సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -388
అప్రసక్త నిషేధ న్యాయము
*****
అప్రసక్తము అనగా అడుగబడనిది, సంబంధం లేనిది అని అర్థం.నిషేధము అనగా అడ్డగింపు,త్రోపుడు అనే అర్థాలు ఉన్నాయి.
 అప్రసక్త నిషేధము అనగా అడుగబడనిది లేదా సంబంధం లేని దానిని నిషేధించడం తప్పు అని అర్థం.
 పూర్వపు గ్రంథాలను  పరిశీంచినట్లయితే కొన్ని విషయాలు మనకు అవగతమవుతాయి.ఆ గ్రంథాలలో  ప్రస్తావించిన కొన్ని ధర్మాలు నిజం కావు లేదా ప్రస్తుతానికి వర్తించవు.అలాంటి వాటి గురించి ప్రస్తావించినప్పుడు వాటిని నిషేధించాలి కాని మిగతా అన్ని కాదు.
ఉదాహరణకు ప్రాతఃకాలములో పువ్వులు వికసిస్తాయి అను వాక్యంలో చాలా వరకు ప్రాతఃకాలముననే పూలు వికసిస్తాయి.అందులో నిషేధించాల్సిన అవసరం లేదు.
కాని సకల పుష్పాలు వికసిస్తాయి అన్నప్పుడు  మాత్రం  నిషేధించాలి. ఎందుకంటే కొన్ని సాయంత్రాలు,రాత్రి పూట వికసించే పూలు వున్నాయి .అవి కలువ, రుద్రాక్ష( నాలుగు గంటల పూలు),మల్లె, సన్నజాజి వంటి పూలు వుంటాయి కాబట్టి చెప్పిన ధర్మము ప్రకారము తప్పు కదా!వారు చెప్పిన ప్రకారము ఉదయం పూట వికసించాలి కానీ అలా వికసించడం లేదు.కలువ పూలు, రుద్రాక్ష పూలు( నాలుగు గంటల పూలు), పారిజాత పూలు, మల్లెపూలు, రజిని గంధ పూలు,ముళ్ల యాపిల్ పూలు (దాతురా), చంద్ర పుష్పము (మూన్ ఫ్లవర్), నిమ్మ సువాసన పూలు ( సాయంత్రం ప్రింరోస్) , నైట్ ఫ్లోక్స్, ఏంజెల్ ట్రంపెట్,ఆర్చిడ్, నికోటియానా,కాసా బ్లాంకా లిల్లీ, సాయంత్రం స్టాక్... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పూలు రాత్రి పూట పూసేవి వున్నాయి.
మరి అవి కూడా ఉదయమే వికసిస్తాయి అన్నప్పుడు అవి అలా వికసించవని ఆ ధర్మం చెల్లదు కాబట్టి నిషేంచాలి.అలా నిషేధించడాన్నే "ప్రసక్త నిషేధము "అంటారు.

"చీకటి తెల్లగా వుండదు" అవును కదా! దీనిని నిషేధించుట తప్పు. అలా నిషేధిస్తే అది "అప్రసక్త నిషేధము" అవుతుంది.
దీనిని బట్టి ఏదైనా విషయాన్ని గురించి చెప్పేటప్పుడు నిశితంగా , సూక్ష్మంగా పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలి అంతే కానీ వాటి గురించి లోతుగా అధ్యయనం చేయకుండా ప్రసక్త నిషేధమా ? అప్రసక్త నిషేధమా? అనే వ్యాఖ్యలు తొందరపడి చేయకూడదని ఈ "అప్రసక్త నిషేధ న్యాయము" చెబుతోంది.
 "ఉదాహరణకు లోహాలన్నీ ఒకే లక్షణాలు కలిగి ఉంటాయి" వాక్యాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే  లోహాలకు సర్వసాధారణంగా  మెరుపు లేదా తళుకు వుంటుంది.లేదంటే వాటికి మెరుగు పెట్టి మెరుపు తెప్పించవచ్చు. ఖంగుమని మ్రోగుతాయి.సాగతీస్తే సాగుతాయి. ఇలా మరి కొన్ని లక్షణాలు ఉంటే వుండొచ్చు కానీ.అన్ని లోహాలకు ఇలాంటి కొన్ని లక్షణాలు కలవవు.
ఉదాహరణకు లిథియం, సోడియం, పొటాషియం లోహాలే కానీ ఇవి క్షార లోహాలు ఇవి నీటి మీద తేలుతాయి లిథియం బెండు కంటే కూడా తేలికైన లోహము.అలాగే పాదరసం ద్రవ రూపంలో వుండే ఏకైక లోహము. ఇలా లోహాలు అన్నీ ఒకే ధర్మాలను, లక్షణాలను కలిగి ఉంటాయి  అనేది నిషేధించ వచ్చు.ఎందుకంటే పైన చెప్పిన కొన్ని లక్షణాల్లో భేదాలు కనిపించాయి కదా! ఇలాంటి వాటిని నిషేధించడాన్ని 'ప్రసక్త నిషేధము' అంటారు.
మరో చిన్న ఉదాహరణ వేమన పద్యంతో ముగిద్దాం.
"ఉప్పు కప్పురంబు నొక్కపోలిక నుండు/చూడ చూడ రుచుల జాడ వేరు/పురుషులందు పుణ్య పురుషులు వేరయా/ విశ్వధాభిరామ వినురవేమ!"
ఉప్పు, కర్పూరము రెండూ పదార్థాలే . చూడటానికి రెండూ ఒకే రంగులో, ఒకేలా వున్నట్లు కనిపిస్తాయి.కానీ చూడగా చూడగా వాటి రుచులలో తేడా కనిపిస్తుంది.
అలాగే మనుషులందరూ ఒకేలా మంచివారిగా కనిపించినా వారిలో అసలైన మంచి వారు వేరుగా వుంటారు. వారిని చూడగా చూడగా అంటే బాగా పరిశీలించి చూస్తే మంచివారెవరో, కానివారు ఎవరో తెలుస్తుంది.
 దీనిని బట్టి పదార్థాలు చూడటానికి ఒకే విధంగా ఉన్నంత మాత్రాన వాటి ధర్మాలు,ఒకటే అని చెబితే నిషేధించాల్సిన అవసరం ఉంది.
అలాగే మానవులందరిలో శారీరక పరమైన అనగా శరీర నిర్మాణానికి సంబంధించి అవయవాల ధర్మాలు ఒకటే అని చెబితే నిషేధించాల్సిన అవసరం లేదు.అలా కాదని నిషేధించుట తప్పు కాబట్టి అది 'అప్రసక్త నిషేధము' అవుతుంది.
ఇలా గ్రంథాలు, శాస్త్రాలు ఉటంకించిన చాలా విషయాలు ప్రస్తావించేటప్పుడు ఈ రెండు కోణాల్లో చూడాల్సి వుంటుంది.
అది  కేవలం పదార్థాలు, లోహాలు మొదలైన వాటికేనా అంటే కాదని వేమన పద్యం ద్వారా తెలిసింది కదా!
అన్నింటినీ ఒకే గాటకు కట్టకూడదు.తరచి తరచి చూసి ఒక నిర్ణయానికి రావాలని ఈ "అప్రసక్త నిషేధ న్యాయము" ద్వారా మనం తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు