సుప్రభాత కవిత ; - బృంద
గుండె అడుగున
చిక్కబడిన చెమ్మలన్నీ
నీ రాకతో  పండుగలా
కరిగి నీరయేను కాదా?

నల్లగ కుమిలే నింగి
వల్లమాలిన  ఆనందంతో
నారింజ రంగు పులుముకుని
నీకు హారతులిచ్చేను కదా!

నీ ఆగమనం చూసి 
నీ వెంట పరుగుతీయాలని
హిమమంతా జలధారై
కరిగి పరుగులు తీసేను కాదా!

నింగి నుండి నేలకు
నిచ్చెనలా  నీ కాంతులు
దిగివచ్చే సమయాన
వేడుకంత వెలుతురై పోదా!

అంతులేని కరుణనంతా
కిరణాలలో నింపి
అలవోకగా ఇలపైన
కురిపించేది నీ అనుగ్రహమేగా!

చెదిరిన నవ్వులన్ని 
పువ్వులై విరిసేలా
బెదిరిన మనసులన్నీ
కుదుటబడి నిలిచేలా

ధారుణిలో  ప్రతి అణువూ
చైతన్యం నింపుకునే
ప్రత్యూషపు ప్రభలన్నీ
నీవు పంచే ప్రేమ కాదా!

మేలుకొలుపు పాడే అరుణరేఖల
ఉదయరాగాలతో  హృదయమంతా 
ఉత్సాహం నిండిపోయి చూపులతో
అర్ఘ్యమిచ్చి అంజలి ఘటిస్తూ

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు