పొడుపు విప్పవమ్మ బుట్టబొమ్మ!;- పొర్ల వేణుగోపాల రావు.
 ప్రక్రియ: పద్యము(ఆట వెలది)
*******
(1)
కాయలందు రేడు!ఘనకిరీటము తోడు!
కూర జూచినంత నూరు నోరు
'వంక బెట్టలేరు వడ్డించ, రుచిజూడ
పొడుపు విప్పవమ్మ!బుట్టబొమ్మ!
(2)
పోషకంబులుండు!  పొడవు బాగుగనుండు!
పులుసులోన జారి ముక్కలగును!
పొగడు వేళ దీని పోలిక జూపేరు!
పొడుపు విప్పవమ్మ!,బుట్టబొమ్మ!
(3)
పుడమి క్రింద పెరుగు!పొరలుగా తానుండు!
తల్లివోలె జేయు దగిన మేలు
కత్తి తోడ దరుగ కన్నీరు జిందురా!
పొడుపు విప్పవమ్మ! బుట్టబొమ్మ!
(4)
ఆకుపచ్చ రంగు నలరారుచూ నుండు!
కొరికినంత ఘాటు దొరలుచుండు!
బజ్జిలోన దూరి పలకరించును తాను
పొడుపు విప్పవమ్మ!బుట్టబొమ్మ!
(5)
ఎర్రనైన పండు! నెల్లవేళల పండు!
కూర్మిగలిగి యుండు!కూరలందు!
పచ్చడైన వేళ భళి!పొట్టలే నిండు!
పొడుపు విప్పవమ్మ! బుట్టబొమ్మ!
*******
జవాబులు: వంకాయ, మునగకాయ,ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ, టమాటా

కామెంట్‌లు