నిన్నంటే నేర్చినది- రేపంటే గతానికి నాంది

 నిన్నటిదాకా అంటే మనం నేర్చుకున్న అధ్యయనమని, రేపంటే  ఆ గతానికి పలికే నాందియని పాలకొండ మండల పరిషత్ ఉపాధ్యక్షులు కనపాక సూర్యప్రకాశరావు అన్నారు. 
పాలకొండ మండలం వోని గ్రామంలో ఏర్పాటు చేసిన 
నూతన సంవత్సర శుభాకాంక్షల వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశరావు మాట్లాడుతూ మన జీవితమనే పుస్తకంలో నేడు విచ్చేసిన నూతన సంవత్సరమనే కొత్తపేజీ సుగంధ మాధుర్యమై గుబాళించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. 
వైస్ ఎంపిపి సూర్యప్రకాశరావుకు స్థానిక ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి, ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ, దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావులు పుష్పగుచ్చం, జ్ఞాపికలను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. 
సర్పంచ్ కె.రమణమ్మకు, ఎంపిటిసి కె.చిన్నమ్మడులకు పూలమొక్కలను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. 
ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి మాట్లాడుతూ పాఠశాల ప్రగతికి, విద్యార్థుల గుణాత్మక విద్యకు ఈ నూతన సంవత్సరం మరింత ప్రమాణాలు మెరుగుపరిచేలా దోహదమవ్వాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల కేకు కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు.
కామెంట్‌లు