సునంద భాషితం -వురిమళ్ల సునంద, ఖమ్మం

 
న్యాయాలు -323సునంద భాషితం ✍️
న్యాయాలు -323
******
సావకాశం అంటే వ్యవధానము,మఱుగు, అవకాశము.నిరవకాశము అంటే చోటు లేనిది, సమయము లేనిది అని అర్థము.
ఏదేని ఒక పని యందు అవసరానుగుణంగా అంటే సందర్భాన్ని బట్టి అవకాశమిచ్చు శాస్త్రాన్ని సావకాశ శాస్త్రము అంటారు.
అలాంటి అవకాశం ఇవ్వని శాస్త్రాన్ని నిరవకాశ శాస్త్రము అంటారు.
"సావకాశ నిరవకాశయో ర్నిరవకాశో బలీయాన్ "*అంటే సావకాశం ఇచ్చే శాస్త్రము కంటే నిరవకాశ శాస్త్రము బలీయమైనది.ఇది ఒక రాజ శాసనం లాంటిదన్న మాట. ఏదైనా చేయకూడదు అంటే ఇక చేయకూడదు.ఆ మాటకిక తిరుగులేదని  అర్థం.
అదెలాగో చూద్దాం.
"న హింస్యా త్సర్వా భూతాని"అనగా జీవ హింస ఎన్నడునూ చేయరాదు అంటుంది నిరవకాశ శాస్త్రము.
"యజ్ఞ యాగాదులందు పశు హింస అంటే పశుబలి ఇవ్వవచ్చు " అంటుంది సావకాశ శాస్త్రము.
ఈ రెండింటిలో నిరవకాశ శాస్త్రము  బలవత్తరమైన శాస్త్రమైనప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయన్న మాట.జీవహింస/ పశు హింస చేయరాదని బోధించినప్పటికీ వేద విహిత యాగాది కర్మలందు   చేస్తూ ఉంటారు.
దీనికి సంబంధించిన ఓ సామెతను,మరో పద్యాన్ని చూద్దామా... 
 "అబద్ధాలు ఆడరాదు- సత్యమునే పలకవలెను"అనేది నిరవకాశ శాస్త్రమునకు  సంబంధించినది అయితే...
పోతన రాసిన భాగవతంలోని పద్యం  సావకాశ శాస్త్రమునకు సంబంధించినది.
శ్రీ మహా విష్ణువు వామన రూపంలో వచ్చి మూడడుగుల నేల దానం అడిగితే బలి చక్రవర్త ఇస్తానని మాటిస్తాడు.ఆ సందర్భంలో గురువైన శుక్రాచార్యుడు వచ్చిన వాడు మామూలు వాడు కాదు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు.అతడు కపటంతో వచ్చాడు.ఇలాంటి సమయంలో ఇస్తానన్న మాట తప్పవచ్చు, కొన్ని  సందర్భాల్లో మాట తప్పితే ఏం కాదు అంటూ క్రింది విషయాలు చెబుతాడు.
ఓ బలి చక్రవర్తీ! "ఆడవారి విషయంలో కానీ,పెళ్ళిళ్ళ  సందర్భంలో కాని, ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగినప్పుడు కాని, గోవులను,విప్రులను కాపాడేటప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు.దాని వల్ల ఏ పాపం రాదు "అంటాడు.
 "వారిజాక్షులందు వైవాహికములుందు/బ్రాణ విత్త మాన భంగమందు/జకిత గోకులాగ్రజన్మ రక్షణమందు/బొంకవచ్చు; నఘము బొంద దధిప "  పైన చెప్పిన మాటలకు సంబంధించిన పద్యం ఇదే.
అర్థం అయింది కదా! సమయం ,సందర్భం వచ్చినప్పుడు మార్పు చెందేది సావకాశ శాస్త్రము..
 ఓ జబ్బు పడిన వ్యక్తి  హాస్పిటల్లో  ఉన్నాడు.అతడు బతికేది కొన్ని రోజులు, గంటలు మాత్రమే అని డాక్టర్ కు తెలిసినప్పటికీ నిజం చెబుతాడా ? అస్సలు  చెప్పడు కదా!"ఏం ఫర్వాలేదు.త్వరగా నయమై ఇంటికి వెళ్తావనే ధైర్యం చెబుతాడు .అలా  చెప్పడం అనేది ఈ కోవకు చెందినదన్న మాట. అంటే ఆ వ్యక్తి మరణం తథ్యం అని తెలిసీ నిజం చెప్పకుండా అబద్దం చెప్పడం సావకాశ శాస్త్రమునకు  ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఆ వ్యక్తికి బతికే అవకాశమే లేదు .అతడికి వచ్చిన జబ్బలాంటిదని అసలు నిజం అబద్దమాడకుండా చెప్పాడనుకోండి .అది నిరవకాశ శాస్త్రముగా చెప్పవచ్చు.
ఇలా కొన్ని సున్నితమైన విషయాల్లోనూ, ఎదుటి వారు మానసికంగా కృంగి పోకుండా ధైర్యం తెచ్చేందుకు గానూ అప్పుడప్పుడూ సావకాశ శాస్త్రాన్ని ఉపయోగించాల్సిందే.
 మనం కూడా ఓ మంచి పని కోసం  అవసరమైతే నిరవకాశ శాస్త్రమును సావకాశ శాస్త్రముగా మలుచుకుని మనలోని మానవతా  హృదయాన్ని చాటుకుందాం.మరి  మీరు నాతో ఏకీభవిస్తారు కదూ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు