సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -373
అంధ పంగు న్యాయము
*****
అంధ అంటే గుడ్డియగు, చీకటి,నీరు,కళ్ళు లేని వాడు అనే అర్థాలు ఉన్నాయి.పంగు అంటే కుంటి వాడు, కాళ్ళు లేని వ్యక్తి, వికలాంగుడు,కుంటి ,శని అనే అర్థాలు ఉన్నాయి.
అనగనగా ఒక ఊరిలో  ఓ కళ్ళు లేని వ్యక్తి మరియు ఓ కాళ్ళు లేని అనగా వికలాంగుడైన వ్యక్తి .. వీరిద్దరూ స్నేహితులు. వాళ్ళు తమ అవసరాలను తీర్చుకోవడంలో ఎవరిపై ఆధారపడేవారు కాదు. వారిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వుండే వారు.
 కళ్ళు లేని అంధుడికి కళ్ళు తప్ప అన్ని అవయవాలు సక్రమంగా వున్నాయి. ఎటైనా నడవగలడు, ఏదైనా చేయగలడు కానీ కనిపించదు.కాబట్టి వాటిని గురించి చెప్పే మనిషి  కావాలి.అలాగే కాళ్ళ లోపం వల్ల ఆ వ్యక్తి నడవ లేడు .వేటి దగ్గరకు తనంత తానుగా పోలేడు.కనుక తనను అక్కడికి తీసుకొని పోయే వ్యక్తి కావాలి.ఇలా ఇద్దరికీ చెరో లోపం, చెరో అవసరం ఉన్నాయి. వాటిని తీర్చుకోవడానికి వాళ్ళు ఇద్దరూ ఓ మంచి మార్గం ఎన్నుకున్నారు.
అదెలా అంటే కళ్ళు లేని వ్యక్తి భుజాలపై కాళ్ళు లేని వ్యక్తి కూర్చుని ఎటు ఎలా వెళ్ళాలో దారి చూపుతూ వుంటే నడిచే అంధుడు ఎలాంటి యిబ్బంది లేకుండా  వెళ్ళే వాడు.అక్కడ కాళ్ళు లేని వ్యక్తి సూచనల మేరకు కళ్ళు లేని వ్యక్తి పనులు పూర్తి చేసుకునే వాడు.ఇలా ఇద్దరూ తమ లోపాలను అధిగమించి అందరికీ ఆదర్శంగా వుండే వారు.
 మరి ఈ న్యాయము దేనిని సూచిస్తుందో ఈ పాటికి అర్థమయ్యే వుంటుంది కదండీ!
ఇలా తమలో వేర్వేరు విషయాల్లో  సమర్థత,సామర్థ్యం లేని వారు పరస్పర సహకారంతో ప్రయోజనం పొందడం మనమిక్కడ గమనించాం.
ఇందులో రెండు రకాల అంశాలు వున్నాయి.అవి రెండు రకాల శక్తులను లేదా స్థితులను సూచిస్తున్నాయి.ఒకటి కదలగలిగినప్పటికీ చూడలేని అశక్తత లేదా స్థితి.రెండోది చూడగలిగినప్పటికీ కదలలేని స్థితి.దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన జ్ఞానబోధ చూద్దామా.
ప్రపంచం అనే యుద్ధంలో కూడా పోరాడటానికి మనకు ఓ వ్యూహం అవసరం.అలాగే చంచలమైన మనస్సును అణచి వేయడానికి ధైర్యం మరియు అవగాహన అవసరం. అవగాహన లేని ధైర్యం ప్రమాదం.అది అహంకారంగా మారుతుంది.ధైర్యం అనేది శక్తి.అవగాహన అనేది కన్ను. ధైర్యం నడిపించగలదు కానీ అవగాహన లేకుంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు.అవగాహన అనేది కన్ను లాంటిది. అవగాహన వున్నట్లయితే ఎక్కడికి వెళ్తున్నామో చూడగలం.అది సరైన దిశానిర్దేశం చేస్తుంది.
 దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దామా...
ఒక అడవిలో మంటలు వ్యాపించాయి. ఓ గుడ్డివాడు మరియు కుంటి వాడు తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.గుడ్డివాడు పరుగెత్తుతాడు కానీ కళ్ళు లేని తాను ఎటు పరుగెడుతాడో తెలియదు.ఎటు వెళ్ళాలో చూడకుండా పరిగెత్తడం అనేది మృత్యువును ఆహ్వానించినట్లే.
ఇక కాళ్ళు లేని వ్యక్తికి ప్రమాద స్థాయి తెలుసు.ఎటు వెళ్తే సురక్షితంగా వుండగలడో తెలుసు. కానీ అతడు కదలలేడు.
కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరి సహాయం ఒకరు కోరుకున్నారు. కళ్ళు లేని వ్యక్తి కాళ్ళు లేని వ్యక్తిని భుజాలపై వేసుకుని కాళ్ళు లేని వ్యక్తి చెప్పిన దిశలో పరుగెత్తాడు.తద్వారా ఇద్దరూ రక్షింపబడ్డారు.
అయితే ఇది గుడ్డి,కుంటి వ్యక్తులను ఉద్దేశించి కాదని అర్థం చేసుకోవాలి.
మంటలు చెరుగుతున్న అజ్ఞానమనే అరణ్యంలోంచి బయట పడాలంటే  జ్ఞానముతో కూడిన అవగాహనను ధైర్యంగా భుజాల మీదకు ఎత్తుకోవలసిందే. అలా ఐతేనే అజ్ఞానావరణము లోంచి బయట పడగలం.అవగాహన అనేది ఒక పరివర్తనా శక్తి. దానికి ధైర్యాన్ని జోడిస్తే అనుకున్నది సాధించగలమని ఈ "అంధ పంగు న్యాయము"ద్వారా గ్రహించవచ్చు.
ఏదైనా పనిని సాధించాలంటే అవయవాల లోపం వుంది ఎలా సాధించగలం ?అనే నిరాశ నిస్పృహలకు లోను కాకుండా వారంతా ఏకమై ఐకమత్యంతో  ఆ పనికి సంబంధించినవి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను సాధించగలరు. విజయాలను పొందగలరు.
 "అంధ పంగు న్యాయము" ను  గమనంలో పెట్టుకొని మనం మన జీవితంలో అవగాహనతో కూడిన ధైర్యంతో ముందుకు సాగుదాం. అనుకున్నవి విజయవంతంగా పూర్తి చేసుకుందాం.
 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు