నీలాంటోడు వూరికొక్కడుంటే చాలు - డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

   ఒకూర్లో రామయ్య అని ఒక రైతున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళలో పెద్దోడు చానా తెలివైనోడు. ఒకసారి రామయ్య పెండ్లాం పిల్లలతో కలసి పక్కూరికి బంధువుల పెళ్ళికి పోవాలనుకున్నాడు. చుట్టుపక్కలోళ్ళు చానామంది ఆ పెండ్లికి పోతా ఉండడంతో దారిలో అలసట లేకుండా వాళ్ళతో ఆ ముచ్చటా ఈ ముచ్చటా చెప్పుకుంటా పోవచ్చునని రామయ్య కూడా ఆ గుంపులో కలసినాడు. అప్పట్లో రైళ్ళు, బస్సులూ ఉండేటివి కాదు గదా... దాంతో అందరూ పొద్దున్నే లేచి కాలినడకన బైలుదేరినారు.
ఆ ఊరికి ఈ ఊరికి నడుమ ఒక అడవి వుంది. ఆ అడవిలో పోతావుంటే రామయ్య పిల్లలకు ఒకచోట ఒక మాంచి మాగిన మామిడి పళ్ళ చెట్టు కనబడింది. దాంతో వాళ్ళు ఎవరికీ చెప్పకుండా ఆ చెట్టుకాడికి పోయినారు. గుంపులో పోతావున్న వాళ్ళు అది గమనించలేదు. అట్లాగే పోతా వున్నారు. ఆ పిల్లలు చెట్టెక్కి మంచి మంచి పళ్ళు కోసుకుంటా... కోసుకుంటా... అమ్మానాయనలు ఎంత దూరం పోయినారో చూసుకోలేదు. పండ్లు మూట గట్టినాక దిగి చూస్తే ఇంకేముంది... కనుచూపు మేరలో యాడా ఎవరూ కనబడలేదు. దాంతో చిన్నోడు భయపడి ఏడవడం మొదలు పెట్టినాడు.
కానీ పెద్దోడు బెదపడకుండా వానికి ధైర్యం చెప్పి వాళ్ళమ్మా నాన్నలను వెదుక్కుంటా బైలుదేరినారు. అట్లా పోతావుంటే వాళ్ళకు ఒకచోట ఒక గాడిద మేత మేస్తా కనబడింది. పెద్దోడు అది చూసి “ఒరేయ్... తమ్ముడూ... పోరా... పోయి మట్టసంగా దాన్ని పట్టుకోని రాపో" అన్నాడు. దానికి తమ్ముడు “అదెందుకన్నా... ఏం పనికొస్తాదది" అన్నాడు. పెద్దోడు నవ్వుతా “రేయ్ మనం ఎంత దూరం నడవాల్నో తెలీదు. ఎటుపక్క పోవాల్నో తెలీదు. ఈ గాడిదన్నా వుంటే నడిచీ నడిచీ అలసట రాకుండా నువ్వు కాసేపు, నేను కాసేపు దాని మీదెక్కి పోవచ్చు. లోకంలో పనికి రానిది ఏదీ వుండదురా.  ఉపయోగించుకొనే తెలివి మనకు వుండాలి " అన్నాడు. తమ్ముడు అలాగేనని వెనుక నుండి పోయి దాన్ని పట్టేసుకున్నాడు.
వాళ్ళు గాడిదను తీసుకోని కొంచం దూరం పోయినాక ఒకచోట ఒక లావు తాడు కనిపించింది. వెంటనే పెద్దోడు “ఒరేయ్ తమ్ముడూ... పో... పోయి ఆ తాడు తీసుకోని రాపో" అన్నాడు. దానికి తమ్ముడు "అదెందుకన్నా... ఏం పనికొస్తాదది" అన్నాడు. దానికి పెద్దోడు నవ్వుతా "రేయ్... ఈ లోకంలో పనికిరానిదంటూ ఏదీ వుండదురా... దేని అవసరం దానిదే... అయినా నువ్వు మోసేదుందా, నేను మోసేదుందా... తీసుకోనొచ్చి గాడిద మీద వెయ్... పడుంటాది" అన్నాడు. తమ్ముడు సరేనని ఆ తాడును తీసుకోనొచ్చి గాడిద మీద వేసినాడు.
మళ్ళా వాళ్ళు అట్లా పోతావుంటే దారిలో ఒకచోట ఒక గడ్డపార పడి వుండడం కనిపించింది. వెంటనే పెద్దోడు “రేయ్... తమ్ముడూ... పోరా... పోయి ఆ గడ్డపార పట్టుకోని రాపో" అన్నాడు. దానికి తమ్ముడు “అదెందుకన్నా... అనవసరమైన బరువు. మనమేమన్నా తవ్వేదుందా... పగలగొట్టేదుందా... ఏం పనికొస్తాదది" అన్నాడు. దానికి పెద్దోడు నవ్వుతా "ఒరేయ్... ఈ అడవిలో ఎప్పుడు దేని అవసరం పడతాదో ఎవరికి తెలుసు, ఇది ఊరు గాదు. పని పడగానే పక్కింటికో ఎదురింటికో వరుగెత్తుకొని పోయి తెచ్చుకోడానికి" అన్నాడు. తమ్ముడు సరేనని దానిని తీసుకోనొచ్చి గాడిద మీద వేసి జారిపోకుండా తాడుతో గట్టిగా కట్టేసినాడు.
అట్లా వాళ్ళు పోతావుంటే కాసేపటికి చీకటి పడింది. అడవిలో చీకటిలో పోవడం మంచిది కాదుగదా... దాంతో ఎక్కడైనా రాత్రి గడపడానికి మంచి చోటు దొరుకుతుందేమోనని వెదకసాగినారు. వారికి ఒకచోట ఒక పెద్దగుహ కనిపించింది. పెద్దోడు దాన్ని చూసి “ఒరేయ్... మనం ఈ రాత్రికి ఈన్నే పండుకోని రేప్పొద్దున పోదాం" అన్నాడు. సరేనని ఇద్దరూ గుహ లోపలికి పోయినారు. ఒకచోట బాగా శుభ్రం చేసుకోని, పురుగూ పుట్రా రాకుండా మంటేసుకోని, గాడిదను ఒక పక్కగా కట్టేసి పండుకున్నారు.
కానీ... వాళ్ళు పండుకున్న గుహ ఒక పెద్ద రాక్షసునిది. వాడు అన్నానికని బైటకు పోయినాడు. అడవిలో దొరికే పెద్ద పెద్ద జంతువులను పట్టుకోని తిని అర్ధరాత్రప్పుడు తిరిగి వచ్చినాడు. గుహ లోపల వెలుగు చూసి లోపల ఎవరో ఉన్నారని గ్రహించి “రేయ్... ఎవర్రా లోపల... బైటకు రండి... ఎంత ధైర్యంరా మీకు నా గుహ లోపలికి పోడానికి" అంటూ గట్టిగా కేకలు పెట్టినాడు. ఆ అరుపులకు అన్నదమ్ములిద్దరూ అదిరిపడి లేచినారు. చిన్నోడు భయంతో గజగజా వణికిపోసాగినాడు.
పెద్దోడు వానికి ధైర్యం చెప్పి “అసలు నువ్వెవర్రా... మాంచి నిద్రలో వుంటే పిచ్చి పట్టినట్లు పిచ్చికుక్కలా అట్లా అరుస్తా వున్నావ్... నేను గనుక బైటకు వచ్చినాననుకో... కాలి కిందేసి కసకసకస తొక్కుతా చూడు" అని అరిచినాడు లోపలి నుంచే.
ఆ మాటలకు రాక్షసుడు కోపంగా బుసలు కొడతా ''రేయ్... నేను రాకాసిని. నిన్ను ఇక్కడికిక్కడే నలుచుకోని తింటా చూడు" అంటూ మరింత గట్టిగా అరిచినాడు.
ఆ మాటలకు పెద్దోడు ఏ మాత్రం బెదపడకుండా “ఒరేయ్... నువ్వు మనుషులను తినే రాకాసివైతే... నేను రాకాసులనే తినే గీకాసినిరా, ఇప్పుడే ఇద్దరిని తిని అలసిపోయి పడుకున్నా. నేను ఆకలయితే గానీ ఎవరినీ చంపను.
కానీ నువ్వు ఇట్లాగే అల్లరి చేస్తే మాత్రం జాగ్రత్త. పట్టి కరకరకర అప్పడం కదా నమిలి మింగినట్టు మింగుతా చూడు" అని అరిచినాడు.
ఆ మాటలకు రాక్షసుడు అదిరిపడ్డాడు. "రాకాసి అంటే తను. మరి గీకాసంటే ఎవరు? అదెట్లాగుంటుంది?? తనకన్నా పెద్దగా భయంకరంగా వుంటుందా??? అసలు గీకాసి అనే మాట తానెప్పుడూ వినలేదు. ఇది నిజమా... అబద్దమా...." అని ఆలోచించి "సరే... అయితే... నేను నా తల వెండ్రుకను పీకి లోపలికి వేస్తా... నీవు నీ వెండ్రుక బైటికి వేయ్... చూద్దాం ఎవరిది ఎంత పొడుగుంటుందో” అని రాక్షసుడు తల మీద నుంచి ఒక వెండ్రుక పీకి లోపలికి విసిరినాడు.
దానికి పెద్దోడు “ఒరేయ్... నీ తల వెండ్రుక నా మూతి మీది మీసమంత గూడా లేదు. చూడు నా వెండ్రుక" అంటూ తాడు తీసుకోని బైటకు విసిరినాడు.
రాక్షసుడు చీకట్లో ఆ తాడు పట్టుకోని అదిరిపడ్డాడు. “ఓరి నాయనోయ్ వీని వెండ్రుకే ఇంత లావు, ఇంత పొడుగు ఉందంటే, వీడు మరింకెంత పెద్దగా వుంటాడో ఏమో" అనుకున్నాడు. ఐనా అనుమానం తీరక “సరే... ఐతే నేను నా కోరపన్ను ఒకటి పీకి లోపలికేస్తున్నా, నీవు గూడా నీ కోరపన్ను పీకి ఒకటి బైటికెయ్... చూద్దాం ... ఎవరిది ఎంత పెద్దగుందో" అంటూ ఆ రాక్షసుడు ఒక కోరపన్ను పీకి లోపలికి విసిరినాడు.
దానికి పెద్దోడు “ఒరేయ్... నీ కోరపన్ను నా చిటికెన వేలు మీది గోరంత కూడా లేదు. చూడు నా కోరపన్ను" అంటూ ఈసారి గడ్డపార బైటకు విసిరినాడు.
రాక్షసుడు చీకటిలో ఆ గడ్డపార పట్టుకొని అదిరిపడ్డాడు. “ఓరినాయనోయ్... ఒక పన్నే ఇంత పొడవుగా, ఇంత గట్టిగా ఉందంటే మరి వాని నోరు ఇంకెంత పెద్దగా వుంటాదో ఏమో" అనుకున్నాడు. ఐనా అనుమానం తీరక "సరే... ఇంకొక పందెం. నేను గట్టిగా నా బలమంతా ఉపయోగించి అరుస్తా... తరువాత నువ్వు అరువు. ఎవరు గట్టిగా అరుస్తారో చూద్దాం" అంటూ నోరంతా తెరిచి గుండెలదిరిపోయేటట్లు గట్టిగా కేకలు పెట్టినాడు.
ఆ అరుపులు వినగానే చిన్నోడు భయంతో పెద్దోనికి అతుక్కోనిపోయినాడు. కానీ పెద్దోడు మాత్రం కొంచం గూడా భయపడకుండా "ఒరేయ్... నేను హాయిగా నిద్రపోతావుంటే... లేపడమే గాక సారికో పందెం అంటూ విసిగిస్తావా... లాభం లేదు... వస్తావున్నా కాసుకో... నిన్ను ఒక్క దెబ్బతో చంపి కరకరకర నమలకపోతే నా పేరు గీకాసే కాదు" అంటూ గట్టిగా అరుస్తా పక్కనే వున్న గాడిద ముఖమ్మీద ఈడ్చి ఒక్కటి పెరికినాడు.
అంతే... ఆ దెబ్బకు దిమ్మ తిరిగిన గాడిద నొప్పి తట్టుకోలేక గట్టిగా గుహ మారుమ్రోగేలా అరవసాగింది. ఆ అరుపులు విన్న రాక్షసుడు అదిరిపడ్డాడు. “ఓరినాయనోయ్... ఇవేం అరుపులురా దేవుడోయ్... చెవులు బద్దలయి పోతా వున్నాయి. ఈ గీకాసిగానికి దొరికినానంటే అంతే... ఇదే నాకు ఆఖరిరోజు అవుతాది" అనుకోని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినాడు.
చిన్నోడు, పెద్దోడు హమ్మయ్య అనుకోని పొద్దున్నే మళ్ళా గాడిద మీదెక్కి వాళ్ళమ్మానాన్నలను వెదుక్కుంటా బైలుదేరినారు. కొంచం దూరం పోయినారో లేదో వాళ్ళమ్మా నాన్న కళ్ళనీళ్ళు బెట్టుకోని వీళ్ళను వెదుక్కుంటా ఎదురుగా వస్తా వున్నారు. చిన్నోడు, పెద్దోడు వురుక్కుంటా పోయి వాళ్ళను కరుచుకున్నారు. "ఇంగెప్పుడూ మీకు చెప్పకుండా ఎక్కడికీ పోము... తప్పయింది" అంటూ ఆ రాత్రి జరిగిందంతా వాళ్ళకు చెప్పినారు. అందరూ పెద్దోని తెలివితేటలకు, ధైర్యానికి సంబరపడి “శభాష్ రా పెద్దోడా... నీలాంటోడు ఊరికొక్కడున్నా చాలు... అందరూ హాయిగా బతికిపోతారు" అని మెచ్చుకున్నారు.
***********
కామెంట్‌లు