మాదాడి నారాయణ రెడ్డి (మానారె) “ ఏకతకు పరిష్కారం “నరేంద్ర సందినేని. గేయం పై విశ్లేషణా వ్యాసం.

===================: 

ప్రముఖ కవి,రిటైర్డ్ ప్రిన్సిపల్,ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన ఏకతకు పరిష్కారం గేయం పై విశ్లేషణా వ్యాసం.ఏకతకు పరిష్కారం అనే గేయంను ఆసక్తితో చదివాను. ఇది నాకు నచ్చిన గేయం.గేయం చదవగానే నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఏకతకు పరిష్కారం ఉంటుందా? అని మనలో సందేహాలు పొడచూపవచ్చు.ఏకత అంటే ఐక్యత,కలిసి ఉండటం.దీనికి ఆంగ్లంలో Unity అని అర్థం.దేశం బలంగా ఉండాలంటే ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల్లో ఐక్యత ఉండాలి. దేశం బాగు కోరి ఏమైనా చేయాలి అంటే దాని అంతిమ ఫలితం ఐక్యత వలన సాధ్యపడుతుంది.సంఘీభావం,ఏకత మనిషిని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి.ఇవాళ దేశంలో లేనిది ఐకమత్యం  అని చెప్పవచ్చు.దేశంలో కులం పేరిట,మతం పేరిట మారణహోమం కొనసాగుతుంది.ప్రపంచంలో కూడా అగ్రరాజ్యాలు చిన్న దేశాలపై దాడులు చేస్తూ బాంబులు ప్రయోగిస్తూ ఆధిపత్యం కొరకు పోటీ పడుతున్నాయి.ప్రపంచంలో శాంతిని స్థాపించుట కొరకు ఐక్య రాజ్య సమితి అనే సంస్థ ఉన్నప్పటికీ నామమాత్రంగానే విధులు కొనసాగిస్తూ ఉంది.అగ్ర రాజ్యాల యుద్ధకాంక్షలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నది. మానారెకు దేశం పట్ల అపారమైన ప్రేమ ఉంది.మానారె ఏ రాజకీయ పార్టీకి చెందని వారు.మానారె విద్యార్థిగా ఎం.ఏ. (తెలుగు) ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాదులో చదివారు.చదువు పూర్తి కాగానే ప్రభుత్వ కళాశాలలో ట్యూటర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.మానారె వివిధ హోదాలలో పని చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు.ఏ సమస్యకు అయినా పరిష్కారం ఉన్నట్లుగా ఏకతకు పరిష్కారం ఉంటుంది అని మానారె తన గేయంలో పేర్కొనడం ఆనందంగా ఉంది.దేశంలో కులం పేరిట మతం పేరిట జరుగుతున్న మారణకాండ ఆవేదన కలిగిస్తుంది.దీనికి పరిష్కారం ఏమిటో తెలియదుఏకత సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.ఏకత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.పరిష్కారం అంటే సమస్య చిక్కుల నుండి విముక్తి చెందే మార్గం తీర్పు అని చెప్పవచ్చు.పరిష్కారం అనేది సులువుగా దొరకని విషయం‌.సుదీర్ఘ  కాలంగా అపరిష్కృతంగా దేశంలో నలుగుతున్న ఏకత సమస్యను పరిష్కరించడం కొరకు దేశ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.సమస్యకు పరిష్కారం అనేది అడ్డంకులను అధిగమించడం ద్వారా లక్ష్యాన్ని సాధించే ప్రక్రియ.దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్య ఏకత.దానిని ఎంతో సులభంగా పరిష్కరించవచ్చు అని మానారె తెలియజేయడం ఆశ్చర్యం కలుగుతుంది.మానారె రాసిన ఏకతకు పరిష్కారం చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.దేశ భవితకు మూలమైన ఏకతకు పరిష్కారం తెలుసుకొని దానిని సాధించే ప్రయత్నం చేద్దాం. 

“ భేద భావం పురులు విచ్చిన

“ స్వార్థ శక్తులు నడుము కట్టిన

“ వాని వ్యాప్తిని అణచి పెట్టిన

“ జాతి బలమును పుంజుకొనును. 

ఇవ్వాళ దేశంలో పురులు విచ్చిన భేద భావం కోరలు సాచి ఎల్లెడలా విస్తరించి ఉంది.పౌరులు భేదభావంతో జీవనం సాగిస్తున్నారు.పౌరులు భేదభావం విడిచిపెట్టి సఖ్యతతో మెలిగితే విభేదాలు తొలగిపోతాయి.ఎవరికీ  అందకుండా నాకే చెందాలనుకోవడం స్వార్థం.మనిషి తోటి మనిషికి ప్రతిఫలాపేక్ష లేకుండా సహకారం అందించడం నిస్వార్ధం అని చెప్పవచ్చు.జంతువుల సమూహంలో కూడా జంతువులకు పరస్పర  సహకారం ఉంటుంది.పర్వాలేదు మనం సుఖంగా ఉంటే చాలు.నాది అనుకున్నది నాకే దక్కాలి. పరులది కూడా నాకే కావాలి.మరెవరికి దక్కకూడదు అనే మనస్తత్వంతో ఉండే మనుషులు మనకు సమాజంలో తారసపడుతూనే ఉంటారు. అలాంటి వారిని చూస్తే ఉద్వేగం కలుగుతుంది.అలాంటివారు స్వార్థ శక్తులకు ప్రతిరూపం అని చెప్పవచ్చు.స్వార్థం అనేది ఇతరులతో సంబంధం లేకుండా తన కోసం లేదా ఒకరి సొంత ప్రయోజనం ఆనందం లేదా సంక్షేమం కోసం అధికంగా లేదా ప్రత్యేకంగా ఆందోళన చెందడంగా చెప్పవచ్చు.ఇవ్వాళ దేశంలో స్వార్థ శక్తులు విశృంఖల విహారం చేస్తున్నాయి.స్వార్ధ శక్తులు అలజడులకు అల్లరులకు ప్రాణం పోస్తున్నాయి.స్వార్థ శక్తుల వల్ల దేశం విచ్ఛిన్నమైపోతుంది.స్వార్థ శక్తులైన పౌరులు నడుము కట్టి పూనుకొని అలాంటి వారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి.స్వార్థ శక్తులపై ఉక్కు పాదం మోపి వాటిని అడ్డుకోవాలని మానారె అంటున్నారు. నిజమైన ఆనందం సాటి మనిషికి స్వార్థం లేకుండా సాయం చేయడంలో మాత్రమే ఉంటుంది.స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ పెరుగుతుంది.భేదభావంతో మెలుగుతున్న స్వార్థపరులైన  ప్రజల దురాగతాలను అణిచివేయాలి అని మానారె పిలుపు ఇస్తున్నారు. భేద భావంతో ప్రవర్తించే జనుల,స్వార్థ శక్తుల ఆగడాలు అరికట్టి వేసినచో జాతి బలాన్ని పుంజుకుంటుంది అని మానారె భావిస్తున్నారు. 

“ సర్వమానవ సౌభ్రాతృత్వం

“ సర్వ మతాల సమానత్వం

“ అన్ని కులాల అభేద (భావం) తత్వం

“ వెల్లి విరియాలి  మన జాతిలో నిత్యం.

కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి ఆర్యులు రూపొందించిన వ్యవస్థ. తమలో తాము వివాహాలు చేసుకుంటూ ఒక విధమైన జీవన సరళని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు.వృత్తి, ఆచారాలు,సామాజిక స్థాయి వంటి అనేక అంశాలు కులాల్లో పరంపరాగతంగా కొనసాగేవి.ఇవి వంశ పారంపర్యంగా పాటించబడతాయి.సాధారణంగా కులవృత్తులు,కులవివాహాలు,సంస్కృతి,సామాజిక స్థాయి రాజకీయాలపై అత్యంత ప్రభావాన్ని చూపుతుంది.దేశంలో ఇంకా కుల వ్యవస్థ కొనసాగుతున్నది.కుల వ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఏర్పడినవి.భారత దేశంలో కులం అనే పదం జాతి లేక సామాజిక వర్గాన్ని సూచిస్తుంది.ఆకృతి,ధర్మము మొదలైన వాటిలో సమాన దృష్టితో ఆలోచించి చేసే విభాగం జాతి. వంశపారంపర్యంగా వచ్చే కుల సంప్రదాయం జాతి.పూర్వీకుల నుండి వచ్చు వర్గం లేక సమూహం జాతి.అనేక ఉపజాతులు గల వర్గం జాతి. సౌభ్రాతృత్వం అనునది సోదరత్వం. సాధారణంగా ఈ పదం సమాజంలో గల విభిన్న మతాలకు వర్గాలకు భాషలకు సంస్కృతులకు అతీతంగా మానవుల మధ్య గల ప్రేమ,గౌరవాల భావనలనే సౌభ్రాతృత్వం అని నిర్వచిస్తారు.సర్వ మానవ ప్రేమ,మానవ కల్యాణం,విశ్వమానవ సమానత్వం, వసుధైక కుటుంబం మున్నగు ఉన్నత భావనలు,సత్ - నీతి, ప్రకృతి నియమాలు,విశ్వజననీయ మానవ సూత్రాలు,సమ్మిళిత సామాజిక స్పృహలు మూల వస్తువులు కలిగిన ఓ విశాల దృక్పథమే సౌభ్రాతృత్వంగా చెప్పవచ్చు.విద్య,వృత్తి నైపుణ్యాలు,నీతి,జాతి,మతాలు,రాజకీయాలు,దానధర్మాలు,వ్యక్తిగత ఆదర్శాలు,సేవారంగం,కళలు, కుటుంబ అధికారాలు మున్నగు అనేక రంగాలలో పెంపొందించవచ్చు..సౌభ్రాతృత్వం వలన పరస్పర అవగాహన, సహకారం,ఉత్పాదకతల అభివృద్ధిని శాంతియుత జీవనాన్ని సాధించవచ్చు. సౌభ్రాతృత్వం వలన ధర్మబద్ధమైన జన జీవనం అనే కొత్త వరవడిని సృష్టించవచ్చును.సౌభ్రాతృత్వానికి ప్రపంచంలో ఏ విషయాన్ని అయినా సాధించగలిగే శక్తి ఉంది. సౌభ్రాతృత్వం మాటల్లో వర్ణించడానికి సాధ్యం కాని ఉన్నతమైన భావన.మనసు నుండి జనించే ఓ విశాల దృక్పథం.దానిని భౌతికంగాను ,ఆధ్యాత్మికంగాను కొలవనువచ్చు.సౌభ్రాతృత్వం వలన మానవునికి అనేక రంగాలలో దూసుకుని వెళ్లే అద్భుతమైన నైతిక స్థితి ఏర్పడుతుంది. భారతీయులం మనం అందరం ఒకటే అనే భావనతో మెలగాలి.మనం అందరం భారతమాత బిడ్డలం.కష్టసుఖాలలో అందరం కలిసి మెలిసి ఉండాలి.మనం అందరం ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం.మనం అందరం అన్నదమ్ముల వలె ఐక్యతతో మెలగాలి.తల్లి బిడ్డలు ఎలా కలిసిమెలిసి ఉంటారో,సుఖదుఃఖాలను ఏ రీతిగా కలిసి పంచుకుంటారో,అదే విధంగా సర్వమానవులు సౌభ్రాతృత్వంతో సోదర సోదరీ భావంతో ప్రవర్తిల్లాలి.ఎదుటి వారికి కష్టం వస్తే వారి కష్టాలలో పాలు పంచుకొని వారి దుఃఖాన్ని దూరం చేసి సహాయపడాలి.మన భారతదేశంలో హిందూ, ఇస్లాం,క్రిస్టియన్ మొదలైన ఎన్నో మతాలు వ్యాపించి ఉన్నాయి.మన దేశ పౌరులు తమకు ఇష్టమైన మతాన్ని అవలంబిస్తారు.భారతదేశం లౌకిక దేశంగా ప్రసిద్ధి పొందింది.మన దేశ పౌరులు తమకు ఇష్టమైన దైవాలను పూజించుకుంటారు. భారతదేశంలోని పౌరులు అందరికీ రాజ్యాంగం ద్వారా మత స్వేచ్ఛ కల్పించబడింది.భారతదేశంలో నివసించే ప్రజలు నా మతమే గొప్పది,నా మతమే శ్రేష్టమైన మతం,నా దేవుడు గొప్పవాడు అంటే లేదు.నా దేవుడే గొప్పవాడు అని కలహించుకోకుండా ఉండాలి.అన్ని మతాలు దేవుడు ఒక్కడే అని చెబుతున్నాయి.అన్ని మతాల పూజా విధానాలు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి.అన్ని మతాలు సమానం అనే ఆలోచన భారతదేశంలో నివసిస్తున్న ప్రజల్లో నెలకొంటే శాంతియుతమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. మనదేశంలో అనాదిగా అనేక రకాల కులాలు ఉన్నాయి.విభిన్న కులాలుగా శాఖోపశాఖలుగా కుల వ్యవస్థ వేళ్ళూని ఉంది.భారతదేశంలోని ప్రజలు కులవిద్వేషాలు,కుల వైష మ్యాలు తొలగి సోదర భావంతో సఖ్యతగా మెలగాలి.మా కులమే గొప్ప అనే ఆలోచనలు జనుల మనస్సులలో నాటుకుపోయినాయి.అంతేకాక ప్రతి కులంలో మరిన్ని ఉప కులాలు ఏర్పడి మనుషుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.మానవులందరిది ఒకే కులం.అన్ని కులాలు సమానం అనే భావనతో  మానవ కులంగా రూపుదిద్దుకోవాలి. కులాల మధ్య చెలరేగే కులాల కుంపట్లు అనే బేధ భావం తొలగిపోవాలి.మంచి అన్నది మాల అయితే మాలనే అగుదును అని మహాకవి గురజాడ అప్పారావు తన గేయంలో పేర్కొన్నారు.గురజాడ అందించిన స్ఫూర్తిని ప్రజలు అనుసరిస్తే అన్ని కులాల రూపురేఖలు మారిపోతాయి.మన అందరిది ఒకే కులం అనే భావన వస్తే గొప్ప సమాజం రూపు దాల్చుతుంది అనుటలో సందేహం లేదు. భారతదేశంలో నివసిస్తున్న పౌరులు అందరు తమది భారత కులంగా తలంచాలి.మన దేశ ప్రజలంతా ఇటువంటి గొప్ప ఆలోచనలతో మెలగాలి. మనదేశంలోని ప్రజల్లో మార్పు వస్తే గొప్ప జాతిగా ఖ్యాతిని పొంది ప్రపంచమంతటా విస్తరిస్తుంది.మన దేశంలోని ప్రజల్లో సర్వ మానవ సౌభ్రాతృత్వం అనే భావన ఆచరణలోకి రావాలి.మన దేశ ప్రజల్లో సర్వ మతాల సమానత్వం అనే భావన ప్రోది చేసుకోవాలి. మన దేశ ప్రజల్లో నెలకొన్న భేద భావాలు తొలగిపోయి అన్ని కులాలు కలిసి మెలిసి ఉండాలి. విశాల భావాలతో నిండిన మన దేశ ప్రజల్లో సుఖసంతోషాలు వెల్లి విరిసి జాతి ఖ్యాతి ఇనుమడిస్తుంది అని కవి మానారె చెప్పిన తీరు చక్కగా ఉంది.

“ రక్త పిపాసి రాక్షస మూకల

“ అడ్డు కొనాలి శౌర్యపు వాకల

“ లంచం కోరే నీచుల చేతుల

“ బంధించాలి నీతుల గొలుసుల.

స్వార్థపరులుగా మారి హింసా మార్గంలో పయనిస్తూ రక్త దాహానికి అలవాటు పడ్డ కనికరం లేని రాక్షసుల సముదాయాన్ని అడ్డుకోవాలి.మనిషిలోని రాక్షస ప్రవృత్తిని మానిపించాలి.స్వార్థపరులను దయాపరులుగా, పరోపకారులుగా,గొప్ప మనసున్న మనుషులుగా మార్చాలి.సరియైన చదువు, సంస్కారం లేక రాక్షసులుగా తయారయ్యారు. పెద్దలు,గురువుల శిక్షణ లేక సరైన మార్గదర్శనం లేక స్వార్థపరులుగా,అసాంఘిక శక్తులుగా తయారై సమాజానికి తీరని  ద్రోహం చేస్తున్నారు. మనుషులుగా జన్మించినప్పటికి కఠిన చిత్తులుగా, కర్కోటకులుగా,కాముకులుగా,హంతకులుగా,రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు.సమాజానికి చేటు చేస్తున్న నరహంతక రాక్షసులను శౌర్యవంతులై ఎదుర్కోవాలి.ధైర్యవంతుల శౌర్యపు ప్రవాహాలే ఇలాంటి దుర్మార్గుల పాపపు పనులకు అడ్డుకట్టగా నిలుస్తాయి.రాక్షస ప్రవృత్తి గల మనుషుల మనస్సులను మార్చడం శౌర్యవంతుల వల్లనే సాధ్యమవుతుంది.సమాజంలో విచ్చలవిడిగా లంచగొండితనం పెరిగిపోయింది.ఏ పని కావాలన్నా లంచం ఇవ్వనిదే జరగని దుస్థితి ఏర్పడింది.మంచి పూల తోటలోనికి ఒక్క గుడ్లగూబ చొరబడితే చాలు,ఆ పూల తోట అంతా నాశనం అవుతుంది. అటువంటిది కొమ్మ కొమ్మకు రెమ్మ రెమ్మకు గుడ్లగూబలు ఉంటే ఆ పూల తోట పూర్తిగా  విధ్వంసం కాకుండా ఉండగలదా? పూల తోట లాంటి సమాజంలోకి కలుపు మొక్కలాంటి దుర్మార్గులు ప్రవేశిస్తే ఏమవుతుంది? పూల తోటలోకి దుర్మార్గులు ప్రవేశిస్తే తోటను విధ్వంసం చేస్తారు. పూల తోటలోనుండి కలుపు మొక్కలను ఏరివేయాలి.పూల తోటలోకి గుడ్లగూబ వచ్చి చేరినట్లయితే దానిని తరిమి వేయాలి.పూల తోట లాంటి సమాజాన్ని కాపాడుకోవాలనే సందేశం చక్కగా ఉంది.అన్నిచోట్ల సర్వత్రా ఇందు గలడు అందు లేడు అని చెప్పినట్లు అంతటా లంచగొండితనం వ్యాపించి ఉంది.సమాజంలో నెలకొన్న లంచగొండితనంను పూర్తిగా అరికట్టాలి. లంచగొండితనం ఏ రూపంలో ఉన్నా దానిని పారదోలితేనే సమాజం పూర్తిగా అభ్యుదయ పథంలో కొనసాగుతుంది.లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిని అవినీతి నిరోధక శాఖ నామమాత్రంగా కేసులు పెట్టి వదిలివేస్తున్నారు. లంచం తీసుకున్న అవినీతిపరులకు ఎలాంటి శిక్షలు పడటం లేదు.అవినీతి నిరోధక శాఖ లంచగొండులపై  కేసులు పెట్టినప్పటికీ సరియైన సాక్ష్యాలు చూపించకపోవడం వల్ల కేసులు వీగిపోతున్నాయి.అవినీతి నిరోధక శాఖ లంచగొండులను ఏమీ చేయదు అనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.అవినీతి నిరోధక శాఖ గుట్టు ప్రజలకు తెలిసిపోయింది.లంచగొండులను నీతిపరులుగా,ధర్మపరులుగా మార్చాలి. లంచగొండుల చేతులకు ఇనుప సంకెళ్లు వేయడం ద్వారా కాకుండా నీతులు అనే గొలుసులతో బంధించాలి.సమాజంలోని ప్రతి ఇంటిలోని వారిని నీతిపరులుగా మార్చాలి.అప్పుడు సమాజంలో లంచగొండులనే వారు ఉండరు.

“ జాతి జీవం దాని సంస్కృతి

“ జాతి చేతన దానివి విస్తృతి

“ జాతి వేదన కేది నిష్కృతి

“ జాతి ఏకతయే పరిష్కృతి.

జాతి చక్కగా మనుగడ సాగించడానికి సనాతన కాలం నుండి వస్తున్న ఆచార వ్యవహారాలు,ధార్మిక అంశాలతో కూడిన ప్రవర్తన ప్రధానం.జాతి యొక్క సంస్కృతి సంప్రదాయాలే జాతిని సజీవంగా నిలుపగలుగుతాయి.జాతి చేతన జాగృతమయితే జాతి చేతనత్వాన్ని పొందితే తమదైన సంస్కృతిని తిరిగి ఆచరణలోకి పెడితే ఆ జాతి  వ్యాప్తిని పొందుతుంది.ఇటువంటి లోపాల చేత మానవ జాతి అంతా ఆపదలకు కష్టాలకులోనవుతున్నది.జాతి ఎదుర్కొంటున్న బాధలకు నిస్కృతి ఏది? భారతదేశం ఎదుర్కొంటున్న భేద భావన, కులమతాల చిచ్చు,మానవ మృగాల రాక్షస కృత్యాలు,అవినీతి కరాళ నృత్యం మొదలైన వాటి వల్ల సమాజం అనుభవిస్తున్న బాధలు అన్ని తొలగిపోవాలి.ప్రజల మేలుకోరే నీతివంతమైన సుపరిపాలన అందించే రాజ్యం రావాలి.ప్రజా శ్రేయస్సు కోరే నీతి గల,ధర్మం గల రాజ్యం రావాలి.ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగే దివ్యమైన మార్గానికి దేశ ప్రజల సమైక్యతే దారి చూపాలి. ప్రజలందరు కులమత బేధాలను మరచి పోయి తాము అందరం ఒకటే.ఈ దేశం మనది.మనం అందరం మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుతూ కుల మతాలకు అతీతులమై ఐక్యమత్యంతో మెలగాలి అనే ఏకాభిప్రాయానికి రావాలి.భారతదేశ ప్రజలకు కలిగే బాధలన్ని క్రమ క్రమంగా తొలగిపోతాయి.ప్రజలందరు సుఖసంతోషాలతో అలరారుతూ ప్రశాంతమైన జీవనం సాగిస్తారు.ఏకతకు పరిష్కారం అనే చక్కటి గేయం ద్వారా సమాజానికి స్ఫూర్తిని అందిస్తున్న కవి మాదాడి నారాయణరెడ్డిని (మానారెని) అభినందిస్తున్నాను.మానారె మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కామెంట్‌లు