సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -324
సాక్ష పురుష న్యాయము
******
సాక్ష అనగా ప్రత్యక్షముగా విని చూచిన వాడు, ఏదేని ఒక కార్యమును విని గాని,కని గాని తెలిసిన వాడు, నిష్పక్షపాతము చేత జూచువాడు.
పురుష అనగా మనుష్యుడు ,మనుజుడు, పురుషుడు, పరమాత్మ, జీవుడు అనే అర్థాలు కలవు.
సాక్ష పురుష అంటే కళ్ళు ఉన్న మనిషి ఒకరిచే చేయిపట్టుకుని తీసుకొని పోబడినప్పుడు, గుడ్డిగా  అనుసరిస్తాడే కాని నిజముగా అతడు తన కళ్ళతో చూడడు అని అర్థము.
ఇక్కడ పెద్దలు ఏమని చెప్పారంటే వేదములు వల్లించుచున్న వ్యక్తికి వేద మంత్రాల అర్థములు తెలిసి ఉండాలి.కాని అవి తెలియక యజ్ఞాల వంటి కర్మాచరణమునకు భాష్యాదుల పైన అంటే సూత్ర వ్యాఖ్యానాల పైన,ఇతరుల పైన ఆధారపడెడి వ్యక్తికి వేదాలకు సంబంధించిన ఏ విషయాలూ తెలియవు కదా! అందుకే అలాంటి వారిని ఉద్దేశించి ఈ "సాక్ష పురుష న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఇది కేవలం వేద మంత్రాలు చదివే వారికే కాదు , కుటుంబంలోని వారందరికీ  కూడా వర్తింప చేసి చూడవచ్చు.
కొందరు  తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి అవసరాలు అడక్కుండానే అన్నీ సమకూర్చి పెడుతూ వుంటారు.వారిని "ఎందుకు? ఏమిటి? ఎలా?" అనే ఆలోచనే రాకుండా పెంచుతుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళలో  స్వయంగా చేసే, ఆలోచించే శక్తి యుక్తులు మరుగున పడిపోతుంటాయి.
అన్ని అవయవాలు బాగున్నా శారీరక మానసిక సామర్థ్యము ఉన్నప్పటికీ వాటిని సరైన రీతిలో ఉపయోగించక పోవడం వల్ల ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడుతూ వుంటారు.
అంటే తమ అవసరాలన్నీ ఎదుటి వ్యక్తి ద్వారా తీరుతూ వుంటే తనకు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం గాని, అవకాశం కాని వుండదుగా.వాటి గురించి ఎప్పుడూ ఇతరులపై ఆధారపడాల్సిందే.
ఉదాహరణగా బాగా పేరొచ్చిన 'బొమ్మరిల్లు' సినిమా  గురించి  చెప్పుకోవచ్చు.అందులో హీరో తన తండ్రితో ఇదే విషయాన్ని చివర్లో ప్రస్తావించడం.సినిమా చూసిన వారందరికీ తెలుసు.అందులో తండ్రి అతి ప్రేమ కొడుకు పనికిరాని వాడుగా తనకంటూ వ్యక్తిత్వం లేని వాడుగా వుండే పరిస్థితి తెస్తుంది. అలా చేయకూడదని ఇచ్చిన సందేశం యువతకు బాగా నచ్చింది.
అలా ఎవరైనా తండ్రి కనుసన్నల్లో నడిస్తే "బొమ్మరిల్లు కొడుకురోయ్! అనడం.తండ్రి అలా ప్రవర్తిస్తే "అబ్బా! ఆయనసలే  బొమ్మరిల్లు ఫాదర్ " అనడం ఓ జాతీయం,సామెతలా వాడుకలోకి వచ్చింది.
 దీనికి సరిగ్గా సరిపోయే ఓ సామెత వుంది. "చేపలు పట్టి ఇవ్వడం కాదు.చేపలు పట్టడం నేర్పాలి" అని.చేపలు పట్టడం అనే శిక్షణ ఇస్తే ఇచ్చే వారి కోసం ఎదురు చూడకుండా తానే పట్టుకొని తింటాడు.
అంటే ముందు చేయి పట్టుకొని నడిపించడం మానేయాలి .సరైన దిశానిర్దేశం చేస్తే .ఆ వ్యక్తి తనకు  తానుగా ఏం  కావాలో వెతుక్కుంటూ, అవసరమైనవి సాధించుకుంటూ ముందుకు వెళ్తుంటాడు.
 కొందరు పురుషులు స్త్రీలను ఎల్లప్పుడూ తమపై ఆధారపడేలా చేస్తుంటారు.వారికంటూ ఆలోచనలను చేయ నివ్వరు.ఆచరణలో సాగనివ్వరు.
అలాంటి వారిని ఉద్దేశించి  చలం  "స్త్రీకి కూడా శరీరం వుంది.దానికి వ్యాయామం ఇవ్వాలి.ఆమెకు మెదడు వుంది దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం వుంది.దానికి అనుభవం ఇవ్వాలి" అంటారు.
న్యాయము ద్వారా కళ్ళుండీ గుడ్డి వాళ్ళు, మనసుండీ ఎడ్డె వాళ్ళు కాకూడదని.... అలా తమ సంతానాన్ని తల్లిదండ్రులు పెంచకూడదని తెలుసుకున్నాం.
చాలా లోతైన భావనతో కూడిన ఈ 'సాక్ష పురుష న్యాయము'లోని నిగూఢమైన అర్థాన్ని గ్రహించి  మనం అలా చేయకుండా, ఇతరులను చేయనీయకుండా అర్థమయ్యే రీతిలో చెబుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు