నిస్వార్థం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం దానధర్మాలు చేయాలి అనుకున్నా డబ్బు సమస్యతో చేయలేము.కానీ మాట చేత లతో సాయం అదీ నిస్వార్థంగా చేయగలం.మనతో పాటు పక్కనున్న విద్యార్థి కి పాఠం అర్థం కాకపోతే చెప్పడం హోం వర్క్ చేయడంలో సాయం చేస్తే మనకు ఆసబ్జెక్ట్ పై పట్టు వస్తుంది.చదవడంకన్నా కంబైన్డ్ స్టడీస్ తో ఒక్కో పాయింట్ వివరిస్తూ ఉంటే వినేవారికి చెప్పే వారికి లాభం ఉభయతారకం. మనం ఋషులు కూడా ఇలా ఆచరించారు.పరీక్షలటైంలో ఇది ముఖ్యం.భరద్వాజమహర్షి నిరంతరం వేదాధ్యయనం చేస్తూ ఇతరులకు బోధించే వాడు.స్వర్గానికి తీసుకు పోతానని ఇంద్రుడు వచ్చి అడిగినా నిరాకరించాడు.రంతిదేవుడు పేదలు సాధువులకు దానధర్మాలు చేశాడు.అణిమాది అష్టసిద్ధులు వద్దని మోక్షం వద్దని అన్ని ప్రాణులకు హితం కూర్చటమే తనకు సమ్మతి అని అన్నాడు.ప్రాణుల దుఃఖం నేను అనుభవిస్తా అని ఘంటాపథంగా చెప్పినవాడు రంతిదేవుడు. ఇక రామానుజాచార్యులవారికి గురువు మంత్రోపదేశం చేసి " దీన్ని నీలోలోపలే పఠించు.అనర్హులకి చెప్పరాదు " అని అంటే ఆయన వెంట వెంటనే ఆలయం శిఖరం ఎక్కి పెద్దగా చదివి అందరికీ ఉపదేశం చేసాడు.గురువు కోపిస్తే" నాకు నరకం వచ్చినా ఫర్వాలేదు.ఈమంత్రంతో అందరికీ స్వర్గం ముక్తి లభిస్తుంది కదా? అందరిమంచీ  కావాలి నాకు " అనేప్పటికి గురువుగారి కి ఆనందం కల్గింది. అలాగే ప్రసిద్ధ నిర్గుణ భక్తకవి కబీర్ దాస్ దగ్గరకు ఒకవ్యక్తి తన తమ్ముడిని తెచ్చి " వీడు అన్ని చెడ్డ పనులు అలవాట్లతో భ్రష్ఠుడైనాడు.మీరు మార్చండి వీడి ప్రవర్తన" అని అడిగితే కబీర్ జవాబిది " ఏమోయ్! నీలో ఏమీ చెడు నాకు కన్పించడంలేదు.మీఅన్నకన్నా నాకన్నా నీవు చాలా మంచివాడివి" అనగానే ఆతమ్ముడిలో పెద్ద మార్పు వచ్చింది.ఇంతవరకూ అందరి తిట్లు శాపనార్థాలు భరించాడు.మొండిగా తయారైన వాడు ఈప్రశంసతో  పూర్తిగా మారిపోయాడు.కనీసం ఇప్పుడైనా పిల్లల దగ్గర కూచుని పెద్దలు వారి చేత చదివించి రాయిస్తుంటే బొటాబొటి మార్కులు తెచ్చుకునే వారు కూడా మంచి మార్కులు సంపాదించుకోగలరు. మానసికంగా శారీరకంగా వారిని మాటల్తో వేధించకుండా ఉత్సాహంగా నేర్పాలి.పరీక్షల టైం లో ఇదే కౌన్సెలింగ్ అని మనం నేడు అంటున్నాం🌷
కామెంట్‌లు