కార్తీకపురాణం/కార్తీక మాస వైభవం ;- పరిమి వెంకట సత్యమూర్తి- హైదరాబాద్- చరవాణి:9440720324

 నైమిశారణ్యంలో 
సత్ర యాగం చేసే  శౌనకాది
మహామునులు  సూతుని ఉద్దేశించి:
పూర్వం జనక మహారాజుకు   వశిష్ట మహాముని  చెప్పిన కార్తీక పురాణం వినాలని ఉందని తమ కోరిక వెలిబుచ్చారు.
సూతుడు ఇలా చెప్పాడు.
ఈ కార్తీక మహత్మ్యమును మొదట  వశిష్ఠ మహాముని  జనకమహారాజుకు చెప్పాడు.ఈ పురాణం విన్నవారు జనన మరణ సంసార బంధనాలు తెంచుకుని మోక్షం పొందుతారు.
           
          *  
ఒకప్పుడు వశిష్ట మహాముని తన ఆశ్రమానికి వెళుతూ  దారిలో జనక మహారాజును కలుస్తాడు. జనకుడు ఎంతో సంతోషించి ప్రణామాలు  చేసి  
సకల మర్యాదలు చేస్తాడు.  వశిష్ఠుడు ఎంతో సంతోషించి  రాజా!!
రేపు మా ఆశ్రమంలో ఒక యజ్ఞం తలపెట్టాను. కొంత ద్రవ్యం కావాలి  అని అడుగుతాడు.అలాగే ఇస్తాను ఋషివర్యా  అయితే  వినేవారి పాపాలు తొలగే ధర్మ రహస్యాలను తెలుపమని కోరుతాడు. అంతేకాక కార్తీక మాసం అన్ని మాసాలలో కెల్లా ఎందుకు విశేషమైనదో తెలుప గోరుతాడు.
అంతట వశిష్ట మహర్షి
రాజా!!
కార్తీక పురాణము వింటే  సత్వగుణం కలిగి పాపాలు నశిస్తాయి అంటూ ఈ విధంగా చెబుతాడు.
రాజా!! 
సూర్యుడు 
తులారాశిలో ఉండగా 
కార్తీకమాసములో 
చేసిన స్నానము, దానము,అర్చనము పుణ్యప్రదం. ఆరోజు నుంచి నెల రోజులు చేయాలి.
కార్తీక మాసంలో కావేరి నదిలో స్నానం చేసిన వారికి మహాఫలము కలుగుతుంది. అలాగే
చెరువులలో, బావులలో, కాలువలలో, నదులలో
ఈ సమయంలో  శ్రీహరి నివసించి ఉంటాడు.
కార్తీక పురాణం పఠించి గానీ, వినిగానీ 
ఇంటికి వెళ్లి భక్తితో దేవతార్చన చేసి,భోజనం చేసి,ఆచమనం చేసి, పురాణ కాలక్షేపం చేయాలి. సాయంత్రం శివాలయం కానీ, విష్ణు ఆలయం కానీ వెళ్ళి 
శక్తి కొలదీ దీపాలు పెట్టి విష్ణు స్తోత్రం కానీ 
శివ స్తోత్రం కానీ  చేస్తే  వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 
ఇలా కార్తీకవ్రతం ఆచరిస్తే సమస్త పాపాలు నశిస్తాయి అని వశిష్ఠుడు చెప్తాడు.
సోమవార మహిమ
ఈ మాసంలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరిస్తే కైలాసప్రాప్తి కలుగుతుంది. స్నాన,దాన,జపాదుల వల్ల అశ్వమేధయాగం చేసినంత ఫలితం కలుగుతుంది.  కార్తీకమాసంలో ఉపవాసం శ్రేష్టము. అలా కుదరకపోతే  కనీసం రాత్రి భోజనం చేయాలి.ఇది కాక తిలా దానం, స్నానం కూడా ఉపవాస సమానమే. 
కార్తీక సోమవారం రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని  భోజనం చేసిన వారి పాతకాలు నశిస్తాయి.
శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి భోజనం చేస్తే పుణ్యగతులు ప్రాప్తిస్తాయి.
సోమవార మహత్మ్యానికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది.
కాశ్మీరదేశంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె జారిణి.
పర పురుషులతో సంబంధాలు పెట్టుకునేది. భర్త గొప్ప వేద పారంగతుడు. చాలా మంచివాడు. రోజూ అతనిని వంచించేది. ఒకరోజు ఆమె రంకుమొగుడు  
నీ భర్త మన సంభోగానికి అడ్డుగా ఉన్నాడు.
చంపేయమని చెబితే 
ఓ రోజు రాత్రి బండరాయితో భర్తను చంపేస్తుంది.
చివరికి ఆమె
ముసలితనం వచ్చి రాచపుండుతో మరణించి  నరకానికి  పోయి అనేక  బాధలు అనుభవిస్తుంది. తిరిగి భూమికి చేరి  పదిహేను సార్లు కుక్క జన్మ ఎత్తుతుంది.
పదిహేనవ  జన్మలో కళింగ దేశంలో ఒక  బ్రాహ్మణుని  ఇంట కుక్కగా  పుడుతుంది. ఒక రోజు ఆ  కుక్కకు సాయంత్రం వరకు ఆహారం లభించలేదు. ఆ  రోజు 
కార్తీక సోమవారం.  
ఆ ఇంటి బ్రాహ్మణుడు శివలింగాభిషేకం చేసి  ఇంటి బయట భూమి మీద బలిని ఉంచి ఇంట్లోకెళ్లి ఆచమనం చేస్తాడు. ఈ లోపు 
ఆ కుక్క ఆకలితో బ్రాహ్మణుడు ఉంచిన బలిని భుజిస్తుంది.కుక్కకు పూర్వ జన్మ స్మృతి కలుగుతుంది. బ్రాహ్మణుడు  కుక్క పట్ల జాలితో కార్తీక సోమవారం నాడు తాను చేసిన పుణ్యంలో 
కొంత కుక్కకు ధార పోస్తాడు.కుక్క దేహం విడిచి కైలాస ప్రాప్తి పొందుతుంది. 
కావున రాజా!!
కార్తీక వ్రతం ఆచరించు అని వశిష్ట మహాముని జనకుడికి చెప్తాడు.
కావేరి స్నాన ఫలం
కార్తీక మాసంలో స్నాన, దాన,జపాలలో ఏది స్వల్పంగా చేసినా కూడా  అమితఫలం సిద్ధిస్తుంది.శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతం చేయకపోతే నూరు మార్లు కుక్కగా జన్మిస్తారు. 
ఈ విషయంలో ఒక కథ కలదు రాజా విను!!
ఒక బ్రాహ్మణుడు 
తీర్ధ  యాత్రలకు పోతూ దారిలో ఒక మర్రిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మ రాక్షసులను చూస్తాడు.
వాళ్ళను చూడగానే భయపడతాడు. కానీ 
ఆ రాక్షసులకు బ్రాహ్మణుని చూడగానే పూర్వ జన్మ జ్ఞానం వస్తుంది.
వారిలో ఒక రాక్షసుడు
బ్రహ్మణునితో చెబుతూ పూర్వజన్మలో తాను మునసబును,బ్రాహ్మణుని అనీ, తోటి బ్రాహ్మణుల సొమ్ము అపహరించానని ఎవరికీ అన్నం పెట్టలేదనీ చివరికి  ఇలా  రాక్షసుణ్ణి అయ్యానని చెబుతాడు.
రెండో రాక్షసుడు తల్లితండ్రులకు 
పాచి అన్నం పెట్టి 
తాను షడ్రసోపేతమైన భోజనం భుజించేవాడినని చెప్పాడు. 
మూడో రాక్షసుడు గుడిలో అర్చకుడిగా ఉండేవాడినని, స్నానపానాదులు
విడిచి గుడిలో
నెయ్యి నూనె దొంగిలించి,
వేశ్యకు ఇచ్చేవాడినని
దేవునికి నివేదించిన అన్నం అహరించేవాడినని  చెప్తాడు. బ్రాహ్మణుడు వారిపై  జాలిపడి వారిని కావేరి నదికి తీసుకెళ్లి నదీ స్నానం చేయించి
వారి పాపాలను పోగొడుతాడు.
సూర్యోదయ కాలములో కావేరి నదిలో స్నానం చేసి విష్ణు పూజ చేస్తే పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగుతుంది.
దీపదాన మహాత్మ్యం
కార్తీక మాసంలో
శివాలయంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం.ఆవునూనె, నువ్వుల నూనె,విప్ప నూనె ఏమీ  లేకున్నా  కనీసం ఆముదంతో అయినా దీపం వెలిగించాలి. కార్తీకమాసంలో శివాలయంలో భక్తితో కానీ, భక్తిలేకున్నా 
బడాయి కైనా కానీ  ఏ 
విధంగానైనా దీపం వెలిగించితే శివానుగ్రహం కలుగుతుంది.
పూర్వం  ఒక రాజుకు  పిల్లలు లేకుంటే కార్తీకమాసంలో దీపదానం చేస్తే  ఒక కుమారుడు పుడతాడు.వాడు పెరిగి పెద్దవాడయ్యాక
స్త్రీ లోలుడు అవుతాడు.ఒకసారి ఒక అందమైన  బ్రాహ్మణ  స్త్రీని  చూసి
మోహిస్తాడు.
ఇద్దరూ రతిక్రీడలో మునిగిపోతారు.
ఈ సంగతి తెలిసిన బ్రాహ్మణుడు వారిద్దరినీ చంపాలని తలుస్తాడు.
ఒకరోజు రాత్రి ఒక పాత శివాలయం లో బ్రాహ్మణ యువతి తన చీరకొంగు చింపి దీపపువత్తి గా చేస్తే రాకుమారుడు  దీపంలో ఆముదం పోసి దీపం వెలిగిస్తాడు.  
ఆ పాత శివాలయంలో వారిద్దరూ రమిస్తారు. ఇంతలో బ్రాహ్మణుడు వచ్చి వారిద్దరినీ కత్తితో నరుకుతాడు.  రాకుమారుడు కూడా 
శక్తి కూడదీసుకుని బ్రాహ్మణుడిని కత్తితో నరికి చంపేస్తాడు. యమకింకరులు,శివ కింకరులు వస్తారు. 
శివ కింకరులు  బ్రాహ్మణ యువతిని,
రాకుమారుణ్ణి  కైలాసానికి తీసుకెళ్ళటానికి ఉద్యుక్తులవుతారు. బ్రాహ్మణుణ్ణి మాత్రం  యమభటులు  తీసికెళ్లే ప్రయత్నం చేస్తారు.బ్రాహ్మణుడు వారివురూ కైలాసం వెళ్లడమేమిటి  నేను నరకం వెళ్లటమేమిటి  అని కారణం అడిగితే వాళ్ళు పాపులయినా తెలిసో తెలియకో గుడిలో దీపదానం చేశారు.నువ్వు  ఏం చేయలేదు అదే కారణం అంటారు.రాకుమారుడు జాలిపడి తన పుణ్యంలో కొంతఫలము బ్రాహ్మణునికి   ధారపోస్తాడు.
బ్రాహ్మణుడు కూడా కైలాసం చేరుకుంటాడు.
పురాణ పఠన మహత్మ్యం
కార్తీక మాసంలో 
హరి సన్నిధిలో భగవద్గీత పారాయణ చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా విభూతి, విశ్వరూప సందర్శన యోగాలను పఠించాలి.
కనీసం గీతలోని ఒక శ్లోకం పఠించినా ఈ కార్తీకమాసంలో పుణ్యమే.
కార్తీక శుక్ల పక్షంలో  వనములో  ఉసిరిచెట్టు కింద సాలగ్రామము పెట్టుకుని పూజించి వనభోజనం చేస్తే శ్రేష్ఠం.
పూర్వం కావేరి తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.
అతని కొడుకు  దురాచారపరుడు,
దుర్మార్గుడు. ఒకరోజు  బ్రాహ్మణుడు  కొడుకుతో ప్రాతఃకాలంలో కావేరి నదిలో స్నానం చేసి,సాయంత్రం 
హరి సన్నిధిలో 
దీపాలు వెలిగిస్తే అతని పాపాలు నశిస్తాయని చెప్తాడు. అయితే కొడుకు ససేమిరా కాదంటాడు.  తండ్రికి కోపం  వచ్చి  అడవిలో చెట్టుతొర్రలో ఎలుకగా పుట్టమని శపిస్తాడు. అలాగే కొడుకు ఎలుకగా మారి చెట్టుతొర్రలో ఉంటాడు.  ఒకరోజు అటుగా వచ్చిన విశ్వామిత్రుడు చెట్టుకింద ఒక కిరాతకుడికి కార్తీకమాస విశిష్టతను 
బోధిస్తాడు. తొర్రలో ఉన్న ఎలుక అది అంతా విని  ఆ కార్తీక  శ్రవణ మహాత్మ్యంతో ఎలుక  దేహాన్ని విడిచి విప్రుడిగా మారిపోతాడు. ఇలా  భక్తులందరూ కార్తీక మాస ధర్మాలు పాటించి సద్గతి పొందుతారు అని వశిష్ట మహాముని జనకుడికి వివరిస్తాడు.
ద్రావిడ స్త్రీ స్వర్గ గమన వృత్తాంతం
కార్తీక మాసమంతా శ్రీహరికి  కస్తూరితో, గంధంతో, పంచామృతాలతో 
స్నానం చేయిస్తే పదివేల అశ్వమేధ యాగాల ఫలం పొంది చివరకు  పరమపదం పొందుతారు.
పూర్వం ద్రావిడ  దేశంలో  ఒక విధవ ఉండేది 
ఆమె నిత్యం బిక్షాన్నం భుజించేది. 
ధనం తీసుకుని వంట,కుట్టుపని, నూరటం, రుబ్బటం లాంటి పనులు చేసేది.
కొనటం, అమ్మటం చేసేది. ఇలా క్రమంగా ధనవంతురాలైంది.
కానీ ఆ స్త్రీ 
ఏనాడు కార్తీక 
పురాణం వినలేదు, పుణ్యతీర్ధాలకు పోలేదు, ఏకాదశి ఉపవాసాలు చేయలేదు. తాను తినలేదు,ఇతరులకు పెట్టలేదు. ఒకసారి  ఒక బ్రాహ్మణుడు శ్రీరంగం పోతూ   ఈమె స్థితిని గ్రహించి  
అయ్యో!!
ఈ  విధవరాలు  నరకానికి వెళుతుందని తలచి  ఆమెతో అమ్మా!
నిత్యం కాని ఈ దేహాన్ని నమ్మావు. మోహం వీడి,  అలాగే 
అరిషడ్వర్గాలను  వీడి భక్తితో శ్రీహరిని పూజించమని చెప్తాడు.
అలాగే కార్తీక స్నానం చేసి,దానధర్మాలు, దీపదానం చేస్తే అనేక జన్మల పాపం నశిస్తుందని చెప్తాడు. ఆమె అలాగే అని సూర్యోదయాన చల్లని నీటితో స్నానం చేస్తూ 
శ్రీహరిపూజ,దీపదానం, బ్రాహ్మణ సమారాధన  చేసి చివరకు స్వర్గప్రాప్తి
పొందుతుంది.
కార్తీకమాస ధర్మాలు
కార్తీక మాసం అన్ని రోజులూ, వీలుపడకపోతే కనీసం
శుద్ధపాడ్యమి, పూర్ణిమ,అమావాస్య రోజున సూర్యోదయాన ప్రాతఃకాలమునందు స్నానం చేస్తే చాలా పుణ్యం.అలాగే 
ఈ మాసంలో పద్మములతో,తులసీ దళాలతో, మారేడు దళాలతో,ఉసిరిచెట్టు  కింద సాలగ్రామమునకు పూజ చేయాలి.
శ్రీహరి ముందు జపము,హోమము,
దేవతార్చన చేయాలి.
దేశ కాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువు అవుతుంది. 
ఇక్కడ దేశం అంటే పుణ్యక్షేత్రం,కాలం అంటే పుణ్యకాలం, పాత్రము అంటే యోగ్యుడైన బ్రాహ్మణుడు.
పూర్వము అజామిళుడు అనే బ్రాహ్మణుడు దాసీ దానిని ఉంచుకున్నాడు. కొంత కాలానికి దాసీ చనిపోయాక ఆమె  పెంచుకున్న కూతురిపై అతని కన్ను పడుతుంది.
దాసీ పుత్రికతో కూడా సంభోగించి  ఆ పిల్లతో కుమారులను  కంటాడు. వారిలో ఒక కొడుకుకు నారాయణ అని పేరు పెట్టాడు. ఎన్నో పాపకార్యాలు చేసినా మరణ సమయములో యమభటులు రాగా
బిగ్గరగా నారాయణ నారాయణ అని కొడుకు నామం పలుమార్లు ఉచ్చరిస్తాడు.కులబ్రష్టుడైనా కూడా అంత్యకాలంలో నారాయణ నామం జపించి  చివరికి  స్వర్గానికి వెళతాడు.
సుశీల మందర వృత్తాoతం
 
వశిష్టుల వారు జనక మహారాజుకు కార్తీక మాసమందు పురాణ శ్రవణ ఫలితాన్ని సుశీల మందరులనే దంపతుల కథ ద్వార వివరించడం జరిగింది.
మనం పొందిన పుణ్యంలో కొంత ఇతరులకు ధారపోయడం ద్వార   వారు కూడా పాపవిముక్తులౌతారని ఈ కథ తెలియచేయు చున్నది. 
కార్తీక మాసమందు ఏ చిన్న పుణ్య కార్యం చేసినా భగవంతుని కృపకు పాత్రుల మౌతామని  తెలుస్తోంది.
గురుహత్య, మిత్రహత్య, స్త్రీ హత్య,  గురుపత్నీ సంగమం లాంటి ఘోర పాపాలు చేసినవారు కూడా  కార్తీక మాసంలో మరణకాలంలో హరినామ స్మరణ చేస్తే 
పాప విముక్తులవుతారు. అలాగే
కార్తీకమాసంలో దీపదానం,కంచు దానం,దీపారాధనము,ధాన్యము,ఫలము,
ధనము,గృహదానము ఆనంతఫలప్రదాలు.
ద్వాదశి మహాత్మ్యం
కార్తీక మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే 
సమస్త సంపదలు  
వృద్ధి  పొంది సాయుజ్యముక్తి పొందవచ్చును. క్షీరాబ్ది ద్వాదశి శ్రీహరికి మహా ప్రియమైనది.
ఏకాదశి మరునాడు ద్వాదశి వెళ్లిపోక ముందే శ్రీహరికి నివేదించి అన్నం భుజించుట పారణ అంటారు. ద్వాదశి ఘడియలు ఎట్టి పరిస్థితిలో దాటరాదు. లేకపోతే ఏకాదశి వల్ల వచ్చే పుణ్యం నశిస్తుంది.
ఉపసంహారం
ఇలా కార్తీక మాసంలో చేసే పూజలు స్నాన, జప తపాల వల్ల పుణ్యలోకాలు  లభిస్తాయి.  కార్తీక మాసమంతా స్నానాలు చేసి, ఉపవాసం ఉండి 
శివారాధన చేస్తే ఎంతో పుణ్యం. కానీ అలా చేయలేని వారు కనీసం
కార్తీక పాడ్యమి నాడు, ఏకాదశి,ద్వాదశి నాడు, పౌర్ణిమ,అమావాస్య నాడు కనీసం ఒక సోమవారం నాడు అయినా సరి అయిన నియమనిష్టలతో
ఉపవాసం ఉండి గుడికి వెళ్లి దీపాలను వెలిగిస్తే
గొప్ప పుణ్యం లభిస్తుంది. 
కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో ప్రమిదలలో వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన  చేస్తే  
సమస్త పాపాలు నశించి  సర్వ సుఖాలు అనుభవించి స్వర్గప్రాప్తి పొందుతారు అని కార్తీక పురాణం లోని అనేక  కథలు,  ఉపకథలు, ఇతివృత్తాలను బట్టి తెలుస్తోంది.
ఈ మాసంలో  క్షీరాబ్ది ద్వాదశి శ్రేష్టమైనది. 
ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం  చేసుకోవడం   చాలా మంచిది.
   
కార్తీకమాసంలో      హరిహరాదులను కొలిచే అద్వైత తత్వము, అందరూ కలిసిమెలిసి చేసే వ్రతాలు,పూజలు సామూహిక పూజలు, దేవాలయాల్లో భక్తులందరూ దీపాలు వెలిగించగా కాంతులతో మెరిసే ఆలయాలు,  అలా కార్తీకంలో  ప్రతిరోజు పండగే.
అభిషేకాలతో,జ్వాలా
దీప తోరణాలతో  గుడులు కళకళ లాడుతూ, భక్తులందరూ స్నానపానాదులతో పవిత్రమై నదులు,వృక్షాలను  కొలిచే పండుగ.ప్రకృతితో మమేకమై అందరి దేవతలను ఆరాధించే విశిష్ట మాసం కార్తీకం.   అందరి మాసం భక్తులందరికీ విశిష్ట మైన  మాసం  కార్తీకమాసం.
ధనికుడయినా, పేదవాడైనా కార్తీక మాసంలో కథ  విన్నా గానీ,వినిపించినా గానీ 
ఎంతో పుణ్యప్రదం. కార్తీక మహాత్మ్యం సర్వ పాపములను హరిస్తుంది.  
సంపదలకు అధిపతి అవుతారు.అన్ని పుణ్యముల కంటే అధికమైనది.కార్తీక పురాణం చదివినా,  విన్నా ఈ లోకంలో సర్వ సుఖాలు అనుభవించి స్వర్గలోకములో కూడా బ్రహ్మానందం పొందుతారు.
            శుభం
-----------------


కామెంట్‌లు