సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -416
ఆయాచిత మండన న్యాయము
*****
ఆయాచితము అనగా వేగముగా కోరబడినది,అడుగబడనిది,కోరబడనిది.మండనము అనగా భూషణము,అలంకరించుట అనే అర్థాలు ఉన్నాయి.
ఏదైనా వస్తువు గానీ , డబ్బు గానీ ఆయాచితంగా లభిస్తే వాటిని అలంకారముగా, అవసరంగా ఉపయోగించుకోవడాన్ని "ఆయాచిత మండన న్యాయము" అంటారు. 
 ఇది అదృష్ట, దురదృష్టాలకూ, అవినీతి అక్రమాలకు సంబంధించిన న్యాయంగా చెప్పుకోవచ్చు.
 సంపాదించడంలో  సహజంగా రెండు రకాల పద్ధతులు వుంటాయి. ఒకటి శారీరక శ్రమ.రెండవది మానసిక శ్రమ.శారీరక శ్రమ చేసేవారు శ్రమకు తగిన ప్రతిఫలం ఆశిస్తూ వుంటారు.అలా ఆశించడమనేది న్యాయమైనదే.
ఇక రెండవది మానసిక శ్రమ అంటే మేధోమథనం ద్వారా  సంపాదించే వారు.వారి మేధస్సు ద్వారా చేసే శ్రమను పెట్టుబడిగా పెట్టి ప్రతిఫలం ఆశిస్తూ వుంటారు.ఇందులోనూ ఎలాంటి దోషము లేదు.
అయితే అందరూ ఇదే మార్గాన్ని అనుసరిస్తే సమాజంలో ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు, అభ్యంతరాలు వుండేవి కావు.
కానీ అలా జరగడం లేదు.అడ్డదార్లు తొక్కుతూ అపరిమితమైన సంపదను వెనకేసుకు వస్తూ అపర కుబేరులుగా మారిపోతున్నారు.
విలువలకు తిలోదకాలు ఇచ్చిన చోట, స్వార్థం జడలు విప్పిన చోట ఇతరులను దోచుకోవాలనే ఆలోచనలు వస్తాయి.ఆయాచిత సంపద,వస్తువులు సమకూరుతాయి.
తద్వారా ఆయాచితంగా వచ్చిన  వాటి మీద అపరిమితమైన మోజు పెరుగుతుంది.అవి వారి ఆడంబరాలకు గుర్తులుగా మొదలై, ఇంట్లో తమ స్థాయికి తగిన అలంకారంగా మారుతుంటాయి.అలా అరుదైన,ఖరీదైన వస్తువుల సేకరణ దాకా పోతుంది.అవి లేకపోతే బతకలేని అవసరంగా మారుతుంటాయి.
అవి సమకూర్చుకున్న వారు మామూలుగా వుండరిక.గతంలో తామున్న స్థాయిని మరిచిపోయి తామేదో బంగారు చెంచాలతో పుట్టి పెరిగినట్లు ప్రవర్తిస్తుంటారు. 
ఇలా ఆయాచితంగా లభించిన వస్తువులు, సొమ్ము కొందరిని కుదురుగా వుండనీయవు.వాటిని తమ స్థాయిని గుర్తించేందుకు వీలుగా అలంకారములుగా ఉపయోగించేలా, అహంకారాన్ని ప్రదర్శించేలా చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేలా చేస్తుంటాయి.
 ఇలాంటి వ్యక్తులకు సంబంధించి "మంది సొమ్ము మంగళవారం - తమ సొమ్ము సోమవారం" అనే సామెత కూడా ఉంది.
మన పెద్దలు చెప్పిన ప్రతి న్యాయము వెనుక ఓ గొప్ప అంతరార్థం ఉందనేది కాదనలేని వాస్తవం.
మరి ఈ న్యాయమును ఎందుకు చెప్పారనేది ఆలోచిస్తే...
ఆయాచితంగా లభించే వాటిపై ఎలాంటి ఆసక్తి,ఆశ కనబరచకూడదు.అలాంటివి మనిషిని వక్రమార్గంలో నడిపించే ప్రమాదం ఉంది.
అందుకే అలాంటి పనులు చేయకూడదనే హెచ్చరికను సదా గమనంలో పెట్టుకొని న్యాయపరమైన కష్టార్జితంతో ఆనందంగా జీవించటం నేర్చుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు