ఎన్నికల సిత్రాలు..- మంగ శ్రీనివాస్ శిరందాస్ -9441673339
ఓటరును ప్రసన్నం చేసుకోవడానకి
ఎన్ని పాట్లో ఎన్నెన్ని పాట్లో
కాలికి బలపం కట్టుకొని..
ఊరూరా ఊరేగింపులు
వీధి వీధినా సమావేశాలు
ఇంటిటా పలకరింపులు..

ఐదేండ్లు హాయిగా దర్జాగా 
విశాలమైన భవంతుల్లో 
ఏసీ కారుల్లో కాలు కింద పెట్టకుండా గడిపిన బతుకులు.. 
పొద్దునలేస్తే క్యూ గట్టిన జనాలు
పడిగాపులు కాసిన కార్యకర్తలు..
దర్శనం కోసం ప్రజల అగచాట్లు..

ఇప్పుడు సీను రివర్సు
ఎండనక వాననక.
ఆకలియనక దప్పికనక
గడప గడప తొక్కుతూ
గడ్డం బట్టి బతిమాలాల్సివచ్చే గదా
ఓటరు దర్శనానికి..

సీటు నిలబెట్టుకోవాలని ఒకడి తపన
ఎట్టాగయినా సీటెక్కాలని మరొక్కడి తపన..
డబ్బుల పందేరం
హామీల హల్ చల్
పథకాల గ్యారంటీ
గెలిచేదెవరో ఓడేదేవరో


సందట్లో సడేమియాలు
గల్లీ లీడర్లు గరీబోల్ల ప్రతినిధులు
అందినంత దోచుకోవడానికి
మరి దాచుకోవడానికి
ఓటర్లకు పందేరం పేరుతో
నాయకుల చుట్టూ ప్రదర్శనలు..

బీరు బిర్యానికి ముఖం వాచిపోయిన
కార్యకర్తలకు రోజుకో వెయ్యి నజరానా..
ఇంకేమి కావాలి ఇదే వైభోగం 
ఓట్లు బాలెట్టు బాక్స్ లో పడ్డదాక
తమ తలరాత తాకట్టు పెడుతున్న సంగతి తరువాత..

ఓటు అమ్ముకోవడం తప్పు అని చెప్పే నాథుడే లేడు..
ఎవరు ఇచ్చినా తీసుకోండి
ఓటు మాకే వెయ్యండి అని చెప్పెటోల్లే.. అందరూ ఇచ్చేటోల్లే..
మరి ఓటరు నాడీ పట్టేదేవరు? 
గెలుపు బాట పట్టేదెవరు?

అంతా అయోమయం
బాలెట్ బాక్సులు తెరిచే దాకా..


కామెంట్‌లు