ముద్దుల కాకి (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ) డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212

 ఒక ఊరిలో ఒక చిన్నపాప వుండేది. ఆ పాప చానా మంచిది. చీమకైనా అపకారం తలపెట్టదు. ఎవరైనా బాధలో వున్నారని తెలిసిందంటే చాలు పరుగెత్తుకొని వెళ్లి చేతనైన సాయం చేసి సంబరపడేది.
ఆ పాప ఇంటి ముందు ఒక పెద్ద వేపచెట్టు వుంది. దాని మీద ఒక కాకి గూడు కట్టుకొంది. అందులో ఒక చిన్నపిల్ల వుంది. అది అప్పుడప్పుడే గుడ్డు పగలగొట్టుకుని బయటకు వచ్చింది. ఇంకా పదిరోజులు కూడా కాలేదు. అంతలో ఒకరోజు ఒక్కసారిగా పెద్ద ఎత్తున గాలీవాన వచ్చింది. ఆ వేపచెట్టు గాలికి అల్లాడిపోయింది. కొమ్మలన్నీ పటపటమని విరిగిపోయాయి. ఆకులన్నీ రాలిపోయాయి. ఆ చెట్టు మీద కాకి గూడు వుంది గదా... అది గాలికి ఎగిరి కిందపడిపోయింది. కాకి మీద పెద్దకొమ్మ పడడంతో పాపం ఆది అక్కడికక్కడే చనిపోయింది. దానితో ఆ చిన్నపిల్ల ఒక్కటే మిగిలిపోయింది.
పాప ఆ కాకిపిల్లను చూసింది. చిన్నగా చిటికెన వేలంత వుంది. ఇంకా ఈకలు గూడా రాలేదు. కళ్ళు గూడా తెరుచుకోలేదు. ఒళ్లంతా ఎర్రగా మాంసం ముద్దలా ఉంది. అది చూసి ఆ పాపకు చానా జాలి వేసింది. ఆ వానలోనే పరుగెత్తుకొని పోయి దానిని అపురూపంగా చేతుల్లోకి తీసుకుంది. ఇంటిలోకి తీసుకొనివచ్చి ఒక చిన్న గూటిలో మెత్తని దూది మీద పడుకోబెట్టింది. కంటిపాపలా పెంచసాగింది. రోజులు మారుతున్న కొద్దీ అది నెమ్మదిగా పెరుగుతా అటూ ఇటూ గంతులేయసాగింది. కావు కావుమంటూ ఇల్లంతా ఎగరసాగింది . ఎప్పుడూ పాప భుజంపైనే వుండేది. ఆ పాప పో అంటే కళ్ళు టపటపా కొట్టుకుంటా తల వంచుకొని దూరంగా పోయేది. రా అంటే సంబరంగా చిటికెలో వచ్చి చేతి మీద వాలి కావుకావుమంటూ నవ్వేది. ఎగరమంటే ఎగిరేది. దుంకమంటే దుంకేది. పాప ఏం చెబితే అది చేసేది. పాప మాటలు దానికి బాగా తెలిసిపోయేవి. పాప దానికి ఒక చిన్న అందమైన గూడు తయారుచేసి ఇంటి ముందున్న చెట్టుకు తగిలించింది. అలా ఆ కాకి నెమ్మది నెమ్మదిగా పెరిగి పెద్దగయ్యింది.
రోజూ పాపతో బాటు ఎగురుకుంటా బడికి పోయేది. పాప బడి నుంచి బయటకు వచ్చేంత వరకు ఏ చెట్టు మీదనో వుండేది. పాప సాయంకాలం బయటికి రాగానే మరలా పాపతో బాటు ఎగురుకుంటా ఇంటికి వచ్చేది. ఆ కాకి చిన్నప్పటి నుంచి పాపతో కలసి పెరగడంతో దానికి మనుషుల మాదిరే బాగా తెలివితేటలు వచ్చాయి. పాప చిన్న చిన్న గిన్నెలు, చెంబులు, గరిటెలు ఇచ్చి... అమ్మకు ఇచ్చి రమ్మంటే ఇచ్చి వచ్చేది. కాగితాలు, పెన్నులు బడి పిల్లలకు ఇచ్చి రమ్మంటే పోయి ఇచ్చి వచ్చేది.
కానీ బడిలో పిల్లలు ఆ పాపను చూసి ఒకటే నవ్వేవాళ్లు. ఎగతాళి చేసేవాళ్లు. మేం చిలుకలను పెంచడం చూశాం. పావురాలను పెంచడం చూశాం. నెమళ్ళను పెంచడం చూశాం, కోళ్లను పెంచడం చూశాం... కానీ నువ్వేందే లోకంలో ఎవరూ ఎప్పుడూ పెంచనట్టు , పెంచడానికి ఏదీ దొరకనట్టు, ఈ పనికిరాని కాకిని పెంచుతా వున్నావు'' అనేటోళ్లు.
ఆ మాటలకు పాప చానా బాధపడేది. కళ్ళనీళ్లు పెట్టుకునేది. కానీ కాకిని ఒక్క మాట కూడా అనేది కాదు.
ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ''ఇంటిలో కాకి తిరిగితే అశుభం, పొద్దున్నే దాని మొగం చూడకూడదు... ఏదో ఒక ఆపదలో ఇరుక్కుంటాం'' అంటూ రకరకాలుగా భయపెట్టే వాళ్లు.
ఆ మాటలకు ఆ పాప అమ్మానాన్న నవ్వేసేవాళ్ళు. ''పాపా... అవన్నీ ఉత్త మూఢనమ్మకాలు. నువ్వేమీ పట్టించుకోవద్దు. రోజూ పొద్దున్నే దేవునిమొగం చూసే మన గుడి పూజారి కూడా మొన్న చీకటిలో గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చూసుకోక దారిలోనున్న పెద్ద బండరాయిని కొట్టుకొని కాలు విరగ్గొట్టుకున్నాడు. కాబట్టి చదువుకున్న మనం ఇలాంటి మూఢనమ్మకాలను అస్సలు పట్టించుకోకూడదు.
పాపం... ఆ కాకి చిన్నప్పటి నుంచి నీ దగ్గరే పెరిగింది. అదీగాక దానికి అమ్మ లేదు. పిడికెడు గింజలు, మిగిలిపోయిన అన్నం మెతుకులు, రొట్టెముక్కలు పెడితే చాలు... సంబరపడి ఎగిరి దుంకుతుంది. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. కాకపోతే ఎప్పుడూ దానితోనే తిరుగుతా, ఆడుకుంటా చదువును చెడగొట్టుకోవద్దు'' అన్నారు.
అమ్మానాన్నలే అండగా నిలబడడంతో ఆ పాప కాకిని మరింత బాగా చూసుకోసాగింది.
ఒకరోజు వాళ్ల బడిలో పిల్లలందరినీ ఊరి బయట జగన్నాథగట్టు పైన వున్న ఒక పాతగుడికి బస్సులో తీసుకొని పోయారు. పాప బస్సులో ఎక్కగానే కాకి సర్రున కిటికీలోంచి దూసుకొని లోపలికి వచ్చింది. అది చూసి ఒక పాప ''పెళ్లికి పోతా పిల్లిని చంకన పెట్టుకొని పోయినట్టు భలే తెచ్చావే ఈ కాకిని'' అంది. ఆ మాటలకు బస్సంతా ఒకటే నవ్వులు. పాపకు ఇలాంటి సూటిపోటి మాటలు అలవాటై పోవడంతో వాళ్లతో పాటు చిరునవ్వు నవ్వుతా దానిని వడిలో పెట్టుకుంది.
బస్సు జగన్నాథగట్టు దగ్గరికి చేరుకుంది. పిల్లలందరూ బిలబిలమంటూ కిందికి దిగారు. పెద్దవాళ్లు ముందు పోతా వుంటే పిల్లలు వెనుక నడుచుకుంటా అక్కడున్న గుళ్లన్నీ చూసి తోటలోకి చేరుకున్నారు. అందరూ నవ్వుకుంటా, మాటలు చెప్పుకుంటా వెంట తెచ్చుకున్న తినుబండారాలన్నీ తిన్నారు. పెద్దవాళ్లు పిల్లలతో ''రేయ్‌ మీరు తోట దాటి బయటకు పోకండి. ఆడుకోండి. సాయంకాలం చీకటి పడకముందే మరలా బయలుదేరుదాం'' అంటూ వాళ్లంతా ఒక చెట్టు కిందికి చేరి మాటల్లో మునిగిపోయారు.
పాప తన తరగతి పిల్లలతో కలసి బంతాట ఆడుకోసాగింది. ఒక పాప బలంగా బంతి విసిరేసరికి అది ఎగిరి తోట బయటపడింది. దాన్ని వెదకడానికి ఆ పిల్లలు బయటకు వచ్చారు. అక్కడంతా రాళ్లగుట్టలు వున్నాయి. ఆ బంతిని వెతుకుతా కొంచెం దూరం పోయారు. అక్కడ ఎవరూ లేరు.
''ఇంక ఈ బంతి దొరికేటట్టు లేదు గానీ పోదాం పద'' అంటూ వెనక్కి తిరిగారు.
అంతలో...
వాళ్లు ఊహించని విధంగా అక్కడ నలుగురు దొంగలు రాళ్ల చాటు నుండి బయటకు వచ్చారు. వాళ్ల చేతుల్లో పెద్ద పెద్ద కత్తులు వున్నాయి.
''ఏయ్‌... అరచకుండా నోరు మూసుకొని మేం చెప్పినట్టు చేయండి'' అంటూ గట్టిగా అరిచాడు ఒకడు.
ఆ పిల్లల నోట మాట రాలేదు. భయంతో గజగజా వణికిపోసాగారు. అంతలో వాళ్లు చేతిరుమాలు తీసుకొని ఆ పిల్లల ముక్కుల వద్ద బలంగా వత్తి పెట్టారు. దానికి మత్తుమందు ఉండడంతో ఆ పిల్లలంతా మబ్బెక్కి ఎక్కడివాళ్ళక్కడ పడిపోయారు. వెంటనే వాళ్లు ఆ పిల్లలను ఎత్తుకొని పోయి అక్కడ రోడ్డు మీద ఆపిన జీపులో పడేశారు.
కాకి ఇదంతా చెట్టు మీద నుంచి చూడసాగింది. దానికంతా గందరగోళంగా ఉంది. పాప ఏదో ఆపదలో ఇరుక్కుందని భయపడింది. అంతలో జీపు కదిలింది. వెంటనే కాకి వేగంగా ఎగురుతా వచ్చి జీపు వెనక నుంచి లోపలికి దూరింది. పిల్లలందరూ కదలక మెదలక ఒకరి మీద ఒకరు పడి వున్నారు. కాకి చప్పుడు కాకుండా ఒక మూలకు చేరి పాపని చూడసాగింది.
ఆ జీపు కొండ దిగి దూరంగా వున్న ఒక మట్టిదారిలోకి పోయింది. చానా దూరం పోయాక ఒక పాడుబడిన ఇంటి ముందు ఆగింది. అక్కడ ఎవరూ లేరు. జీపు తెరిచి ఆ పిల్లలను ఎత్తుకొని పోయి ఒక గదిలో పాడేసి బయట కడ్డీల తలుపుకు తాళం వేశారు. ఒకరిని అక్కడ కాపలా పెట్టి మిగతా ఇద్దరు తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాకి లోపలికి ఎలా పోవాలా అని ఇంటి చుట్టూ ఎగిరి చూసింది. వెనుక వైపు కిటికీ కొంచెం తెరుచుకొని కనపడింది. దానిలోంచి లోపలికి దూరింది. పిల్లలందరూ మత్తుగా కింద పడి వున్నారు. కాకి దగ్గరికి పోయి కావు కావుమంటూ గట్టిగా అరవసాగింది. రెక్కలతో మొహంపై టపటపా కొట్టసాగింది. కానీ పాప కొంచెం గూడా కదలలేదు మెదలలేదు.
ఏం చేయాలబ్బా అని చుట్టూ చూసింది. మూలన ఒక నీళ్ల కుండ కనపడింది. పోయి దాన్ని ముక్కుతో అటూ ఇటూ కదిపింది. అది బాగా బరువు వుండడంతో కొంచెం కూడా కదలలేదు. చుట్టూ వెతుకుతే ఒక రాయి కనపడింది. ఆ రాయిని ముక్కుతో పట్టుకొని పైకి ఎగిరి దభీమని ఆ మట్టికుండ మీదకు వదిలింది. అంతే... కుండ ఫటుక్కుమని పగిలి ముక్కలు ముక్కలయి నీళ్లు గదంతా పరుచుకున్నాయి. పిల్లలందరూ బాగా తడిసిపోయారు. ఆ చల్లని నీళ్లకు మబ్బు దిగి ఒక్కొక్కరు లేవసాగారు.
పాప లేచి చుట్టూ చూసింది. జరిగిందంతా మతికి వచ్చింది. బయటకు ఎలా పోవాలో తెలియక కడ్డీల తలుపుల వద్దకు వచ్చి దభీదభీమని ఊపసాగింది. ఆ చప్పుళ్ళకు బయట కాపలాగా వున్న దొంగ లోపలికి వచ్చి ''ఏయ్‌... ఇక్కడ ఎవరు ఎంత అరిచి గీపెట్టినా ఎవరికీ వినపడదు. కాపాడటానికి ఎవరూ రారు. నోరు మూసుకొని చెప్పింది చెప్పినట్టు చేయండి'' అంటూ కత్తి చూపించి బెదిరించాడు.
దాంతో పాపం... ఆ పిల్లలంతా భయపడిపోయారు. అందరి కళ్ళలోనూ నీళ్లు కారసాగాయి. ఎలా తప్పించుకోవాలో తెలియక బాధతో మట్టసంగా వుండిపోయారు. ఆ దొంగ బయటకి వచ్చి కడ్డీల తలుపులకు గడపెట్టి మళ్ళీ తాళం వేశాడు. కాకి ఇదంతా ఒక మూల నుండి చూసింది. బయట ఆ దొంగ ఒక్కడే వున్నాడు గదా... వాడు కాసేపటికి పనేమీ లేకపోవడంతో తలుపు ముందు పడుకొని నిదురలోకి జారుకున్నాడు.
అవకాశం కోసం కాచుకుని వున్న కాకి నెమ్మదిగా కిందికి దిగింది. ఆ దొంగ దగ్గరికి పోయింది. వాని అంగీ జేబులో తాళంచెవి కనబడుతోంది. నెమ్మదిగా ముక్కు లోపలికి పెట్టి తాళం చెవిని అందుకొని చప్పుడు కాకుండా బయటికి లాగింది.
ఆ తాళంచెవిని తీసుకొని వచ్చి పాప చేతికిచ్చింది. పాప లోపలి నుంచి చేతులు బయటకు పెట్టి నెమ్మదిగా తాళం తెరచి గడ తీసింది. పిల్లలు ఒక్కొక్కరుగా చప్పుడు చేయకుండా బయటకు వచ్చారు. ఇల్లు దాటి బయటకు రాగానే ఒక మట్టి దారి కనపడింది. వేగంగా వురకసాగారు.
కాసేపటికి దొంగ నిదుర నుంచి లేచాడు. ఇంకేముంది తలుపులు తెరచి వున్నాయి. లోపల పిల్లలు లేరు. అదిరిపడ్డాడు. బయటకొచ్చి చూశాడు. ఎక్కడా కనబడలేదు. వెంటనే మిగతా దొంగలకు ఫోన్‌ చేసి జరిగిందంతా చెప్పాడు. వాళ్లు ఆ దొంగను బాగా తిట్టి వెంటనే జీపు వేసుకొని బయలుదేరారు.
పిల్లలు చానా దూరం వురికి వురికి బాగా అలసిపోయారు. ఇంకా ఎంత దూరం పోవాలి అనుకుంటా వుంటే జీపు చప్పుడైంది. ''అయ్యో... ఆ దొంగలు పట్టుకోవడానికి మరలా వచ్చినట్టున్నారు. ఈసారి పట్టుబడితే అంతే...'' అని అందరూ వెనక్కు తిరిగి మరింత వేగంగా వురకడం మొదలుపెట్టారు. కానీ వాళ్లేమో చిన్నపిల్లలు. అదీగాక బాగా అలసిపోయారు.
జీపులోంచి ఒక దొంగ ఆ పిల్లలను గమనించాడు. ''రేయ్‌... అదిగో అక్కడ పారిపోతున్నారు చూడండి. పట్టుకోండి'' అంటూ గట్టిగా అరిచాడు. అంతే... జీపు వేగం పెరిగింది. వేగంగా దూసుకొని రాసాగింది.
కాకి అది చూసింది. ''అరెరే... మరలా పిల్లలు ఆ దొంగలకి దొరికిపోయేటట్టు వున్నారే'' అనుకుంటా ఒక్కసారిగా వెనక్కు తిరిగింది. ఒక దొంగ జీపు వేగంగా నడుపుతున్నాడు. కాకి సర్రున వాని వైపు దూసుకొని వెళ్ళింది.
ఆ దొంగలకు కాకి గురించి తెలియదు కదా... వాళ్ల చూపంతా పారిపోతున్న పిల్లల మీదే వుంది. చానా కోపంగా వున్నారు. ఎలాగైనా సరే పట్టుకోవాలని మరింత వేగం పెంచారు. అంతలో కాకి జీపు నడుపుతున్న వాడి వైపు దూసుకొని వచ్చి వాని కుడి కంటిని ముక్కుతో ఢీ కొట్టింది.
అంతే... ఒక్కసారిగా వాడి కన్ను సుర్రుమంది. అబ్బా... అనుకుంటా చేయి వదిలేసి కన్ను పట్టుకున్నాడు. దానితో జీపు అదుపు తప్పింది. సర్రున పోయి అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టుకు దభీమని ఢీ కొట్టుకుంది.
అంతే... అందరూ తలా ఒక పక్కకు ఎగిరిపడ్డారు. ఒకనికి కాలు విరిగితే, ఇంకొకడికి చేయి విరిగింది. ముందు నడుపుతున్న వాడికేమో మూతి పగిలి పచ్చడి అయింది. అమ్మా అబ్బా అని మూలుగుతా లేవలేక అక్కడే పడిపోయారు.
అది చూసి పిల్లలందరూ సంబరపడిపోయారు. ఎగిరి గంతులు వేశారు. పాప వంక తిరిగి ''ఈరోజు నీ కాకే లేకపోతే మనమంతా ఈ దొంగల ముఠా చేతిలో ఇరుక్కు పోయేవాళ్లం. ఇప్పటి నుంచీ ఈ ముద్దులకాకి నీ ఒక్కదానిదే కాదు. మన అందరిదీ. మేము కూడా దీన్ని నీ మాదిరే బాగా చూసుకుంటాము'' అని ఆ కాకిని చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నారు.
కాకి సంబరంగా కావు కావుమంటూ నవ్వుతా గాలిలోకి ఎగిరింది. అది దారి చూపుతా వుంటే దాని వెనకే పిల్లలంతా ఇంటికి బయలుదేరారు.
***********

కామెంట్‌లు