సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -371
అంతర్ధీపికా న్యాయము
*****
అంతర్ అనగా లోపల. దీపికా అనగా దీపము.
అంతర్ధీపికా అనగా లోపల ఉన్న దీపము. 
లోపల ఉండటం అంటే ఏ లోపల ?అనే సందేహం వస్తుంది.కాబట్టి దానినే అర్థమయ్యే రీతిలో కుండలో ఉన్న దీపము అన్నారు.మరి కుండలో పెట్టిన  దీపము యొక్క  ప్రకాశము పైకి కనబడుతుందా? కనబడదు కదా!  ప్రకాశము పైకి కనబడక పోయినా లోపల మాత్రం వెలుగుతూనే ఉంటుంది.
 లోపల అనే పదాన్ని ఇక్కడ కుండ లోపల అనే అర్థంతో చెప్పారు.కుండ అంటే  కుమ్మరి చేసిన కుండ కాదు. మన దేహమనే కుండ అన్న మాట.
 కుండలో వెలుగుతున్నది దీపం. మరి మన దేహ కుండలో వెలుగుతున్నది ఏమిటంటే చైతన్య రూపంలో ఉన్న ఆత్మ దీపం.
అలాంటి ఆత్మ లేదా అంతరంగమందు పరమాత్మను ఎలా నిలుపు కోవాలో చెప్పిన వేమన పద్యాన్ని మరొకటి చూద్దాం..
"అంతరంగమందు అభవు నుద్దేశించి/ నిలిపి చూడ చూడ నిలుచుగాక/ బాహ్యమందు శివుని భావింప నిలుచునా/ విశ్వధాభిరామ వినురవేమ!"
పరమాత్మను హృదయంలో నిలుపుకొని చూస్తే ఏకాగ్రత కుదురుతుంది.బాహ్యంలో చూస్తే ఏకాగ్రత కుదరదు.ఫలితము శూన్యం అని అర్థము.
సామాన్య అర్థంతో చూస్తే ఏదైనా పని చేయాలంటే సంకల్ప బలంతో పాటు ఏకాగ్రత వుండాలి.అప్పుడే మంచి ఫలితం వస్తుంది.అదే అంతటా వ్యాపిస్తుంది ..
అలాగే కుండలో  ప్రకాశిస్తున్న  దీపం కుండ నంతటినీ ప్రకాశింప చేస్తుంది .దేహమనే కుండలోపల  వెలిగే దీపం దేహాన్ని చైతన్యవంతం చేస్తుంది.
ఆ చైతన్యమే మనల్ని అనేక క్రియలు  చేసేలా పురికొల్పుతుంది.
అలాగే ఈ దేహమనే మంటి కుండ ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోక మానదు.అనగా మరణించక మానదు. కానీ మనలో నిరంతరం వెలిగే ఆత్మ దీపము మాత్రం నశించదని చెప్పిన వేమన రాసిన మరో పద్యాన్ని చూద్దామా.
"మంటి కుండ వంటి మాయ శరీరంబు/చచ్చునెన్నడైన చావదాత్మ/ఘటము లెన్నియైన గగనమొక్కటే గదా/ విశ్వధాభిరామ వినురవేమ!"
మట్టి కుండ లాంటి దేహం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా నశిస్తుంది.కానీ ఆత్మ శాశ్వతమైనది.దానికది ఎన్నటికీ నాశనం కాదు.ఎన్ని దేహాలు నశించి భూమిలో కలిసిపోయినా ఆకాశం మాత్రం అలాగే ఎప్పటికీ వుంటుంది కదా.అందుకే అశాశ్వతమైన  దేహంపై  అనవసరమైన ప్రేమను పెంచుకోకూడదని అంటారు.
 ఇలా మన లోలోపల వెలిగే చైతన్య దీప్తితో  మనమూ  చైతన్య వంతం అవుదాం.సమాజాన్నీ చైతన్యవంతం చేద్దాం. ఇదే అంతర్ధీపికా న్యాయము ద్వారా గ్రహించవలసిన  నీతి .
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు