బదిలీ ఉత్తర్వు -నాంపల్లి సుజాత ఉపాధ్యాయురాలు-రచయిత్రి
పైకివి పొడి పొడి అక్షరాలే
ఒక్క బదిలీ ఉత్తర్వు 
తిరుగులేని బ్రహ్మాస్త్రమది
వేళ్ళుఊనిన అనుబంధమైన
ఒకే ఒక్క వేటు
బొడ్డు పేగును తెంచి
చంటి గుడ్డును వేరు చేసినట్టే..!

పాత జలాన్ని ఒంపి
కొత్త నీటిని నింపడం అనివార్యమే
కావచ్చు 
నిన్నటిదాకా..
సర్వస్వం అనుకున్నవన్నీ
చూస్తుండగానే పరాయివై
చేతుల్లోంచి జారిపోతాయి
రేపటి నుంచో కొత్త ప్రపంచాన్ని
హత్తుకోవాలి

రాలి పడిన సుద్ద ముక్కపొడి నుంచీ
రాసి పడేసిన చిత్తు పేజీల దాకా
సుపరిచితమిక్కడ
నను మేలుకొల్పి 
నాలో పత్ర హరితాన్ని
నింపిన ఈ చెట్టు తల్లి కూడా 
ఇప్పటికిప్పుడు పరాయిదే..
ఈ మైదానం
నా సహోపాధ్యాయులు
ఈ నల్లబల్లలూ అన్నీ ఇప్పుడు నాకేమీ కావు 
పిల్లల మెతుకులతో పెరిగిన పిట్టలూ 
రేపటి నుంచి కానరావు

 పేదరికంలో మొలిచిన
 మా సర్కార్ బడి పిల్లలు
 ప్రేమానురాగాల్లో స్వచ్ఛ మల్లెలు
 ఏ వస్త్రంలో ఏ దస్త్రం దాగుందో
 అప్ప చెప్పాలిప్పుడు
 వీడిపోమంటూ
 వీడలేమంటూ
 తడి మేఘాలై వర్షిస్తున్న
 సుమ బాలలని
 గుండెల్లో నింపుకొని వెనుదిరుగుతున్నా..!!

( ఉపాధ్యాయ ఉద్యోగుల జీవితాల్లో బదిలీ ఓ అనివార్యమైన మార్పు.ఇటీవలి ట్రాన్స్ఫర్స్ లో భాగంగా నిన్న సిద్దిపేట జిల్లా జడ్పిహెచ్ఎస్ బస్వాపూర్ నుంచి, జడ్పిహెచ్ఎస్ వర్గల్ కు బదిలీపై వెళ్తున్నప్పటి మా చిన్నారుల వీడ్కోలు దృశ్యం )
- KVM వెంకట్ మొలక పత్రిక ప్రతినిధి:


కామెంట్‌లు