మామక "కవితా కన్యామణి"- "కవి మిత్ర" శంకర ప్రియ., శీల ., సంచార వాణి:- 99127 67098

 🙏సువర్ణ యుక్త మైనది
     సద్గుణ శీల మైనది 
     మా కవితా కన్యామణి!
     కళ్యాణ సుందరేశ్వర!
             ( అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,)
 ⚜️జగద్గురువు లైన, శంకర భగవత్పాదులు...  జగదీశ్వరుడైన శంకరభగవానునకు.. తమ కావ్యకన్యను ( శ్రీశివానంద లహరిని) శివార్పణము కావించుటకు; కన్యాదానము కావించు చున్నారు. లోకంలో కన్యాదాత, తమ కన్యామణిని  స్వర్ణాభరణములతో నలంకరించి "సాలంకృత కన్యాదానం" చేస్తారు! ఇక్కడ వరుడు.. సాక్షాత్తు "సుందరేశ్వరుడు"! వధువు.. సౌందర్యరాశి, కవితాకన్య యగు, శ్రీ"శివానంద లహరి"!
🔱ఓ శివా! గౌరీ ప్రియా! (పార్వతీదేవి యందుప్రేమ కలవాడవైన ఓ మహాదేవా!) నాయీ కావ్యకన్యను నీవు స్వీకరింపుము స్వామి! ఈ కవితా కన్యకామణి.. సమస్తమైన అలంకారములతో కూడినది. (సకలభూషణములతో కూడినది)! మృదువైన శబ్దములతో కూడినది. (సక్రమమైన నడకలతో కూడినది)! సలక్షణమైన వృత్తములు కలది. (మంచి చరిత్ర కలది)! మంచి అక్షరములు కలది (చక్కని రూపము కలది)!
      కావ్యలక్షణము తెలిసిన వారిచేత స్తుతింపబడునది. (సజ్జనులచే కొనియాడ బడునది)! శృంగారాది రసములు, మాధుర్యాది గుణములతో కూడినది. (సరసమైనది, సద్గుణములతో కూడినది)! ప్రతిపాద్య వస్తువు కలది. (వరింప దగినదిగా నున్నది)! సర్వకావ్య లక్షణములతో నొప్పునది. (సర్వసాముద్రిక లక్షణములతో నున్నది)! 
      ఎక్కువగా ప్రకాశించుచున్న అలంకార విశేషము కలది. (సుశీలత్వము.. మున్నగు భూషణముల ఆధిక్యము కలది)! తెలియబడిన వినయము కలది. (పొందబడిన సద్వర్తనము కలది)! స్పష్టముగా స్ఫురించుచున్న అర్థ పరంపర కలది. (స్పష్టముగా గోచరించుచున్న భాగ్యరేఖ కలది)! అర్థపుష్టిగా భాషించునది. (మంగళములను కల్గించునది).... అగు, నా యొక్క "కవిత్వమనెడు కన్యక"ను నీవు పరిగ్రహింపుము, సుందరేశ్వర స్వామి! అని, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ప్రార్థించుచున్నారు!
🪷ప్రార్థనా శ్లోకము:-
     సర్వాలంకారయుక్తాం, సరళపద యుతాం, సాధువృత్తాం, సువర్ణాం,
      సద్భిః సంస్తూయమానాం, సరసగుణ యుతాం, లక్షితాం, లక్షణాఢ్యాం
    ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం, ద్యోత మానార్థరేఖామ్!
     కల్యాణీం దేవ! గౌరీప్రియ! మమ కవితా కన్యకాం త్వం గృహాణ!!
       (శ్రీ శివానంద లహరి, 98.వ.శ్లోకము.,)
            🔆🪷🔆
         🚩మత్తేభ పద్యము
    సకలాలంకృతి సంస్కృతంబు, సుమన స్సంస్తూయమానంబు, స
    ర్వకలాలక్షణ లక్షితాఢ్యము, సువర్ణ ద్యోతమానార్ధమున్ ,
     ప్రకట శ్రీగుణమున్,
 సువృత్తమును, శుంభద్భూషణం బైన, మా 
     మక కావ్యంబను "కన్యకామణి"ని, ప్రేమంగొమ్ము గౌరీప్రియా!
          (రచన:-శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి.,)
           🔆🪷🔆
      🚩 సీస పద్యము
    సాధువృత్తములతో సరళపదములతో
 సమ్యగలంకార సంభృతమయి
    సల్లక్షణములతో సంస్కృతయై, పండి
 తులచే సతమ్ము, ప్రస్తుతుల గాంచి
    సరసగుణంబుల సంస్తూయమానయై 
సకలభూషణ విశేషములు గల్గి 
    వినయ సౌశీల్య వివేకంబులును గల్గి
 అర్థరేఖలు కరమందు గలిగి
         (🚩తేట గీతి) 
     అఖిల కళ్యాణ గుణముల నలరుదాని, 
 నాదు కవితా సుకన్యను వేదవేద్య!
   ఇంపు మీఱగ జేకొని యేలుకొమ్ము!
 అనుచు గౌరీప్రియా! నాదు ప్రార్థనమ్ము!!
       ( రచన:- శ్రీ కార్యం పూడి రాజమన్నారు.,)
🕉నమఃశివాయై నమఃశివాయ!
     ( శ్రీ శివ ఏకాదశాక్షరి(11) మంత్రము! భవతారక మహా మంత్రము)

కామెంట్‌లు