సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -399
ఆభణక న్యాయము
*****
ఆభణకము అనగా సామెత, లోకోక్తి.
ఆభణక న్యాయము అనగా కొంతమంది తమ మాటల మధ్యలో అదేదో సామెత చెప్పినట్లు అంటుంటారే కాని ఆ సామెత ఏమిటో చెప్పరు. అలా ఊతపదంగా ఇలాంటి వాక్యాలు మాట్లాడే వారిని ఉద్దేశించి చెప్పిందే ఈ"ఆభణక న్యాయము".
 అసలు సామెతలు అంటే ఏమిటో అవి జనాల నోళ్ళలో సజీవంగా ఎలా ప్రవహిస్తున్నాయో  వాటి గురించి కొన్ని ముచ్చట్లు, మరికొన్ని విషయాలు, విశేషాలు తెలుసుకుందాం.
సామెతలు లేదా లోకోక్తులు అనగా మరల మరల వాడబడే వాక్యాలు. వీటిని సంస్కృతంలో లోకోక్తులు, న్యాయములు అని పిలుస్తారు.లోకోక్తి అనగా విశేషమైన లోకానుభవం కలిగిన పెద్దల మాట.ఈ సామెతలు,లోకోక్తులు  ఆయా భాషలు మాట్లాడే ప్రజల యొక్క సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి.ఇవి భాషకు తొడిగిన అందమైన ఆభరణాలు. వీటిల్లో భాష యొక్క సౌందర్యం, అనుభవాల సారం, నీతి సూచన, హాస్యం,వ్యంగ్యం మొదలైనవన్నీ కలగలిపి ఉంటాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు ఉండదు" అంటుంటారు. ఆమెత అంటే విందు, పిలుపు ఉత్సవము అనే అర్థాలు ఉన్నాయి.ఈ సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని సూక్తులు,జనాంతికాలు అని కూడా అంటుంటారు.
 సామెత లేని మాట , సంభాషణ గానీ , ప్రసంగం కానీ ఎదుటి వ్యక్తులను అంతగా రంజింపజేయదు.సందర్భోచితంగా ఉపయోగించే సామెతలు హృదయాలను గెలుచుకుంటాయి. ఇవి సాధారణంగా చాలా తేలికైన భాషలో అనగా సామాన్యులకు సైతం  అర్థమయ్యే విధంగా  చాలా సరళంగా వుంటాయి.
సామెత అనే మాట 'సామ్యత' అంటే పోలికతో చెప్పడం. అందుకే సామెత చివర్లో తరచుగా 'అన్నట్లు'అనే పదం వస్తుండటం గమనించవచ్చు.
పెద్దవాళ్ళు ఉన్న ఇళ్ళలో  సామెతలకు కొదవుండదు.వారు మాట్లాడే ప్రతి  మాటలో, హితోక్తుల్లో  సామెతలు అలా గలగలా ప్రవహిస్తూ వుండడం నేటికీ మనం గమనించవచ్చు.
 మరి ఈ సామెతలు నిత్య జీవితంతో ఎంతగా పెనవేసుకున్నాయో, ఎన్ని లాభాలు ఉన్నాయో  చెప్పనక్కర్లేదు.
చదువురాని పామరుడు సైతం తన సంభాషణలో అలవోకగా సామెతలను ఉపయోగించడం విశేషం.
 ఎంత కటువైన విషయాన్నైనా, హితోక్తులనైనా సామెతలో మృదువుగా చెప్పవచ్చు.ప్రసంగాలలో ఉపయోగించే సమయస్ఫూర్తి సామెతలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
 ఇవండీ  ఆభణకము యొక్క  విశేషాలు.
ఇక అసలు విషయానికి వద్దాం.
కొంతమంది ఏదైనా విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు  ఫలానా/అదేదో సామెతలాగే వుంది అంటుంటారు.మరి ఆ సామెత ఏమిటో విందామని ఎదురు చూస్తున్న వ్యక్తికి మిగిలేది నిరాశే.  అలా అనడమే కాని ఆ సామెత ఏమిటో  చెప్పరు.అలాంటప్పుడు అసలా వ్యక్తికి ఆ సామెత తెలుసా? అనే సందేహం  వస్తుంది.
మరి కొంతమంది యుక్తిగా అదేదో సామెత చెప్పినట్టు  అనగానే ఎదుటి వ్యక్తి చటుక్కున అందుకుని ఆ సామెత ఏమిటో చెప్పడం. 'ఆ నేను అదే చెబుదాం అనుకున్నా! ఇంతలో మీరే చెప్పారే' అంటే కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఏమైతేనేం "అభణక న్యాయము" ద్వారా సామెతల గురించి ఎంతో కొంత తెలుసుకున్నాం కదండీ! అని నేనంటే...ఆ  "చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు" గా  రాసేవారికి చదివే వారు లోకువ అనకోకండేం. ఎందుకంటే ఏదో నాకు తెలిసిన,చదివిన నాలుగు మాటలు మీకు తెలియజేయాలనే తపన. అంతే సుమండీ!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు