పంచపది బసవ పురాణం;- కాటేగారు పాండురంగ విఠల్-పంచపది ప్రక్రియ రూపకర్త-హైదరాబాద్ 9440530763
 31
మాదాంబకు తొమ్మిది నెలలు నిండెను
నందీశ్వరుడింకా గర్భములోనే దాగెను
పద్మాసనములో విశుద్ధాత్ముడై వుండెను
శివధ్యానంలో మూడు వత్సరాలుండెను
మిత్రులు శత్రువులందరూ భయపడిరి విఠల!
32
మాదాంబ నందికేశుని గుడికి వెళ్లెను
ఆమె తనబాధలు విన్నవించుకొనెను
నీ వరాలు గర్భము ఏదీ నాకొద్దనెను
మాదాంబ ఇంటికి వచ్చి పడుకునెను
నంది కలలోకొచ్చి విషయం చెప్పెను విఠల!
33
గర్భస్థశిశువు సామాన్యుడు కాదనెను
నందికేశ్వరుడే భువిపైకొస్తున్నాడనెను
వృషభం శిలాదుల పుత్రుడని చెప్పెను
శిశువుకు బసవడని పేరు పెట్టమనెను
మాదాంబ పరమానందభరితమయ్యె విఠల!
34
అప్పుడు శివుడు శిశువుతో చెప్పెను
వచ్చినకార్యం మరిచావా!అని అనెను
శివుని మాటవిని శిశువు ఉద్భవించెను
పుట్టగానే శివుడే లింగధారణము చేసెను
తాపసిగా వచ్చి శివుడాశీర్వదించెను విఠల!
35
నేను కప్పడి సంగమేశ్వరవాసిననెను
పూర్వం ఈ శిశువు నా కొడుకే ననెను
లోకహితార్థమై నీకు జన్మించాడనెను
లింగార్పితము కానిదే తినిపించకనెను
నేనే ఇతని గురువుని అదృశ్యమయ్యె విఠల!
36
వేయిసూర్యుల వెలుగు ఉద్భవించెను 
శిశువు తేజస్సుతో ధగధగా మెరిసెను
దివ్యమైన కాంతి ప్రభలు గోచరించెను
పంచమహా వాద్యములు మ్రోగసాగెను
శిశువుకు బసవడని పేరు పెట్టిరి విఠల!
37
లింగ ప్రసాదంలా స్తన్యం స్వీకరించేవాడు
శివామృతంలా చేతులు జుర్రుకునేవాడు
దీపము చూచి మహాజ్ఞానిలా నవ్వేవాడు
ధ్యానంలో వున్నట్లు నిశ్చేష్టుడై వుండేవాడు
బసవడు దివ్యలక్షణాలతో పెరగసాగె విఠల!
38
దుర్మార్గాన్ని తరిమినట్లు చేతులాడించె
మాయను రానియ్యనన్నట్లు కాళ్ళాడించె
పరమశివుని కార్యంకై ఉలికిపాటున లేచె
బసవడు విశ్వజనుల మొరలనాలకించె
శివానందమగ్నుడై ఆనందభాష్పాలు కార్చెవిఠల!
39
భక్తులకు ప్రణమిల్లినట్లుగా బోర్లాపడుకొని
శివారాధకులను చూచినట్లు తలపైకెత్తుకొని
పద్మాసనాభిలాశ యుక్తుడై నేలపైన కూర్చొని
ద్వితీయ శంభు-నందిలా మదిలో తలచుకొని
బసవడు శివుని lరూపులా అగుపించెను విఠల!
40
సనాతనమార్గాన్ని అడుగులుగా మలచుకొని
శివనామం-పంచాక్షరిని స్వరముగా చేసుకొని
శివ చిత్త శ్రేష్ఠతను పరుగులుగా భావించుకొని
మహేశ్వరాచారమునే తనువులో నింపుకొని
బసవడు దినదిన ప్రవర్ధమానమై పెరిగె విఠల!


కామెంట్‌లు