కన్నుల మురిపించే కావ్యం
కిలకిల కలకల గలగల
నవ్వుల పువ్వులు విరిసే సుమగంధం
చిలుకల పలుకుల పులకించిన
ఆనంద నిలయం
మనః మాలికలో ఊయలలూగిన
తీయని స్మృతుల కోలాహలం..
ఇసుకలో కట్టుకున్న పిచ్చుక
గూళ్ళలో అంతఃపుర సౌందర్యం
దోబూచుల దొంగాటలతో
దొంగైనా దొరైనా తేడాలే లేవంటూ
సాధించిన విజయం
తొక్కుడు బిళ్ళాటలు
గురి చూసి సూటిగా వేసే గోళీఆటలు
చెరువు గట్టుపై కుందాటలు
ఎన్నటికీ మరవలేని, మళ్ళీతిరిగిరాని
నందన బృందావనం
ఆనందాల నిలయం..
'చుక్ చుక్ బండి వస్తుంది
దూరం దూరం తొలగండి
ఆగిన వెంటనే ఎక్కండి '
చేతులు కలిపిన చేమంతుల
పూబంతులు
బొంగరాల్లా గింగిరాలు తిరుగుతూ
గాలిపటాల్లా గగనంలో ఎగురుతూ
వాన నీటిలో చిందులు వేస్తూ
చెరువులో ఈతలు కొడుతూ
చెరగని చిరునవ్వుతో
తరగని ఆనందంతో
అందరూ కలిసీ మెలిసీ
తుళ్ళింతల కవ్వింతల
ఆడే ఆటలు పాటలు
చిందులు కుందులు వేసిన బాల్యం
శరీరానికి దారుఢ్యం
మనసుకి ఆహ్లాదం
పంచీ పెంచిన ఆనందం
రమ్మన్నా రాదు ఆ బాల్యం
చెరిగి పొమ్మన్నాపోదు
ఆ అల్లరి కావ్యం..
°°°°°°°°°°°°°°°°°°°°°°°°
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి