కోపంతో కరుణించేది
శాపంతో వరమిచ్చేది
మాటల తేనెలు కురిపించేది
మురిపాలను రంగరించిన
ముర్రుపాలసాక్షిగా
మమతల ముద్దలు కలిపేది
కదిలే దేవత అమ్మ!
తల్లీ పిల్లా శరీరాలే వేరు
మనసొక్కటే అనేలా ఉండేది
తన బిడ్డల కళ్ళల్లో
వెలుగుల తళుకుల కోసం
ప్రతీక్షణం పరితపించేది
“నాకేం ఇవ్వకపోయినా సరే,
నీకేం కావాలో అడుగుబిడ్డా!"
అని కడుపున తలపెట్టి అడిగే
వరాలిచ్చే దేవత అమ్మ!
బతుకు కోసం ఆరాటం
బతుకు కోసం పోరాటం
బతుకు విలువల విన్యాసాలు
అమ్మ చెప్పకనే చెప్పే
జీవిత పాఠాలు!
ఆ యముడికి అమ్ముందా?
ఉంటే...,
అమ్మల ప్రాణాలు తీసేవాడా?
అమ్మను గంగమ్మ ఒడిలో కలిపినా
ఇంకా అమ్మ ఒడిలో
నేనున్నట్లే అనిపిస్తోంది!
అమ్మ నా జ్ఞాపకాల జీవనది
అందుకే
అమ్మకు వందనం!!
*********************************
అమ్మకు వందనం- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి