సజ్జన సాంగత్యమే శ్రేయోదాయకం- సి.హెచ్.ప్రతాప్
 దుస్సాంగత్యం అగ్ని లాంటిది అంటారు, అది మంచి చెడు అనే విచక్షణ లేకుండా దరికి చేరిన వాటన్నిటినీ కాల్చేస్తుంది. అదే సత్సాంగత్యం నీరు వంటిది, అది ప్రాణాధారం. కాబట్టి సదా దుస్సాంగత్యాన్ని త్యజించడానికి, సత్సాంగత్యాన్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి.
శ్లో:
గంగా పాపం శశీ తాపం దైన్యం కల్పతరు: తధా
పాపం తాపం చ దైన్యం చ హంతీ సజ్జన సంగతి:
అన్నది శాస్త్ర వచనం.  గంగ పాపాన్ని హరిస్తుంది. చంద్రుడు తాపాన్ని హరిస్తాడు. కానీ సజ్జన సాంగత్యం పాపాన్ని, దైన్యాన్ని కూడా హరిస్తుందన్నది పై శ్లోకం అర్ధం.  మహాత్ము లైనవారికి అంతటి దివ్యశక్తి ఉంటుంది కదా ! అందుకే వారు చేయలేని దేదీ లేదు కాకపోతే ఆశక్తి లభించడం పూర్వ జన్మ సుకృతం .
సత్పురుషుల కొలువు భగవంతుని సాన్నిధ్యంతో సమానమన్నారు పెద్దలు. చెడ్డవాని స్నేహం పలు సంశయాలకు తావిస్తుంది. సత్పురుషుని స్నేహం మలయమారుతంలా జీవితాన్ని పునీతం చేస్తుంది.
ప్రహ్లాదుడు తన తోటి విద్యార్ధులకు ఇలా చెప్పాడు
”అందరు సంసారపు ఊబిలో కూరుకుపోయి తమ స్వరూపాన్ని కూడా తాము మరచిపోతున్నారు. వందలకొద్ది జన్మ
లెత్తినా కర్మ బంధాల. చిక్కులోంచి మనవారు బయటపడడం లేరు.” ఇది ఎంతటి విషాదకరమైన సంగతి ?
మనలను సక్రమ మార్గం వైపు నడిపే శక్తి కేవ లం సజ్జనులకే ఉంటుంది. ఒక మనిషి సజ్జనుడుగా పేరు ప్రతిష్ఠలు గడించినా, దుర్జనుడిగా అపకీర్తి పాలైనా అది సాంగత్యం వలననే సాధ్యం.” ఎంత దుష్టసంస్కారాలు గలవాడైనా సాధు సాంగత్యం చేత వృద్ధిలోకి వస్తాడు.అత్తరు దుకాణంలోకి పోతే ఆ వాసన నీకు ఇష్టం లేకపోయినా నీ ముక్కుకు సోకుతుంది” అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస. అందుకే నిరంతరం సజ్జన సాంగత్యంలో వుండడం ఎంతో అవసరం.
సజ్జన సాంగత్యం పొందాలంటే, అంతకు ముందుగా మూర్ఖత్వాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే సజ్జనులు ఎవరన్న విషయం బోధపడుతుంది. వారిని కలుసుకోవాలని మనసులో బలంగా కోరుకోవాలి. కోరుకున్నంత మాత్రాన సజ్జనులు మన దగ్గరికి రారు. వారున్న చోటికి మనమే చేరుకోవాలి.సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం’ అన్న శంకరాచార్యుల భజగోవింద సూత్రంలో జీవన్ముక్తికి తొలి అడుగు సజ్జన సాంగత్యమే అన్న సంగతిని ముందుగా ధృఢంగా మనసులో పదిలపరచుకోవాలి.

కామెంట్‌లు