శ్రీశివ కేశవ బ్రహ్మ మూర్తులు- "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 9912767098
  🪷శివ కేశవ బ్రహ్మలు
    పరమేశ్వర మూర్తులు
    భక్తి ముక్తుల నొసంగు
    శ్రీశివ సoకల్ప మస్తు!
🪷ఉమా రమా భారతులు
     పరమేశ్వరి మూర్తులు
     శక్తి యుక్తుల నొసంగు!
     శ్రీశివ సoకల్ప మస్తు!
            [ అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,]
 👌ఒక ధనవంతుడు సంపాదనతో పాటు, సంస్కార మున్నవాడు. ఆ ధనవంతుని ఇంటికి.. ఒక బ్రాహ్మణోత్తముడు వెళ్ళి ఆశీర్వదించాడు!ఆ బ్రాహ్మణునికి భూరి దక్షిణలనిచ్చి, ఘనంగా సత్కరించిన, సందర్భంలో ఒక శ్లోకంలో, ఈ విధంగా ఆశీర్వదించాడు, భూసురుడు!
⚜️ ఆశీర్వచన శ్లోకము:-
   విహంగో వాహనం యేషాం,
   త్రికంచ ధర పాణయః
   పాసల సహితా దేవాః
   సదా తిష్ఠన్తు తే గృహే!
    👌ఇది ఒక చమత్కార శ్లోకము!
  🔆వివరణ:-  "పక్షులు" వాహనాలుగా కలవారు...  "త్రికములను" ధరించిన వారు...  "పాసల" తో నిండిన వారు...అగు దేవతలు; మీ యింట ఎల్లప్పుడూ ఉందురు గాక!  
    "వి"అంటే ..పక్షి; "హం"అంటే ...హంస;"గో" అంటే ...నంది! అందువలన, పక్షి వాహనంగా కలవాడు.. విష్ణువు. హంస వాహనుడు..  బ్రహ్మ. నంది వాహనం గలవాడు... శివుడు! వారే.. శ్రీ శివ కేశవ బ్రహ్మమూర్తులు!
👌"త్రి" అంటే... త్రిశూలం; "కం"అంటే.. శంఖము;  "చ" అంటే చక్రము; అనువాటిని ధరించిన వారు.. ముగ్గురు మూర్తులు!
     త్రిశూల ధారి.. శివుడు.
శంఖ ధారి.. బ్రహ్మ. సుదర్శన ధారి.. విష్ణువు. ఈ ముగ్గురూ "పాసల"తో కూడిన దేవతలు. అనగా,. "పా" అంటే పార్వతి; "స"అంటే సరస్వతి; "ల"అంటే... లక్ష్మీ దేవి!
    ఆ విధంగా  పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి తో కూడిన దేవుళ్ళు- మీ యింట ఎల్లప్పుడూ నెలకొని యందురుగాక! అనగా.. విద్య, ఐశ్వర్యము, సౌభాగ్యము... మున్నగునవి - మీ యింట వుండాలి అని, విశేషార్థం.
👌 శంఖము, చక్రము, త్రిశూలములు ధరించిన వారు అనడం వలన... శత్రుబాధలు, రాక్షస బాధలు, మీకు లేకుండు గాక! అట్లే, త్రిమూర్తులు వారి భార్యలతో..   మీ ఇంట నెలకొని యుండు గాక! అనగా.. సర్వ సౌఖ్యములు, విద్యలతో పాటు, శాశ్వతమైన, శ్రీకైవల్య పదము  మీకు లభించుగాక!  శ్రీరస్తు! శుభ మస్తు!
 🚩 సీస పద్యము
    నందివాహనుడును నగజాత తోడుండ
శూలము ధరియించి శుభములీయ
     గరుడవాహనుడును ఘనమైన దైవంబు
చక్రధారి తనదు సరసన రమ
    హంసవాహనుడును హస్తాన శంఖమ్ము
వామభాగము నందు వాణి తోడ
      మువ్వురమ్మలును త్రిమూర్తులు కరుణతో
తమయింటను శాశ్వతముగ నిల్చి
         (🚩ఆ. వె.)   
    శాంతిసౌఖ్యములను సౌభాగ్యములనిడి
సకల విద్యలనిడి సంపద నిడి
     అందజేయుగాక, ఆయు రారోగ్యముల్
శత్రుబాధల నుపసంహరించి!
      [ రచన:- జొన్నలగడ్డ శ్రీనివాస రావు.,)

కామెంట్‌లు