సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 భోగి పండుగ శుభాకాంక్షలుతో🏵️
-------------------------------------
న్యాయాలు -379
అజా యుద్ధ న్యాయము
****
అజా అనగా మేక  లేదా ఆడ మేక అనే అర్థాలు ఉన్నాయి. యుద్ధం అంటే పోరు,తగవు, పోట్లాట అనే అర్థాలు ఉన్నాయి.
 ఆడ మేకల తగవు లేదా పోరు/పోట్లాట మొదట ఆడంబరంగా మొదలై చివర్లో క్రియాశూన్యం అంటే ఎలాంటి ప్రమాదమూ లేకుండా పూర్తవుతుంది అని అర్థము.
రెండు ఆడ మేకల పోట్లాట చూసే వారికి అదెంత ఎంత పెద్ద పోరాటమో,యుద్ధమో అన్నట్లు కనిపిస్తుంది.రెండింటిలో దేనికో ఒకదానికి మూడినట్టే అనిపిస్తుంది. వాటి కొమ్ముల దడదడలూ ,చప్పుల్లే కానీ ఎలాంటి గాయాలు కావు.దెబ్బలు కూడా తగలవు.
 ఇలా  ఇరువైపులా భయంకరమైన శత్రుత్వం ఉన్నట్లుగా కనిపించినా ఎలాంటి హాని జరగకుండా పెట్టుకునే పోట్లాటను 'అజా యుద్ధం'తో  పోలుస్తుంటారు.
మేకలు మందలో తిరుగుతూనే ఉన్నట్టుండి పోట్లాటకు దిగుతాయి. ఆపినా ఆగకుండా ఒక దాని పైకి మరొకటి ఉరికురికి పోతాయి. ఆ సన్నివేశం చూస్తుంటే ఇది ఇప్పట్లో తెగదని, తేలేది కాదని చూసేవారు అనుకుంటారు.అలా అనుకొని ఎలా ఆపాలో ఆలోచించే లోపే వాటి పోట్లాటను విరమిస్తాయి.అవి ఎందుకు పోట్లాటకు దిగుతాయో, ఎందుకు విరమిస్తాయో ఎవరికీ తెలియదు.
 ఇలా వీటి పోట్లాటను చూసిన మన పెద్దలు"ఆరంభ శూరత్వం" అని పేరు పెట్టారు. ఇది వ్యక్తులకు వర్తింపజేసి చెప్పారు. ఎందుకంటే  కొంత మంది అట్ట హాసంగా పని మొదలు పెట్టి పూర్తిగా చేయకముందే మధ్యలోనే ఆపి వేస్తుంటారు. మొదట్లో ఉన్న హడావుడి,పట్టుదల చివరి దాకా వుండవన్న మాట.
ఇక ఇలాంటివి  మన కుటుంబాల్లో  తరచూ చూస్తూ వుంటాం.భార్యాభర్తలూ, అత్తా కోడళ్ళ మధ్య చిన్న చిన్న మాటల యుద్ధం మొదలవుతుంది. ఆ సమయంలో అక్కడ ఉండి చూస్తున్న వారికి ఇదేదో చిలికి చిలికి గాలి వానలా దేనికి దారి తీస్తుందో అనే భయం, కంగారును కలిగిస్తుంది.కానీ అంతలోనే ఎవరో ఒకరు నిశ్శబ్దంగా వుండి, ఆ తగవును ఆపేస్తారు. చుట్టుపక్కల చూసే వారిలో కొంతమందికి పైసా ఖర్చు లేని సినిమాగా"అబ్బా! ఇంకా వుంటే బాగుండేది.ఏదో ఒకటి తేలితే చూద్దామనుకుంటే  ఇలా జరిగిందేమిటీ? ఇదంతా  ఉత్తుత్తి యుద్ధమేనా? అని ఆశాభంగం అవుతుంది కూడా...*
ఇలా కుటుంబంలో కానీ, స్నేహితుల మధ్య కానీ ,మరెవరి మధ్యలో కానీ అనుకోకుండా మాటా మాటా పెరిగి ఆకస్మికంగా ఆగిపోవడాన్ని "అజా యుద్ధం" అంటారు.ఇందులో ధన,ప్రాణ,ఆస్తి నష్టాలేమీ జరగవన్న మాట.
 దీనిని సరదా పంచాయితీ అని కూడా అనుకోవచ్చు. లేదా ఈ గొడవ వల్ల ఏం సాధిస్తాం అనే ఆలోచన కూడా గొడవలు  పెట్టుకునే వారిలో రావడం కావచ్చు.అందుకే ఇలాంటివి తాటాకు మంటలా బుస్ మని  మండి ఆరిపోతుంటాయి.
" ఈ విధంగా అజా యుద్ధ న్యాయము" గురించి కొన్ని చిత్రమైన  విషయాలు తెలుసుకున్నాం కదా!
 మరి మనం కూడా దీనిని గమనంలో పెట్టుకుందాం. ఎవరైనా మనల్ని కావాలని కవ్వించి కయ్యానికి దిగినా, లోలోపల మరేదైనా దురుద్దేశంతో గొడవ పెద్దది చేయాలనుకున్నా దాని వల్ల మనస్పర్థలు రాకుండా  నవ్వుతూ వెంటనే ముగించేలా చూద్దాం. మరి మీరేమంటారు? నాతో ఏకీభవిస్తారు కదూ!"
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు