స్వధర్మం; - సి.హెచ్.ప్రతాప్
 శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||
చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా, గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది ; స్వధర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే ; కానీ, పరధర్మం మాత్రం భయంకరమైనది.
మనలో సహజసిద్ధంగా ఉన్న అభిరుచి, వాసనలను అనుసరించి
ఒకానొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది … అదే స్వధర్మం అవుతుంది.
ఇతరులకు నిర్దేశించబడినవి,మరి మనకు నిర్దేశించబడనిది అయినదే పరధర్మం. మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడం,ఇతరుల  స్వధర్మాన్ని ఆచరించడం  పరధర్మపాలన  అవుతుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం సబబు కాదు.పులి జీవితంలా నక్క జీవితం ఉంటే నక్క నష్టపోతుంది. నక్క దశ లో వున్నప్పుడు నక్కలానే జీవించాలి.ప్రపంచం ధర్మమార్గంలో సాగవలసినప్పుడు సమాజంలోని వ్యక్తులు, పాలకులు అందరూ స్వధర్మ నిర్వహణ చేయవలసిందే. ధర్మ జీవనం వ్యక్తికి, సమాజానికి కూడా శ్రేయస్సును కలిగిస్తుంది. మనిషి ఏదో ఒకటి చేయాలనుకొని తన ధర్మాన్ని పక్కనబెట్టి ప్రవర్తించడం వల్ల అన్ని అనర్థాలూ జరుగుతాయి. కాబట్టి స్వధర్మనిష్ఠ శ్రేయస్కరం.మరోకరిలా నటించటం కన్నా మనం మన లాగే ఉండటం ఏంతో ఆనంద దాయకం. మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యముతో చాలా సునాయాసంగా చేయవచ్చు. ఇతరుల విధులు దూరం నుండి చూడటానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు, మనకి అలా చేయబుద్ధి అవ్వచ్చు, కానీ అది ప్రమాదభరితమైనది.

కామెంట్‌లు