రెక్కలు కట్టుకు ఎగిరే చూపుకు
చుక్కల దారిని వచ్చే మిత్రుని
చక్కని రూపు తోచేలా
జలజల సవ్వడులతో
కలకలమంటూ కదిలిపోయే
సెలయేరుకు వెచ్చని స్పర్శ తగిలేలా
కన్నుల విందుగ కొండల నడుమ
కోటిరేకుల కాంచనపుష్పం
కాంతిరేఖలు విరిసేలా
చిక్కని చీకటి చిందులాటలను
ఒక్క కిరణంతో ఓడించి
మక్కువ మీరగ వెలుతురు వేంచేసేలా
మనసుల దాగిన కలతలుతీర్చి
మనుగడ పయనం సుగమం చేసి
మనుషుల మనవిని ఆలించేలా
ఈసులు మాపి ఇష్టం పెంచి
ఈ భువిలో ప్రేమను పంచి
ఇడుములు బాపే తోడయ్యేలా
తరతమ బేధములెరగని
మమతలు పంచే
గురుతర బాధ్యత బోధించేలా
అలజడిలేని అనుబంధాలను
అంతరంగాలకు అలవాటుగా
అనుగ్రహించే వరమిచ్చేలా
ఊహలు వాస్తవాలై
కలలు నిజమయే
కమ్మని వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి