అత్యున్నత విలువలే సదా అనుసరణీయం- సి.హెచ్.ప్రతాప్
 మాతృవత్‌ పర దారేషు, పరద్రవ్యేషు లోష్టవత్‌
ఆత్మవత్‌ సర్వ భూతేషు, య: పశ్యతి స పండిత:”
పరస్త్రీలను తల్లులుగా, పరుల సొమ్మును మట్టిబెడ్డలుగా లేక విషపూరితమైనదిగా , సకల ప్రాణు లను తనతో సమానంగా ఎవడు చూడగలడో అతడే అసలైన జ్ఞాని అని ఈ శ్లోకార్థం. ప్రహ్లాదుడు ” కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడ”ని భాగవతం చెబుతున్నది. ప్రహ్లాదుని ప్రవర్తన నేటి యువతకు ఆదర్శం కావాలి. ఎవడైతే ధనం పట్ల పరిశుద్ధుడో అతడే నిజమైన పరిశుద్ధాత్ముడు అవుతాడు. కష్టపడి, న్యాయ మార్గంలో సంపాదించి దానితో తృప్తిపడాలి. వచ్చిన ధనంతోనే మన అవసరాలు తీర్చుకొని, మిగితా ధనాన్ని భవిష్య అవసరాలకు, క్ష్టాలలో వున్న ఇతరులను ఆదుకునేందుకు వినియోగించాలి. ఎక్కువ కావాలనుకొంటే మరింత ఎక్కువ కష్టపడాలి తప్ప తప్పుడు మార్గాలలో సంపాదించ రాదు. పరుల సొమ్ము పాము వంటిది. దానివైపు కన్నెత్తి చూడరాదు, ఆశించరాదు, అసూయ పడరాదు. ఈ విలువలను మనమందరం పాటించడంతో పాటు మన తర్వాత తరానికి కూడా తెలియజెప్పాలి. వారిచే ఆచరింపజేయించాలి. అప్పుడే మన సమాజం ఉన్నత విలువలతో భాసిల్లుతుంది.
 
భగవంతుని ముందు సాష్టాంగ నమస్కారాలు చేయడం కంటే.. అట్టహాసంగా, ఆడంబరంగా పూజలు చేయడం కంటే చేతనైనంతలో సజీవమైన జీవుణ్ని పోషించడానికి కృషి చేయాలి. కష్టంలో ఉన్న వారికి సేవ చేయడమే దేహాన్ని రక్షించడం అత్య్ త్తమం. జపతపాలు, పూజా పునస్కారాలతో భగవంతుని కృపకు పాత్రులం కావాలని కోరుకోవడం కంటే.. ఆర్తులైనవారికి చేయూతనిచ్చి తోడ్పడడమే మానవత్వంలో దైవత్వాన్ని చూడడం అంటే. ఈ సూక్తి మనందరికీ అనుసరణీయం కావాలి. 
కామెంట్‌లు