నేనొక పూలమొక్కకడ నిలిచి...!!-----సత్యగౌరి.మోగంటి.
 మొక్కలన్నా,పిల్లలన్నా,పుస్తకాలన్నా, ప్రకృతి అన్నా నాకుచాలా ఇష్టం.
వీటి వలన మన జన్మ ధన్యమవుతుంది కూడా.
మొక్కలను,పిల్లలను పెంచడానికి కాస్తంత ఓర్పు,నేర్పు ఉండాలి సుమండీ.అయితే గాక
 ఫలితం మాత్రం అత్యంత సుమధురంగా ఉంటుంది.
ఎంత ఉల్లాసంగా ఉంచుతాయో మనలనుఅవి.
వారం రోజుల నుండి అదే పనిగా
చూస్తున్నాను మొక్కలను.
ఓ పక్క మల్లె సువాసనలు,ఇంకో పక్క మరువం పరిమళాలు
మనసంతా ఆహ్లాదాన్ని నింపేస్తున్నాయి.
మల్లెకు,మగువకు విడదీయలేని అవినాభావ సంబంధం ఉంటుందనుకుంటా.
మల్లె -పూలలోనే రాణి కదా.!
ఆ మందార మొక్కో,మల్లె మొక్కో,లేకుంటే ఆకు కూర ఇలా వాటిని చూస్తుంటే అదో అలౌకిక ఆనందం.
అందుకే కాసిని పూల మొక్కలు,మైక్రోగ్రీన్స్
పెంచుతాను  ఇంట్లో.
ఇంట్లో కుండీలలో మనం పెంచిన ఆకు కూర కోసి పప్పులో వేస్తే ఆ రుచి,ఆ అనుభవం కూడ అద్భుతం కదా.
మొక్కలకు గొప్పు తవ్వుతున్నా,పాదు చేస్తున్నా,కొమ్మలను కత్తిరిస్తున్నా,నీరు పెడుతున్నా
ఎంత ఆనందం ఉల్లాసమో.
ఇన్ని నీళ్లు పోస్తే బోలెడు నవ్వులు
పంచుతాయి మనకు కానుకగా.
ఈరోజు సాయంత్రం బాల్కనీలో కూర్చుని
చూస్తున్నాను.
మల్లె మొక్క నీటితో తడిసి  మొగ్గలతో మెరిసిపోతుంటే అది నాతో కబుర్లు చెబుతున్నట్టే అనిపించింది.
ఇలా ఏ మొక్కని చూసినా అలాగే అనిపిస్తుంది.
అవి అంత అందంగా,ఆరోగ్యంగా కనబడితే ఎంత విజయగర్వమో.
స్కూల్లో పని చేసేటప్పుడు పిల్లలు నేను బాగా మొక్కల్లో పని చేసేవాళ్లం.
తోట పని పిల్లలకు అందరికీ కూడా చాలా మంచిదని అంటారు.
మొక్కల పెంపకం మనసుకు ప్రశాంతతను చేకూర్చుతుంది.బయటైనా కావొచ్చు
ఇంట్లోనైనా కావొచ్చు,పెరుగుతున్న మొక్కను చూడగానే మనసంతా పాజిటివిటీతో నిండిపోతుంది.
ఈ మొక్కల పెంపకం మానసిక ఆరోగ్యాన్నిపెంపొందిస్తుంది.                        మానసిక స్థితిని మెరుగు పెంచడంలో కూడా సహాయపడుతుందిట.
అందమైన రంగురంగుల పువ్వులు,ఆకు పచ్చని ఆకులు తడితో మెరుస్తూ మట్టి పరిమళంతో మన మనసుని,శరీరాన్ని కూడా రిలాక్స్ చేసి,ఎలాంటి ఒత్తిడినైనా,  ఆందోళననైనా దూరం చేస్తాయి.
ఏకాగ్రత, శక్తిని మెరుగుపరచడానికి, మానసిక ఆరోగ్య రుగ్మతల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మెదడులో ఒక నిర్దిష్ట రసాయనం ఉంటుంది.అది తోటపని చేస్తున్నప్పుడు సానుకూలంగా ప్రభావితమవుతుందని అది మెదడులో డోపమైన్‌ను  పెంచడంలో సహాయపడుతుందని,మరియు ప్రకృతితో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు ఇతరుల కంటే సంతోషంగా మరియు మంచి మానసిక స్థితిలో ఉంటారని నిపుణులు ఉవాచ.
ప్రకృతి ఎల్లప్పుడూ మానవులకు ప్రేరణ ప్రశాంతత సముద్రాలు,అలలు,కొండలు,కోనలు,ఎత్తైన పర్వతాలు,లోయలు,కనుమలు,అడవులు,చెట్లు,పక్షులు ఇవన్నీ కూడా మన మనసును ఉల్లాసపరుస్తాయి. ఈఉరుకులు,పరుగుల ప్రపంచంలో ప్రకృతిలో గడపడం చాలాఅవసరం.    ఒత్తిడి,ఆందోళన,నిరాశను తగ్గించడానికి ఇవి దోహదపడతాయంటున్నారు.
అంతే కాదు బి.పి కూడా తగ్గుతుందని,గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని
డాక్టర్లు చెబుతున్నారు.
ఇంకా శ్రద్ధ,జ్ఞాపకశక్తి మెరుగుపడతాయని పరిశోధనలో తేలిందిట.
ఏదైనా ఈ మొక్కలు మనకెంత ఉపయోగమో కదా!
                                ***

కామెంట్‌లు