మేమెప్పుడు సూళ్లా ఇట్లాంటి విచిత్రం  (అద్భుత జానపద కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212.

 ఎప్పుడూ నీళ్ళతో, పచ్చని పంట పొలాలతో, మూడు కార్లు పండే భూములతో కళకళలాడే కృష్ణా జిల్లాలో రామయ్య అని ఒకడు వుండేటోడు. వాడొకసారి ఎండాకాలం సెలవుల్లో బంధువులందరినీ పలకరిద్దామని ఒకొక్క వూరికి పోతాపోతా కర్నూలుకు వచ్చినాడు. ఆ జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో వాళ్ళ బంధువులు వున్నారు. కానీ అది అట్లాంటిట్లాంటి మామూలు పల్లెటూరు కాదు. చానా చానా వెనకబన్న ప్రాంతం. ఆటోలే తప్ప బస్సులు పోవు. గుంతలగుంతల మట్టిరోడ్డే తప్ప తారురోడ్డు లేదు. ''ఇంత దూరం వచ్చినా... మళ్ళా జన్మలో ఇటువైపు వస్తానో రానో... ఏది ఏమయినా సరే... పోయి చూసొద్దాం'' అనుకుంటా రామయ్య కిందామీదా పడతా ఆ వూరికి బైలుదేరినాడు.
ఆ వూర్లో నీటికి ఎప్పుడూ కరువే. వూరి బైటున్న పెద్దబాయిలోని నీరే ఇంటికి రెండు బిందెల చొప్పున పట్టుకోనొచ్చుకుంటుంటారు. ఇక ఎండాకాలం ముదిరిందంటే చాలు... ఆ బావి గూడా గుడ్లు తేలేస్తాది. జనాలు వూరికి పది కిలోమీటర్ల దూరంలో వున్న చింతలవాగుకాడికి పోయి చెలిమలు తవ్వి నీళ్ళు పట్టుకొచ్చుకొనేటోళ్ళు. రోజూ గుట్టలు, మిట్టలు ఎక్కుతా దిగుతా ఎర్రని ఎండలో అంతదూరం పోవడం కష్టం కాబట్టి పొద్దు పొడవకముందే బైలుదేరి ఒకటో రెండో బిందెలు తెచ్చుకునేటోళ్ళు. చుక్కచుక్క నీళ్ళు దాచిపెట్టుకోని దాచిపెట్టుకోని తాగేటోళ్ళు. స్నానాలు గూడా వారానికి ఒక్కసారే... అదీ తడిబట్టతో ఒళ్ళు తుడుచుకోవడమే. ఆ ఎండాకాలం ఏ ఇంటి తలుపు తట్టి చస్తా వున్నామన్నా గుక్కెడు నీళ్ళు పోసే దిక్కుండదు. యాడయినా బావ కానీ నీళ్ళ కాడ మాత్రం కాదన్నట్టుంటుంది పరిస్థితి.
అటువంటి వూరికి రామయ్య పోయినాడు. అదీ సెగలు కక్కుతా వున్న వేసవి కాలం. రాకరాక వచ్చినాడు గదా అని బంధువులు బాగా మర్యాదలు చేసి ''ఈ రాత్రికి ఈన్నే వుండి రేప్పొద్దున పోదువులే'' అని బలవంతం చేసినారు. వాళ్ళ అభిమానాన్ని కాదనలేక రామయ్య 'సరే' అన్నాడు. వాళ్ళు రాత్రి ఒక మాంచి నాటుకోడిని తెచ్చి బాగా మసాలా, పచ్చి మిరపకాయలేసి కూర చేసినారు. దానిలోకి జొన్న సంకటి పెట్టినారు. రామయ్య సంకటి తినడం అదే మొదటిసారి. దాంతో మాంచి రుచి తగిలింది. దాంతో ఇంగో ముద్ద.... ఇంగోముద్ద... అంటూ బాగా కూర నంజుకోని కడుపు నిండా తిన్నాడు.
కూరలో మంచిగా మసాలా, కారం పడడంతో, అదీ ఎండాకాలం కావడంతో అందరికీ గొంతులెండుకపోయి సారికిన్ని నీళ్ళు తాగడం మొదలుపెట్టినారు. అట్లా రాత్రి పండుకునే సమయానికి ఇంట్లో చుక్క నీరు గూడా మిగలకుండా కుండ ఖాళీ అయిపోయింది. పండుకున్నాక తాగేదేముంది. పొద్దున లేస్తానే పోయి తెచ్చుకోవచ్చులే అనుకున్నారు. వాళ్ళకు అట్లా నీళ్ళు లేకుండా పండుకోవడం పుట్టినప్పటి నుండీ అలవాటే. దాంతో అందరూ హాయిగా గుర్రుకొట్టసాగినారు.
కానీ... రామయ్యకు ఇంట్లో రోజూ లోటాలకు లోటాలు నీళ్ళు బాగా తాగడం అలవాటు. రాత్రి పండుకునే ముందైతే పెద్ద చెంబుతో నీళ్ళు తాగడమే గాక, పక్కన మళ్ళొక చెంబు నీళ్ళు పెట్టుకోని మధ్యమధ్యలో లేచి తాగుతా వుండేవాడు. అట్లాంటిది ఎండాకాలం... అదీగాక బాగా కారం తిన్నాడు. దాంతో నాలుక తడారిపోసాగింది. చేసేదేమీలేక అట్లాగే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తా... చూస్తా... నిద్ర రాక దొర్లసాగినాడు. అట్లా నెమ్మదిగా సమయం రెండు దాటింది.
ఎట్లాంటోనికయినా రాత్రిపూట ఏదో ఒక సమయానికి నిద్ర వచ్చేస్తాది గదా... అట్లా... రామయ్యకు మూడు దాటేసరికి నిద్ర ముంచుకొచ్చేసింది. నీళ్ళ కోసం కలవరిస్తా... కలవరిస్తా... అట్లాగే నిద్రపోయినాడు.
రామయ్య అట్లా నిద్రపోయిన కాసేపటికి నీళ్ళ కోసం తట్టుకోలేక రామయ్య ఆత్మ నిద్ర లేచింది. పండుకొన్నప్పుడు కొన్నిసార్లు చానా అవసరమైతే అట్లా ఆత్మలు శరీరం వదిలి బైటికి వచ్చేస్తాయంట. అవి పనయిపోగానే మల్లా తిరిగి లోపలికి దూరుతాయంట. కానీ నిద్ర లేచినాక మనకు అవేమీ గుర్తుండవంట. రామయ్య ఆత్మ యాడయినా నీళ్ళు దొరుకుతాయేమోనని వెదకడానికి బైలుదేరింది. ఇంట్లో యాడా నీళ్ళు లేవు. దాంతో నెమ్మదిగా పక్కింట్లోకి దూరింది. ఆడా నీళ్ళు లేవు. ఒక్కొక్క ఇల్లే వెదుకుతా వెదుకుతా ఆఖరికి వీధి చివరి వరకూ వచ్చింది. ఎవరింట్లోనూ చుక్కనీళ్ళు లేవు. అందరిండ్లలోనూ ఖాళీ కుండలే. ఏం చేయాల్నో అర్థంగాక ఆ వూరి పెద్దరెడ్డి ఇంటికాడికి బైలుదేరింది.
పెద్దరెడ్డికి చానామంది గాసగాళ్ళు వున్నారు. కేవలం నీళ్ళు తేవడానికే ఇద్దరిని పెట్టుకున్నాడు. వాళ్ళకు లేచింది మొదలు పండుకునేదాకా అదే పని. తేవడం... పోయడం... తేవడం... పోయడం... అంతే. రామయ్య ఆత్మ నెమ్మదిగా రెడ్డి ఇంటికాడికి చేరుకోనింది. వెదుక్కుంటా పోతా వుంటే ఒక గచ్చులో అడుగున కొంచం నీళ్ళు కనబన్నాయి. సర్రున లోపలికి దూరి గడగడగడ నీళ్ళు తాగసాగింది. అట్లా తాగుతా వుంటే ఆ చప్పుడుకు ఆన్నే పండుకున్న ఒక గాసగాడు నిద్ర లేచినాడు. ఏ కుక్కనో, బర్రెనో నీళ్ళు గతుకుతా వున్నట్లుంది అనుకోని ''థాయ్‌... పో'' అని రాయి తీసి విసుర్తా ఆడికి వచ్చినాడు. గచ్చు మీద పెట్టే బండరాయి కింద వుంది. దాన్ని ఎత్తి గచ్చు మీద పెట్టినాడు. అంతే... లోపల రామయ్య ఆత్మ ఇరుక్కోని పోయింది. బైటకి ఎట్లా రావాల్నో తెలీక తనకలాడసాగింది. బండ చానా బరువుంది. యాడా చిన్న సందు గూడా లేదు. దాంతో లోపల్నే కూర్చోని ఎదురుచూడసాగింది. అట్లా గంటా గంటా గడుస్తా నెమ్మదిగా తెల్లారింది.
ఊరంతా నిద్ర లేచినారు గానీ రామయ్య లేయలేదు. దాంతో బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు చుట్టూ చేరి ''అయ్యో పాపం... నిన్న రాత్రి వరకూ అందరితో మాటా మాటా కలుపుతా నవ్వుతా నవ్విస్తా వుండె. అట్లాంటిది పండుకున్నోడు పండుకున్నట్టే నిద్రలోనే ప్రాణం ఇడిచినట్టున్నాడు'' అని కళ్ళనీళ్ళు బెట్టుకున్నారు. బంధువులకు, పెండ్లాం బిడ్డలకు అందరికీ కబురు పంపినారు. చీకటి పడక ముందే సమాధి చేయాల గదా... దాంతో ఏర్పాట్లు మొదలుపెట్టినారు. పాడె కట్టే ముందు శవానికి స్నానం చేపియ్యాల గదా... దాంతో చూస్తే ఎవరింట్లోనూ నీళ్ళు లేవు. పొద్దున్నించీ ఈ గొడవలో పడి ఎవరూ నీళ్ళకు పోలేదు. దాంతో ఒకతను కడవ తీసుకోని పెద్దరెడ్డి ఇంటికి పోయినాడు.
''రెడ్డీ... నిన్న మా బంధువు ఒకాయన మమ్మల్ని చూడ్డానికని వచ్చి రాత బాగలేక ఈన్నే రాత్రి నిద్రలోనే కాలం చేసినాడు. ఒక బిందె నీళ్ళుంటే ఇయ్యి రెడ్డీ. శవానికి స్నానం చేపియ్యాల'' అన్నాడు. దానికి రెడ్డి ''అరెరే... పాపం...'' అని జాలిపడతా గాసగాన్ని పిలిచి ''ఒరేయ్‌... ఆ గచ్చులో గాని నీళ్ళుంటే ఒక కడవకు పోసి పంపురా... ఎప్పుడైనా కాదనొచ్చు గానీ సావుకాడ, పెండ్లికాడ మాత్రం వుండి గూడా లేదనకూడదు. అది ఆవును చంపినంత పాపం'' అన్నాడు.
గాసగాడు పోయి నీళ్ళ కోసమని గచ్చు మూత తెరిచినాడు. అంతే... అప్పటివరకూ ఎప్పుడెప్పుడు మూత తెరుస్తారా... ఎప్పుడెప్పుడు బైటకి వద్దామా అని లోపల కాసుక్కూర్చున్న ఆత్మ అట్లా తెరవడం ఆలస్యం... ఒక్కుదుటున ఎగిరి బైటకి దుంకి సర్రున ఇంటివైపుకి దూసుకోని పోయింది. ఆడ చూస్తే ఇంకేముంది... ముక్కులో దూది పెట్టినారు. వెనుక దీపం వెలుగుతా వుంది. పక్కన పెండ్లాం, బిడ్డలు లబలబలాడుతా వున్నారు. మరోపక్క పాడె సిద్ధమవుతా వుంది. ''ఓరినాయనో ఇంకొంచం ఆలస్యం గానీ అయింటే ఇట్లాగే తీస్కోని పోయి గుంతలోయేసి భూంచేసేటోళ్ళు... ఏ నీళ్ళ కోసమైతే ఇరుక్కోనిపోతినో మళ్ళీ ఆ నీళ్ళ వల్లనే తప్పించుకోగలిగితి'' అనుకుంటా పోయి లటుక్కున శరీరంలోనికి దూరింది.
అంతే... అంతవరకూ నీలుక్కోని పోయి కట్టెలా పడి వున్న రామయ్య కదలడం మొదలు పెట్టినాడు. అది చూసి ఆడున్న వాళ్ళందరూ అదిరిపడినారు. మొదట ఇదేందిరా శవం కదులుతా వుంది అని కొందరు భయపడినారు గానీ ''రేయ్‌... మన రామయ్య సావలేదురోయ్‌... బతికే వున్నాడు'' అని ఒక ముసిలోడు అరవడంతో అందరూ అవాక్కయినారు. ఏడుపులు మానేసి సంబరపన్నారు.
రామయ్య ఆత్మ లోపలికి పోగానే రామయ్య అంతా మరచిపోయినాడు. దాంతో లేచి కూర్చోని ''ఇదేందిరా నాయనా... నిక్షేపంగా వున్న నన్ను పట్టుకోని ఇట్లా చేస్తా వున్నారు. అసలేమైంది'' అన్నాడు.
దానికి వాళ్ళ బంధువు నవ్వుతా ''ఏమోరా... పిలిస్తే పలకక పోతివి. లేప్తే లేయకపోతివి. కాలూసేయీ సల్లగుండేసరికి గుండె గుభేలుమని అందరినీ పిలిపిస్తిమి. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ వులకక పలకక శవం లెక్కనే పడుంటివి. నీ అదృష్టం ఏమో గానీ యమధర్మరాజు లెక్కల్లో ఏదో పొరపాటు వచ్చి నిన్ను పట్టుకోనిపోయి విషయం తెలిసి నాలిక్కరుచుకోని వెంటనే తిప్పి పంపినట్టున్నాడు. లేకపోతే పుట్టి ఇన్నాళ్ళయింది. నేనెప్పుడూ సూళ్ళా వినలా ఇట్లాంటి విచిత్రం'' అన్నాడు.
జనాలంతా ఆ వింతని కథలు కథలుగా చెప్పుకుంటా ఆన్నించి కదిలినారు. రామయ్య శవానికి స్నానం చేపియ్యడానికి తెచ్చిన కడవలోంచి ఒక పెద్ద చెంబు నిండా నీళ్ళు ఒంపుకోని తాగి తిరిగి పెండ్లాం బిడ్డలతో సొంతవూరికి బైలుదేరినాడు.
***********

కామెంట్‌లు