లింగారాధన-కార్తీకమాసం ప్రత్యేకం.; - డాక్టర్ . బెల్లంకొండ నాగేస్వర రావు చెన్నై

 కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము. 
హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రథమైనది.
స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది:
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయని వారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును.
కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్తమ్రులు, గంగకంటే పుణ్యప్రథములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు’ అన్న పేరు వచ్చింది. ‘అభిషేక ప్రియః శివః’ శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసి అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్ధం’ అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉతృష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ‘కార్త్తిక పురాణం’ రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటినుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరాను గ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలునుండే ‘ఆకాశదీపం’ ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజా మందిరం లోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ‘ఉత్థానైకాదశి’ హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.
ఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్ఠనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీముహూర్తమున స్నానమాచరించి "హరహరశంభో" అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం.దీనినే కార్తీక నత్తాలు అంటారు.
సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం.శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి లాంటి దినాలుప్రశస్తమైనది.
మోక్ష సాధనకు వైరాగ్యం,భక్తి,జ్ఞానం ప్రధాన మార్గాలు అంటారు పెద్దలు. లింగారాధన ఈసృష్టిలో అత్యంత ప్రాచీనమైనది. బ్రహ్మ,విష్ణు,శ్రీరాముడు,శ్రీకృష్ణుడు వంటి వారే లింగారాధన చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.ఆకృతిని బట్టి,ఛాయను బట్టి లింగ విభజన జరుగుతుంది.అవి...."ఆట్యం"-"సారోట్యం"-"అనాట్యం""సర్వసమం" అనీ నాలుగు రకాలుగా పిలువబడతాయి.
వేయి ఓక ముఖం కలిగిన లింగాన్ని "ఆట్య లింగం" అని.నూట ఎనిమిది ముఖాలు కలిగిన లింగాన్ని "సారోట్య లింగం"లేక"అష్టోత్తర లింగం" అని కూడా అంటారు.ఒకటి నుండి ఐదు ముఖాలు కలిగిన లింగాన్ని "సర్వసమ లింగం" అంటారు.మనకు విరివిగా కనిపించేవి "అనాట్య లింగం" అంటే ముఖం లేని లింగం.శ్రీకాళహస్తి-కాశీ-శ్రీశైలం లోలాగా.
ఏక ముఖం నుండి పంచ ముఖం కలిగిన శివలింగ ఆలయాలు అపూర్వమని చెప్పవచ్చు.పానవట్ట ఉపరి భాగంలో అమర్చిన ముఖాలనుబట్టి లింగ వర్ణన జరుగుతుంది. ఆరు ముఖాలు కలిగిన "షణ్ముఖ లింగం" కూడాఉంది . కాని దీనిని ఆరాధించడం మన సాంప్రదాయంలో లేదు.పానవట్టనికి పైభాగాన రెండు చేతులతో శివుడు నడుముల వరకు అమర్చిన ముఖ లింగాలు మనకు కొన్నిచోట్ల దర్శనమిస్తాయి.
"ఏకముఖ లింగం"తూర్పు ముఖంగా ఉండి తెల్లని ఛాయతో అవధులు లేక ప్రసరించే శక్తికలది. ఈలింగాన్ని"తత్పురుషం"అంటారు.ఇవి "తిరువన్నామలై" లో అరుణాచలేశ్వరుని ఆలయంలో పెరియనాయగర్ సన్నిధికి నైఋతి మూలలో అతి సుందర ఏక ముఖ లింగంఉంది.అలాగే "చిదంబరం"లోనూ సుచీంద్రం ధానుమాలస్వామి ఆలయంలో ఏకముఖ లింగాలను మనం దర్శించుకోవచ్చు.
"ద్విముఖ లింగం"తూర్పు-పడమరగా అమర్చబడి తూర్పుముఖాన్ని తత్పురుషం, గా,పడమర ముఖాన్ని" సాద్యోజాతం" గాపూజింపబడుతుంది.
"త్రిముఖ లింగం" పానవట్టపై భాగంలో తూర్పుముఖం తత్పురుషం, ఉత్తర దిక్కుముఖాన్ని "వాయుదేవము"అని, దక్షణ దిక్కుముఖాన్ని "అఘోర"అని పిలుస్తారు.ఈలింగం తూర్పుముఖం చిరునవ్వుతోనూ, ఉత్తర ముఖం బంగారు రంగుతో మందహాసంతోనూ,దక్షణ ముఖం ఉగ్రరూపంతోను మలచబడి ఉంటాయి. బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులకు ప్రతిరూపంగా-సత్య-రజ తమో గుణాలకు ప్రతీక. ఈత్రిముఖ లింగం తమిళనాడు లోని దిండివనం వద్ద ఉన్న "తిరువాక్కరై" క్షేత్రం లోని "చంద్రమౌళిశ్వర"ఆలయంలో మాత్రమే చూడవచ్చు.ఈభూమండలంలో అంతటిలోనూ ఉన్న ఏకైక త్రిముఖలింగ ఆలయం ఇది ఓక్కటే. ఇలా మలచిన విగ్రహాలు ఎలిఫెంటాగుహలలో (ముంబాయి)  దుండగుల చేతిలో శిధిలమై కనిపిస్తాయి.అలానే ఇటువంటి పోలికలుకలిగిన  త్రిముఖం "ఇండోనేషియా"లో ఉంది.ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన "త్రయంబక లింగం" ముమ్మూర్తులా ఇలానేఉంటుంది.
"చతుర్ముఖ లింగం"పానవట్టపై నాలుగు ముఖ లింగాలు కలిగి ప్రతిష్టింన దేవాలయాన్ని. "సర్వతో భద్రాలయం"అంటారు."తిరువన్నామలై"-"తిరువానైక్కావల్"-కంచిలోని "కచ్చపేశ్వర"ఆలయాలలో ఈచతుర్ము ఖలింగాలను దర్మించుకోవచ్చు.(ఇవన్ని తమిళనాడులోఉన్నవి) ఈలింగాన్ని "వేద లింగం" అనికూడా అంటారు.పడమర ముఖాన్ని "సద్యోజాతాది"అంటారు.
"పంచ ముఖ లింగం"ఈ లింగానికి నలు దిశలతో పాటు,లింగం పైభాగాన (అంతర్ముఖంగా)ఆకాశంకేసి చూస్తున్నట్లు ముఖ రహితంగా ఉంటుంది. తమిళనాడులోని "వేలూరు"లోని"మార్గసహాయేశ్వర" ఆలయంలోనూ, నేపాల్ లోని"పసుపతినాద్" దేవాలయంలో చూడవచ్చు .ఈలింగానికి పైభాగాన ఉన్నముఖాన్ని"ఈశాన"అంటారు.
ముపై ఆరు ముఖాలు కలిగిన లింగం తమిళనాడులోని మహాబలిపురంలో ఉంది.ఆంద్రప్రదేశ్ లోని గుడిమల్లన్న లింగం అత్యంత పురాతనము ,చాత్రమైన విషేష లింగం.
విచిత్ర లింగాలు:
పిఠాపురంలోని "కుక్కుటేశ్వరుడు" స్వయంభూవు లింగం. ఈలింగానికి ఇరువైపులా 'రెక్కలు'ఉంటాయి. ఈక్షేత్రాన్ని "పాదగయా"అనికూడా అంటారు.
కాళేశ్వరము:ఒ కే పానవట్టంపై రెండులింగాలు దర్శించుకోవచ్చు.లింగానికి నాసిక రంధ్రాలు ఉంటాయి.ఈలింగం నాసిక రంధ్రాలలో ఎంత అభిషేక జలం పోసినా ఓక్కచుక్క జలం వెలుపలకు రాదు.
మంథాని:ఒకేపానవట్టంపై పదకొండు లింగాలు ఉంటాయి.ఇక్కడ ఒకే విగ్రహంలో పదకొండు నందులు చూడవచ్చు.ఈఆలయ నిర్మాణ రాళ్లు నీటిపై తేలడం విషేషం.
గోవా: చంద్రనాద్ ఇక్కడ ప్రతిపౌర్ణమికి లింగంపై వెన్నెలపడుతుంది .ఆసమయంలో లింగంనుండి నీరు ఉబుకుతుంది. స్వామిపేరు చంద్రేశ్వరుడు.
పంచరామాలు తెలుగు నేలపైనేఉన్నాయి.పంచభూతలింగాలు:క్షితి లింగం  (కంచి)ఆకాశ లింగ (చిదంబరం)జల లింగం (జంబుకేశ్వరం)తేజో లింగం (తిరువన్నామలై)వాయు లింగం(శ్రీకాళహస్తి)
పెదపులివర్రు:ఇది తెల్లని పాలరాతి లింగం మకర సంక్రాంతి రోజు సూర్యోదయ కిరణాలు లింగంపై ప్రసరింప బడతాయి.కిన్నెర కైలాస పర్వత లింగం ఇది వాతావరణానికి అనుగుణంగా రంగులు మార్చుకుంటుంది.చెన్నయ్ లోని "వవివాంబిక"-దేవి కరుమారి అమ్మన్"కోటి  లింగాలపల్లిలోనూ ,కాశీలోనూ, "అష్టోత్తర లింగాలను" దర్శించుకోవచ్చు."త్రి కోటేశ్వరుడు"గా మీసాలకోటయ్య ,కోటప్పకొండ లోనూ, అమరనాధ్-గోకర్ణంఋవంటి పలుప్రాంతాలలో ప్రజలను శంకరుడు పరవశింపజేస్తున్నాడు.
లింగాకారం కాకుండా పార్వతి దేవి మనోహరుడు మానవ రూపంలో కనిపించే దేవాలయాలు రెండూ తెలుగు నేలపై ఉన్నాయి.ఒకటి అనంతపురం జిల్లా అమరాపుర మండలం హేమావతి గ్రామంలోని "సిద్దేశ్వర ఆలయం"రెండవది చిత్తూరుజిల్లా నాగలాపుర మండలం సురుటుపల్లి గ్రామంలో స్వామి పవ్వళించి కనిపిస్తాడు.ఈఆలయంలోనే సతీ సమేత "దక్షణా మూర్తి"కనిపిస్తారు.మరెకక్కడ దక్షణామూర్తి సతి సమేతంగా కనిపించడు.శివభక్తులను నయనార్లు,విష్ఞు భక్తులను ఆళ్వార్లు అంటారు.ఇటువంటి మహిమాన్విత,మనోహర సుందర రూపలింగాలు ఆసియా లో ఎన్నోకనిపిస్తాయి . ఏరూపంలో కొలిచినా, ఏబాషలో వేడుకున్నా, ఏగుడిలో మొక్కినా ఫలితం ఓక్కటే.నదులన్ని సాగరం చేరినట్లే,ఆదేవదేవుని పూజించే వారంతా ఆసదాశివుని చేరుకోవలసిందే! ఆది దేవుని కృపకు అందరూపాత్రులే. మానవసేవే మాధవసేవగా జీవించడమే మానవ జీవిత పరమార్ధం.
"హరహరమహదేవ శంభోశంకరా"

కామెంట్‌లు