సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -344
సౌభరీ న్యాయము
    *****
 సౌభరీ అనేది ఒక మహర్షి పేరు.ఆయన గారి పేరుతో ఏకంగా ఓ న్యాయాన్నే సృష్టించారు మన పెద్దలు.
 మరి ఆ సౌభరి మహర్షి ఎవరో ఆయన ప్రత్యేకత ఏమిటో చూద్దాం.
సౌభరి మహా తపస్వి అయిన కణ్వమహర్షి కుమారుడు.ఈ సౌభరి మహర్షి ప్రస్తావన  శ్రీమద్భాగవతంలో ఉంది.
 సూర్య వంశపు రాజైన  మాంధాత మధుర అనే రాజ్యమును పరిపాలిస్తున్న సమయంలో  సౌభరి మహర్షి మధురకు సమీపంలోని అరణ్యంలో కఠోరమైన తపస్సు చేస్తుండేవాడు.
 ఐతే ఆయన చేస్తున్న ఘోరమైన తపస్సు చూసి ఇంద్రుడు తన ఇంద్ర పీఠం,స్వర్గాధిపత్యం కోసం చేస్తున్నాడేమోనని భయపడి పోయాడు.వెంటనే అతని తపస్సును భంగం చేయడానికి దేవకాంతలను పంపి నృత్య,సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేయించాడు.
ఇలాంటివి ఏవీ సౌభరిని కదిలించ లేక పోయాయి. ఇంద్రుడిలో  ఇంకా భయం పెరిగిపోయింది.ఇలా కాదని భయంకరమైన ప్రకృతి భీభత్సాలను  సృష్టించాడు.ఐనా సరే వాటిని కూడా సౌభరి మహర్షి ఏమాత్రం పట్టించుకోలేదు.
అయితే ఇవన్నీ గమనిస్తున్న సౌభరి ఈ భూమ్మీద  ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం, అంతరాయం ఏర్పడుతూనే వుంటుందని భావించాడు.ఇక ఇలా కాదని తలచి ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి  జల స్తంభన విద్యతో  యమునా నదిలోపల చాలా లోతులోకి మునిగి  తపస్సు చేసుకోసాగాడు. తర్వాత్తర్వాత సౌభరి విషయము అర్థం చేసుకున్న ఇంద్రుడు నిశ్చింతగా ఉండసాగాడు.
అలా నీటి అడుగున వున్న సౌభరి దృష్టి ఒక రోజు చేపల కుటుంబంపై పడింది. ఓ చేప తన కుటుంబంతో  హాయిగా విహరించడం చూశాడు. అలా వాటిని చూడటంతో తనకూ కుటుంబం ఉంటే బాగుండునని అనుకున్నాడు. వివాహం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది.
అలా ఆలోచన వచ్చిన వెంటనే నీటి నుండి బయటకు వచ్చాడు. మాంధాత రాజు వద్దకు వెళ్ళి "నాకు వివాహేచ్ఛ కలిగింది. మీ యాభై మంది కన్యకల్లో ఒకరిని ఇచ్చి వివాహం చేయగలరు." అని అడిగాడు.
అయితే శుష్కించిన శరీరంతో వున్న సౌభరి మహర్షిని తన పుత్రికలు ఎవరూ వివాహం చేసుకోవడానికి ముందుకు రారని మనసులో అనుకున్నాడు  మాంధాత.అందుకని తెలివిగా నా పుత్రికలలో ఎవరైనా తమరిని వరించినట్లయితే వారినిచ్చి పెళ్ళి చేస్తాను అంటాడు.మాంధాత మనసులోని అసలు విషయం అర్థమై పోయింది.తనను ఆ కన్యకలు ఉన్న అంతఃపురానికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వమని కోరితే  మాంధాత సరేనంటాడు.
సౌభరి  వెంటనే అంతఃపురానికి వెళ్తూ తన యొక్క తపశ్శక్తితో నవ యవ్వనం నిండిన అందమైన యువకుడిగా మారి పోతాడు.అతని అందమైన రూపాన్ని చూసి మాంధాత యాభై మంది కుమార్తెలు సౌభరిని వరిస్తారు.తప్పనిసరై మాంధాత తన కూతుర్లను సౌభరికి ఇచ్చి వివాహం చేశాడు.
తనకున్న తపశ్శక్తితో  వారందరికీ అందమైన భవనాలు, భోగ భాగ్యాలను కల్పించి అందరితో  సుఖంగా జీవించ సాగాడు.
 మాంధాతకు తన కూతుర్ల విషయంలో చాలా అసంతృప్తి ఉండేది. ఎలా ఉన్నారో చూడాలని వెళ్ళి తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు. ఏ కూతురును అడిగినా తానెంతో సంతోషంగా ఉన్నానని, తనను ఎప్పుడూ  విడిచి ఉండకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని చెప్పడంతో ఆశ్చర్యం ఆనందం కలిగాయి.
అలా సౌభరి మహర్షి యాభై మంది కన్యకలను వివాహమాడి యాభై రూపాలు ధరించి వారితో సుఖ జీవన యానం  చేస్తాడు.
ఈ సౌభరి మహర్షి న్యాయములో గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఒకే సౌభరి మహర్షి యాభై రూపాల్లో కనిపిస్తూ యాభై మంది కన్యకల్లో  ఎవరికి వారే తమ సొంతంగా భావించి ఆనందంగా ఉండటం అనేది  ఆధ్యాత్మిక దృష్టి అన్న మాట.భగవంతుని ఒకే సమయంలో ఎంత మంది ధ్యానించినా అంత మందికి వారికి నచ్చిన విధంగా స్వంత వాడిగా కనిపిస్తూ వుంటాడు.
అంటే దైవం ఒక్కరే తనని కొలుస్తున్న  భక్తులందరికీ ఇష్టమైన రూపాల్లో కనిపిస్తూ మానసిక తృప్తిని కలిగిస్తాడు అనే అర్థంతో ఈ "సౌభరి న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఇక మరో కోణంలో చూస్తే ..సౌభరి ఓ మహర్షి,తపస్సంపన్నుడు.అలాంటి వాడు చేపల దాంపత్యం చూసి చాంచల్యంతో తాను అలాంటి జీవితాన్ని గడపాలనుకోవడం ఏమిటి ?అంతటి  తపశ్శక్తిని సాంసారిక వ్యామోహంలో కోల్పోవడం ఏమిటి? దీనంతటికీ కారణం కోరిక.కోరిక ఎప్పుడూ అనంతంగా సాగిపోతూనే వుంటుంది.
అలా  ఆలోచిస్తూ  తనకు తాను తెలుసుకొని,వ్యామోహ విముక్తి కోసం ప్రయత్నిస్తాడు. 
పశ్చాత్తాపంతో  సమస్తం  సౌభాగ్యాన్ని, సంపదలను,పుత్ర పుత్రులను వదిలేసి భార్యలను తీసుకుని అడవిలోకి  ప్రవేశించి వాన ప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు.చివరికి  నేనెవరు? అనే చింతనతో మోక్ష సాధన చేస్తాడు.
 ఇదండీ!"సౌబరి న్యాయం" అంటే... ఈ న్యాయము గురించి తెలుసుకునే క్రమంలో వేమన రాసిన "కామి గాని వాడు మోక్షగామి కాడు" అనే పద్యం గుర్తుకు వస్తుంది.కదండీ.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు