సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -299
శ్వ సభ న్యాయము
******
 శ్వ అంటే శునకము లేదా కుక్క. సభ అంటే సదస్సు లేదా కొలువు, సమూహము.
కుక్కలు సభ జరిపినట్లు  అంటే  సామూహికంగా ఒక చోట కూడినట్లు అని అర్థం.
కుక్కలు మనుషుల పట్ల విశ్వాసంగా తోకూపుకుంటూ  ఇంటికి, మనకు కాపలా వుంటాయి. కానీ అవి తోటి కుక్కలపట్ల మాత్రం సామరస్యంగా స్నేహ భావంతోనూ అస్సలు ఉండవు.
ఒక కుక్క మరొక కుక్కని చూడగానే గుర్రుమంటూ మొఱుగుతుంది.మీద బడి పోట్లాడుతుంది. అంటే ఒక కుక్కను మరో కుక్క అస్సలు ఇష్టపడదు, భరించదన్న మాట.
మరలాంటి కుక్కలు బోలెడన్ని ఒకేచోట చేరితే ఇంకేమైనా  ఉందా?ఇక వాటి అరుపులకు,  పోట్లాటకూ అడ్డూ అదుపూ  వుంటుందా?అంటే అస్సలు ఉండదు.కుక్కల సభ, సమూహంగా పెట్టిన సమావేశం వల్ల ఏమైనా ఉపయోగం వుందా అంటే ఏమీ లేదు.అది ఎంత నిరర్ధకమైనదో,ఆ  సభ వల్ల వాటి అరుపులు వినలేక , పోట్లాట చూడలేక మనకు ఎంత ఇబ్బంది కలుగుతుందో వేరే చెప్పక్కర్లేదు.
మరి దీనిని పెద్దవాళ్ళు "ఎందుకు న్యాయంగా సృష్టించారబ్బా? అని కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఎందుకో ఏమిటో తెలుస్తుంది.
మన చుట్టూ ఉన్న సమాజంలో  బంధు వర్గాల మధ్యనో, ఇతరత్రా తగాదాల కారణంగానో వాటిని పరిష్కరించుకోవడానికి ఇలా సభలు అంటే పంచాయితీలు జరుపుకుంటూ వుంటారు. 
అవి "కర్ర విరగదు - పాము చావదు" అన్నట్లుగా ఉంటాయి .వాద ప్రతి వాదులు ఒకరి మాట ఒకరు వినకుండా ఒకరి మీద ఒకరు గయ్యిమని లేచి కయ్యిమని అరుచుకుంటూ వుంటారు. వాళ్ళను చూస్తూ ఉంటే కలిసి పరిష్కరించుకునే సభలా వుండదు. కాట్ల కుక్కల్లా పోట్లాడుకోవడమే కనిపిస్తుంది. ఒక పట్టాన ఇరువురిలో ఎవరూ రాజీకి రారు. అలాంటి సభలు, పంచాయితీలు మాటల రణరంగంలా భీభత్సంగా వుంటాయి. అందుకే అలాంటి వాటిని చూసిన మన పెద్దలు "శ్వ సభ న్యాయము"తో పోల్చారు.
 అవే కాదు నేడు స్వపక్షాలు, విపక్షాలు అనే తేడా లేకుండా రాజకీయ పార్టీల సభలు ఈ విధంగా జరగడం చూస్తూ వున్నాం. అవి చూసినప్పుడు "వీళ్ళా మన నాయకులు పదవుల కోసం పెదవి జారే మనుషులు" అని అనిపించక మానదు.
 మనుషుల్ని చూసి కుక్కలు నేర్చుకున్నాయో, కుక్కల్ని చూసి మనుషులలా తయారయ్యారో తెల్వదు గానీ వాటి లక్షణాలకు కొందరు మనుషుల లక్షణాలకు చాలా పోలికలు వున్నాయి.
 అవి సాటి కుక్కల సాంగత్యాన్ని భరించవు. ఏదైనా ఆహారం దొరికితే కలిసి పంచుకోవాలని అనుకోవు. వాటిల్లో నిలువెల్లా  స్వార్థం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు ఇది అక్షరాలా నిజం అనిపిస్తుంది.
 అలాంటి వ్యక్తులు ఏ సభలు పెట్టుకున్నా ఫలితాలు శూన్యం. చూసేవారికి అసహనం, అసహ్యం కలిగిస్తాయి.
అలాంటి సభలు సమావేశాలు జరిగినప్పుడు వెంటనే మనకు "శ్వ సభ న్యాయము" గుర్తుకు వస్తుంది.అలాగే కుక్కల సమూహాలు అరుపులను విన్నప్పుడు వ్యక్తులు  నిర్వహించిన కొన్ని  సభలూ,అప్రయోజక  కూటములు గుర్తుకు వస్తుంటాయి.అవును కదండీ!"
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం