సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -337
సూకర వాటికా న్యాయము
******
సూకరము అంటే వరాహము,పంది.వాటికా అంటే తోట, ఉద్యానవనము,ఫలోద్యానము, మార్గము అనే అర్థాలు ఉన్నాయి.
పంది పూదోటలోకి వచ్చినట్లు అని అర్థము.
నేలను కుమ్మి పెల్లగించి పెంటను,మలమును తినే పంది పూదోటలోకి వచ్చినప్పుడు పూల  అందాన్ని, అందులోని సువాసనను చూస్తుందా? ఆస్వాదిస్తుందా? అస్సలు చూడదు. ఆస్వాదించదు. తన బుద్ధి తీరు పోతూ పాదులు పెల్లగించి పూలమొక్కలను ధ్వంసం చేస్తుంది.
 
అలాగే చెడు బుద్ధి  ఉన్న వ్యక్తి చెడు పనులే చేస్తాడు తప్ప మంచి పనులు చేయడు. మంచి లోని గొప్పదనాన్ని ఆర్థం చేసుకోడు.ఆస్వాదించడు అనే అర్థంతో ఈ "సూకర వాటికా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 అలాంటి వారి పట్ల ఏహ్యభావంతో వేమన రాసిన పద్యాలను చూద్దామా...
 "కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి/ఎట్టివారు మెత్తు రట్టి వాని/ మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా/ విశ్వధాభిరామ వినురవేమ!"
కూళ అంటే నీచుడు,మూఢుడు, అవివేకి,దుర్జనుడు అనే అర్థాలు ఉన్నాయి. అలా  నీచుడు నీచున్నే మెచ్చుతాడు కానీ మంచి వాణ్ణి మెచ్చుకోడు.వదిలేస్తాడు.అదెలా అంటే చెట్టు తనలోని భాగమైన దూలానికి తన గుణాన్నే ఇస్తుంది కాని అదనంగా జ్ఞానాన్ని ఇవ్వలేదు కదా! అంటే ఎటువంటి వారైనా తమ లాంటి వారినే ఇష్టపడుతారు, మెచ్చుకుంటారు కాని వేరొకరిని కాదు అని అర్థం.
ఇదే అర్థంతో కూడిన మరో పద్యాన్ని చూద్దామా...
 "ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని/భావమిచ్చి మెచ్చు బరమ లుబ్దు/పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా?/విశ్వధాభిరామ వినురవేమ!"
ఒక దుర్మార్గుడు మరొక దుర్మార్గుడినే మెచ్చుకుంటాడు.అలాగే అజ్ఞాని లుబ్దునే మెచ్చును అంటే ఒక జ్ఞాన హీనుడు తన వలెనే పిసినిగొట్టు తనముతో నున్న వానినే అభినందిస్తాడు అదెలాగంటే పంది ఎప్పుడూ బురదనే కోరుకుంటుంది కాని పన్నీరును కోరుకోదు.చెడ్డపని చేసే వాడికి చెడ్డ పనులు చేయడం నచ్చుతుంది.తనలాంటి చెడ్డవారే నచ్చుతారు.
 ఆ విధంగా దుర్మార్గుడు,దుష్టుడు మంచి వారి మధ్యన చేరితే మంచిని గ్రహించక వారిని కూడా యి

బ్బంది పెడతాడు.
అలాంటి వ్యక్తుల వల్ల సాధు సమాజము, కులము, మతము, కుటుంబం ఏవైనా యిబ్బంది పడక తప్పదు.
 దుర్మార్గులను దుష్టులను దూరంగా ఉంచాలి లేదా మనమైనా వుండాలి. వారిని చేరదీస్తే వచ్చే యిబ్బందులు ఎల్లప్పుడూ గమనంలో పెట్టుకోవాలని ఈ "సూకర వాటికా న్యాయము"ద్వారా గ్రహిద్దాం,మన జాగ్రత్తలో మనం ఉందాం. 

ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు