తుఫాన్- సైతాన్!- డా. పివిఎల్ సుబ్బారావు 9441058797
1. నాడు వచ్చిన ,నేడు ఉన్న,   
     రేపు రానున్న తుఫానులు!  
 మానవజాతి ఋజువర్తనానికి,
          ప్రకృతి హెచ్చరికలు !
   మనిషి అంతరంగం ,
        దైవం చూస్తూ ఉంటాడు! పక్కదారి పడుతుంటే,
 ఒక దెబ్బ వేసి,
 పక్కా దారి, నడవమంటాడు !
కలిసి కష్టాలు పంచుకోమని, ఎదుర్కోమని,
సైతానుని, పంపిస్తూ ఉంటాడు!

2. అదేమిటో పరాక్రమంలో,   
    మనిషి అభిమన్యుడే!    
    విపత్తుల పద్మవ్యూహంలో,  
       నేడు చిక్కుకున్నాడే !
   ప్రభుత్వ సహాయం, 
       ఆపన్నులకు సైంధవ గీతే! 
   ఆదుకోవాలని ఉన్నా ,
           వాళ్ళకి రానిది ఈతే !
   వర్షధారల కటకటాలమధ్య ,
     సూర్యుడి కిది తలరాతే!

3. రైతు పంట ,
      వర్షం నీటిలో మునుగు!
    రైతు బతుకు,
    కన్నీటి వరదల్లో అణుగు !
   అతఢి ఋణం గోరుచుట్టు,
       పంటనష్టం రోకలిపోటు!
   అతని జీవితమంతా,
                  ఏటికి ఎదురీత!
   అతన్ని చూస్తే మనసున్న,  
    వారందరికీ కడుపుకోత!

4. ప్రకృతి విలయతాండవం!  
    సాధారణ జనగృహం,  
    జలబాండం !
   తోడుగా విద్యుత్ కోత,   
    మరి అంధకార బంధురం!  
   నిత్యావసరాలు అలభ్యం, 
అమ్మేవాడికి గొప్ప సౌలభ్యం!
ప్రకృతి క్షణంలోమారిపోయింది, 
బతుకు బండి ఆగిపోయింది!

5.ఎన్నోపాపాలు,
                  మూటకట్టావు!
    సర్పాలై బుసకొడుతూ,
       మీదికి వస్తున్నాయి!
   ఒక్క   పుణ్యం చేసి ఉంటే ,
    గరుత్మంతుడు వచ్చేవాడు !
   శకునిలా ఆలోచించావు,
              శని ఎదురొచ్చాడు!
   మనిషిలా ఆలోచించు,
 మాధవుడు వెంట ఉంటాడు! 
  గోతులు తీయడం ఆపి,   
   కష్టాలకు అడ్డుగోడ కట్టు!
___'_____
.

కామెంట్‌లు