్క లక్షణాలు, జీవన విధానాన్ని గురించి తెలుసుకుందాం.
డేగ రాబందును పోలి ఉంటుంది. పెద్ద తల, బలమైన ముక్కు వుంటుంది.ఇది సాధారణంగా ఇతర పక్షుల కంటే బరువుగా వుంటుంది .విశాలమైన రెక్కలు, బలమైన, శక్తివంతమైన కండరపు పాదాలను కలిగి వుంటుంది. డేగలు ప్రధానంగా ప్రత్యక్ష ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి.
ఈ డేగలకు తీక్షణమైన, చురుకైన కంటి చూపు వుంటుంది.మానవుల కంటే నాలుగు రెట్లు అధికమైన దృష్టిని కలిగి ఉంటాయి.తాము తినే ఆహారమైన అంటే నేలపైన నివసించే కోడి పిల్లలు,పావురాలు మొదలైన వాటిని  చాలా ఎత్తులో నుండే గమనించి,వాటికి ఏ మాత్రం అనుమానం రాకుండా మెరుపు దాడి చేసి పట్టుకుంటాయి.
 డేగను శక్తి, స్వేచ్ఛ మరియు ధైర్యానికి ప్రతీకగా చెబుతుంటారు.
 ఇతిహాస పురాణాలలో డేగకు ఓ  ప్రత్యేకమైన స్థానం ఉంది.డేగను పక్షి రాజు, గరుడుడు అని అంటారు.శ్రీ మహా విష్ణువు యొక్క వాహనం కూడా డేగనే.
అయితే ఈ డేగ  లేదా గరుడుడు తన తల్లిని దాస్యం నుండి విడిపించేందుకు ఎంతో ప్రయాసపడి ఇంద్రుని అధీనంలో ఉన్న అమృతం తీసుకుని వస్తాడు. తల్లీబిడ్డల ప్రేమానురాగాలకు గుర్తుగానూ, బిడ్డలు ఈ విధంగా బాధ్యతగా ఉండాలని చెప్పేందుకు గానూ 'గరుడ పంచమి" పండుగను జరుపుకుంటుంటారు.
రామాయణ విషయానికి వస్తే సంపాతి, జటాయువులైన  డేగల పాత్ర మనందరికీ తెలిసిందే.
నరకాసుర వధ సందర్భంగా శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి గరుడ వాహనంపై  వెళ్ళాడని శ్రీమద్భాగవతంలో  కూడా  డేగ ప్రస్తావన ఉంది.
ఇలా పక్షిరాజు, శ్రీ మహా విష్ణువు వాహనం అయిన డేగ లేదా గరుడుడి గురించి తెలుసుకున్నాం కదా!
పనిలో పనిగా కపోతం గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పావురాల జాతిలో  పెద్దగా ఉండే జాతులను కపోతాలనీ, చిన్నగా వుండే జాతులను పావురాలు అంటారు. ఇవి  రెండూ ఒకే కుటుంబానికి చెందిన పక్షులు.పావురం లేదా కపోతాన్ని శాంతికి చిహ్నంగా భావిస్తారు.
ఇవి జీవితంలో ఒకే ఒక్క  దానితో జత కట్టి ఆ బంధం జీవితాంతం కొనసాగిస్తాయి. ఒకవేళ తన జంట పావురం చనిపోతే  ఒంటరిగా ఉండి పోతాయని  పరిశోధనలో తేలిందట. వాటి అనురాగ బంధం అంత గొప్పదన్న మాట.
మరి ఈ పావురాలు డేగలకు ప్రకృతి సిద్ధంగా ఏర్పాటు చేయబడిన ఆహారమని  నన్నయ రాసిన ఆంధ్ర మహాభారతంలోని  అరణ్య పర్వములో  డేగ పావురం కథలో చెప్పబడింది.ఇందులో శిబి చక్రవర్తితో  డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు   "శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి" అంటాడు. అంటే  డేగలకు పావురములు  వేద విహితమైన ఆహారమని  చెప్పడం చూస్తాం.
అదంతా పక్షుల ఆహార వ్యవహారాలకు సంబంధించిన విషయం.  అయితే దీనిని మనుషులకు కూడా వర్తింప చేసి చెప్పారు పెద్దలు.
ఈ "శ్యేన కపోతీయ న్యాయము" చదివినప్పుడు బలహీనులు అంటే అంగబలం, అర్థబలం లేని వారు పావురాల్లా ఎంత శాంత మూర్తులైనా, తమ బతుకు తాము బతుకుతున్నా... బలవంతులైన  డేగల్లాంటి వారి బారిన పడి  యిబ్బందులకు, ప్రాణాపాయ స్థితికి గురవుతూ వుంటారనే గ్రహింపు మనందరికీ వస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు