సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -338
సూచీ కటాహ న్యాయము
*****
సూచీ అంటే సూది.కటాహ అంటే నూనె మున్నగునవి కాచెడి పాత్ర,భాండము,తాబేటి వెన్ను చిప్ప,నూయి అనే అర్థాలు ఉన్నాయి.
ఒకానొక వ్యక్తి ఓ కమ్మరి పని చేసే వ్యక్తికి సూది యొకటి కాగు యొకటి తయారు చేసి ఇమ్మని చెప్పాడు.అప్పుడా కమ్మరి ముందు సూది తయారు చేసి ఇచ్చాడు.మరి కాగు గురించి అడిగితే "ఒకటి ముట్టింది  కదా! మిగతాది తర్వాత చేసి ఇస్తాను" అంటాడు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే  లోకంలోని మనుషుల నైజాన్ని ఈ న్యాయం చెబుతుంది. అలాగే దీనిని ప్రతి ఒక్కరికీ వర్తింప చేయవచ్చు.మనం  ఏవైనా రెండు రకాల పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మొదటగా వాటిల్లో తేలికగా ఉన్న పనులు పూర్తి చేస్తాం .ఆ తర్వాతనే కష్ట సాధ్యమైన పనుల వైపు దృష్టి  పెడతాం.ఎవరైనా అలాగే చేస్తారు.తేలికగా ఉన్న వాటిని ముందు చేసి  కష్టమైనవి  చేయడానికి నెమ్మదిగా పూనుకుంటారు.
ఇదే విషయాన్ని విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు కూడా అన్వయింప జేయవచ్చు. పరీక్షలలో మొదట తేలికగా రాయగలిగే ప్రశ్నలకు ముందు సమాధానాలు రాస్తారు. బాగా ఆలోచించి రాయాల్సిన ప్రశ్నలకు ఆ తర్వాత సమయాన్ని కేటాయిస్తూ వుంటారు.
 అలా తేలిక పనులు ముందుగా పూర్తి చేయడం వల్ల మనలో కొంత విశ్వాసం పెరుగుతుంది.ఆ తర్వాత కష్టమైన పనులు కూడా చేయగలిగే ఆత్మ స్థైర్యం బలపడుతుంది .
ఈ "సూచీ కటాహ న్యాయము"ద్వారా పైవే కాకుండా మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించవచ్చు. తెలిసిన జ్ఞానం నుండి తెలియని జ్ఞానాన్ని నేర్చుకునే దిశగా ఆత్మ విశ్వాసంతో ముందుకు  సాగడమనేది ఇందులో వుంటుంది.గణిత పద్ధతుల్లోని  ముఖ్యమైన పద్ధతుల్లో ఆగమన పద్దతి లాంటిది.అనుభవాల ద్వారా జరిగే జ్ఞాన నిర్మాణం మరింత తెలుసుకోవడానికి, చేయడానికి కావలసిన ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
 మనం కూడా ఈ "సూచీ కటాహ న్యాయాన్ని"  పనుల సాధనలోనూ,జ్ఞాన సముపార్జనలోనూ సందర్భానుసారంగా ఉపయోగించుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు