సుప్రభాత కవిత ; - బృంద
అడుగులన్నీ  వెలుతురు వైపే
చూపులన్నీ గమ్యం వైపే
కలతలన్నీ మౌనం వైపే
గెలుపులన్నీ తూరుపు వైపే

వెలుగు నీడల తేడాలేక
తరిగే దూరపు భారం
ఆశ నిరాశల ప్రభావం లేక
దొరికే విజయపు తీరం

తోడై వచ్చే కాంతి కిరణం
నీడగ మారే నిశ్శబ్దం
వీడక నడిపే ధైర్యం
వాడక నిలిచే విశ్వాసం

ఏటిపరుగులా పయనం
ఎదురేదైనా  బెదరం
ఎత్తుపల్లాలు సమానం
ఎవరికీ తలవంచని వైనం

ఆరాటం ఊపిరిఅయితే
పోరాటం  తప్పనిసరి
ఆటంకాలెదురైనా  చెదరక
అలసిపోనివ్వని  నమ్మకం

జీవనగమనంలో దొరికే
చిన్ని సాంత్వన స్నేహం
చిరకాలం చేయివదలక
నడిపించే వేకువ నేస్తానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు