పంచపది బసవ పురాణము- కాటేగారు పాండురంగ విఠల్ పంచపది రూపకర్తహైదరాబాద్ 9440530763
 171
ఇదంతా తెలిసి కిన్నెర బ్రహ్మయ్య వచ్చాడు
కలకోత బ్రహ్మయ్య మహిమను స్తుతించాడు
కలకోత బ్రహ్మయ్య శివభక్తుల నాదరించాడు
జంగములందరికి విందు భోజనము పెట్టాడు
జంగమ భక్తులందరు సంతోషించారు విఠల!
172
మోళిగ మారయ్య అనే శివభక్తుడుండే వాడు
అతడు కట్టెలు కొట్టి జీవనము సాగించే వాడు
సంపాదించినధనంతో జంగమార్చనచేసేవాడు
శివ భక్తులను భోజనాలకు ఆహ్వానించే వాడు
బసవన్నముందు వారు మారయ్యనుపొగిడిరి విఠల!
173
బసవడు మారయ్య ఆతిథ్యం చూడాలనుకున్నాడు
మారువేషము వేసుకొని అతని ఇంటికి వెళ్ళాడు
మారయ్య కట్టెలు తెచ్చుటకై అడవిలోకి వెళ్ళాడు
అతని భార్య ఇచ్చిన అతిథ్యాన్ని స్వీకరించినాడు
ఆమె వంట చేయడానికి వంట ఇంట్లోకి వెళ్లె విఠల!
174
బసవన్న రెండువేల మాడలనొకచోట వుంచాడు
తరువాత ఆతిథ్యము స్వీకరించి వెళ్ళిపోయాడు
మారయ్య వచ్చి జంగమయ్యలకాతిథ్యమిచ్చాడు
గిన్నె కిందున్న ధనము చూచి భార్యను అడిగాడు
ఆమె ఒక జంగముడు పూజ చేసి వెళ్లాడనె విఠల!
175
వచ్చినది జంగమయ్య కాదు బసవడని అన్నాడు
మారువేషంలో మనలను పరీక్షించవచ్చాడన్నాడు
పేద భక్తులకు బసవాడే ఇలా ఇస్తాడని అన్నాడు
బసవా!మా ఇంటిని పావనము చేశావని అన్నాడు
మారయ్య బసవన్నను స్మరిస్తూ వుండిపోయె విఠల!
176
బసవా!నాకీ ధనం అవసరం లేదని అన్నాడు
ఆ ధనం జంగమయ్యలకు దానంగా ఇచ్చాడు
వారి నోట మారయ్య భక్తిని,ప్రశంసను విన్నాడు
బసవడు ఇది విని మారయ్య ఇంటికి వచ్చాడు
మారయ్య బసవయ్యను కరుణించమనె విఠల!
177
మారయ్యా!నన్ను క్షమించమనె బసవేశ్వరుడు
నీవు పరధనము స్వీకరించని భక్తుడివన్నాడు
నేనిచ్చిన ధనం జంగములకిచ్చావని అన్నాడు
నీ గుణం నేను తెలుసుకోలేక పోయానన్నాడు
బసవడు,నీవు శివుని స్వరూపమేననెను విఠల!
178
నేను ఊర కాకిని నీవు కనకాద్రివి
నేను ఇనుముని నీవు పరుసవేదివి
నేను దుర్గుణుడను నీవు గుణనిధివి
నేను మనిషిని నీవు పరమేశ్వరుడివి
నాలో మంచి గుణం లేదనె బసవడు విఠల!
179
వెలివాడలో వేదఘోషలు వినబడవు
అవములో రాగి చెంబు లసలుండవు
నిప్పుల కుంపటిలో తామర లుండవు
అల్పజ్ఞులలో భక్తి భావనలు వుండవు
బసవన్న మారయ్యను వేనోళ్ళ పొగిడె విఠల!
180
కళ్యాణంలో కన్నద బ్రహ్మయ్యను దొంగుండేవాడు
రాత్రిళ్ళు ఇళ్లకు కన్నాలేసి దొంగతనం చేసేవాడు
అది శివభక్తుల ఇళ్ళైతే పాదాలకు మొక్కేవాడు
వారికి క్షమించమని చెప్పి జాగ్రత్తలు చెప్పేవాడు
పిసినారుల ధనం జంగములకు దానం చేసేవాడు విఠల!


కామెంట్‌లు