పిలుపుకోసం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నా నేస్తాల్ని చూసినప్పుడల్లా
నాబాల్యం గుర్తుకొస్తుంది
నాబాల్యం  గుర్తుకొచ్చినప్పుడల్లా
వారి పలకరింతల్లోని 
పులకరింతల్ని నెమరేస్తాను
నా స్నేహితుల ఆలింగనాల్లోని 
ఆత్మీయతల్ని, అనురాగాల్ని 
ఆనందభాష్పాలతో 
అభిషేకించాలనిపిస్తుంది
నాతో ఆడిపాడిన నేస్తాలను 
తలచుకున్నప్పుడల్లా
రాళ్ళల్లో దాగిన నీటిచెలమల్లా 
నాహృదయపు మూలల్లోని 
మమకారం తొంగిచూస్తుంది
అనుబంధాలతోటలో 
విహరించినట్లుంటుంది
నేను నాకు నేనుగా 
త్యజించలేని ఏకాంతవాసం
మరొకరితో పంచుకోలేని ఒంటరితనం
నాశవయాత్రలో నేనే 
నా శవంవెనుక నడుస్తున్నా
కాలం ప్రియమైంది కానీ....
నా భమ ఇంకా పైసలచుట్టూ....
అయినా నాలోమిగిలిన 
సన్నటి ప్రేమధార
మనిషి ప్రేమజాడను కనిపెట్టింది
లోకమంతా 
కొత్త అనుభవాలకోసం నిద్రలేస్తుంటే
నేనుమాత్రం 
నేస్తాల నీడల జాడలకోసం
పలవరిస్తూ.....పలకరిస్తూ......
నేను 
చుక్కలు ఆరిపోయిన ఆకాశంలా
ఒంటరి కన్నీటిచుక్కగా దిగ్భ్రమలో....
నా అడుగు ఇటా?....అటా?....
ఎటూ తేల్చుకోలేని 
అపస్మారపు స్థితిలో
నా నేస్తాల 
తీయని పిలుపుకోసం.....!!
**************************************

కామెంట్‌లు